
పాతాళంలో గంగమ్మ
గంగమ్మ అథం పాతాళం నుంచి పైకి రానంటోంది. జిల్లాలో భూగర్భజలాల మట్టం రోజురోజుకూ పడిపోతుంది. నెలరోజుల వ్యవధిలో 0.26 మీటర్ల నీటిమట్టం పోయింది. జులైలో 11.67 మీటర్ల లోతులో ఉండాల్సిన నీరు ఆగస్టు చివరినాటికి 11.93 మీటర్లకు తగ్గిపోయింది.
సాక్షి, మహబూబ్‌నగర్:
ఈసారి వర్షాలు అంతంతమాత్రంగానే కురుస్తున్న నేపథ్యంలో భూగర్భజలాలు ఆందోళనకరంగా మారాయి. గతేడాది భారీవర్షాల కారణంగా ఈ ఏడాది కాస్త మెరుగ్గానే భూగర్భజలాలు నమోదయ్యాయి. ప్రస్తుత ం నమోదవుతున్న నీటి పరిణామాన్ని బట్టి చూస్తే బోర్లలో నీరు అందుబాటులోనే ఉంది. దీంతో ఈ ఏడాది బోర్ల కింద సాగుచేసిన ఖరీప్ పంటలకు ఎలాంటి ఢోకా ఉండకపోయినా.. రబీ పంటలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని భూగర్భజల వనరుల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
గతేడాది వానలే జీవం
జిల్లాలో గతేడాది చివరిలో కురిసిన భారీవర్షాలకు భూగర్భ జలాల నమోదు కాస్త మెరుగుపడింది. గతేడాది సాధారణ వర్షపాతం కంటే దాదాపు 277.33 మి.మీటర్ల వర్షపాతం అదనంగా కురిసింది. సాధారణం కంటే 47శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. దీంతో భూగర్భజలాల మట్టం మెరుగైనస్థితికి చేరుకుంది. గతేడాది ఆగస్టులో 12.27 మీటర్ల మేర నమోదైన నీటిమట్టం ఈ ఏడాది ఆగస్టులో 11.93 మీటర్లుగా నమోదైంది. గతంతో పోల్చితే 0.34 ఎంబీజీఎల్ పైనే అదనంగా నీరు అందుబాటులో ఉంది. ఈసారి మాత్రం పరిస్థితి అందుకు కాస్త భిన్నంగా ఉంది. వర్షాపాతం తక్కువస్థాయిలో నమోదైంది. ఇప్పటివరకు జిల్లాలో 446.8 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా కేవలం 327.2 మి.మీ మాత్రమే కురిసింది. అంటే సాధారణ ం కంటే 27శాతం తక్కువగా నమోదైంది.
జిల్లాలోని ఖిల్లాఘన్‌పూర్ మండలంలోని కమలోద్దీన్‌పూర్‌లో కేవలం 0.90 మీటర్ల లోతులోనే నీరు అందుబాటులో ఉంది. అలాగే ధరూరు మండలంలో మాత్రం అతి దారుణమైన స్థితిలో భూగర్భజలమట్టం నమోదైంది. ధరూరులో అత్యధికంగా 39.20 మీటర్లు తోడితే కానీ నీరు అందుబాటులో రావడంలేదు. ప్రస్తుతం జిల్లాలో నీటికోసం దాదాపు 14 మండలాల్లో 20మీ.. కంటే ఎక్కువ లోతు తోడాల్సి వస్తోంది.
వివిధ మండలాల్లో నమోదైన భూగర్భజల మట్టాలు(మీటర్లలో)
మండలం 2011 2012 2013 2014
జడ్చర్ల 19.75 22.82 18.75 17.32
నాగర్‌కర్నూల్ 14.57 20.28 24.34 14.78
కల్వకుర్తి 20.83 26.62 31.54 25.95
కొడంగల్ 06.13 08.06 08.37 13.87
నారాయణపేట 06.38 09.03 10.66 11.96