‘ఉపాధి’లో ధీర | Upadi Hami Pathakam Works In Medak | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’లో ధీర

Published Mon, Apr 15 2019 10:49 AM | Last Updated on Mon, Apr 15 2019 10:49 AM

Upadi Hami Pathakam Works In Medak - Sakshi

కుసునూర్‌లో ఉపాధి పనులకు వచ్చిన మహిళా కూలీలు

రాయికోడ్‌(అందోల్‌): మహిళలు పిల్లల ఆలనాపాలన చూడటం, ఇంటి పనులు చక్కదిద్దుకోవడంతోపాటు కుటుంబ ఆర్థిక అవసరాల్లోనూ పాలు పంచుకుంటున్నారు. ఒకప్పుడు మహిళలు వంటింటికే పరిమితమయ్యేవారు. కానీ ప్రస్తుతం కుటుంబ యజమాని సంపాదన ఇంటి అవసరాలకు సరిపోకపోతుండడంతో మహిళలు బయట పనికి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. వారు కష్టపడుతూ ఇంటి ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

పట్టణ ప్రాంత మహిళలు విద్య, వైద్య, వ్యాపార రంగాల్లో రాణిస్తుండగా గ్రామీణ మహిళలు శ్రామిక రంగంలో బాధ్యతాయుతంగా పని చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోనూ మేము సైతం అంటూ పురుషులతో సమానంగా చెమటోడ్చి వారి కుటుంబాల ఆర్థిక అవసరాలను తీర్చుకోవడంలో కృషి చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో వ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో మహిళలే అధికంగా పనులు చేస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. తద్వారా వచ్చే కూలీ డబ్బును తమ కుటుంబాల పోషణకు వినియోగించుకుంటున్నారు.
 
గ్రామీణ మహిళలకు వరంగా ఉపాధి పథకం
గ్రామీణ ప్రాంతాల్లో పురుషులకే తగిన పనులు దొరకడం కష్టంగా ఉండేది. ఇక మహిళలకు పని దొరకడం అత్యాశగానే ఉండేది. ఈ నేపథ్యంలో పనులు లేక పొట్ట నింపుకోవడానికి పల్లెను వదిలి పట్టణాలు, నగరాలకు కూలీలు వలస వెళ్లకూడదనే లక్ష్యంతో ఉన్న చోటే పని కల్పించాలని 2005వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశ పెట్టింది. పేద ప్రజలకు అండగా నిలిచిన ఈ పథకం ప్రారంభంలో పురుషులే పనులకు వెళ్లేవారు. పెరిగిన ధరలు, ఆర్థిక అవసరాలు, పిల్లల పోషణ తదితర కుటుంబ అవసరాలకు పురుషుల పనితో వచ్చే ఆదాయం సరిపోక గ్రామీణ కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి.

ఈ పరిస్థితులను అధిగమించడం కోసం మహిళామణులు మేము సైతం అంటూ పనుల్లోకి దిగారు. కొన్ని సంవత్సరాలుగా పురుషులతో కలిసి ఉపాధి పనులకు వెళ్తున్నారు. వంద రోజుల పనులు పూర్తి చేసి వారికి వచ్చే ఆదాయాన్ని కుటుంబ పోషణ కోసం ప్రణాళికతో ఖర్చు చేసుకుంటున్నారు. అదేవిధంగా పొదుపు కోసం మహిళా సంఘాలుగా ఏర్పడి ఈజీఎస్‌ పనుల్లో చురుకుగా పాల్గొంటున్నారు. కొన్నేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో పంటల దిగుబడి రాక దిగాలు చెందుతున్న తమ కుటుంబాలకు ఉపాధి పథకం వరంగా మారిందని మహిళా కూలీలు చెబుతున్నారు.  ప్రతీ ఏడాది వంద రోజుల పాటు పనులు చేసి ఉపాధి పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామని అభిప్రాయపడ్డారు. వర్షాలు కురవక వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలతో పెద్దగా లాభాలు రావడం లేదు. దీంతో ఉపాధి పథకంలో పని చేయగా వచ్చిన డబ్బును మహిళలు పిల్లలను చదివించేందుకు ఫీజుల కోసం, ఇతర కుటుంబ ఖర్చుల కోసం వినియోగిస్తున్నారు.
 
జిల్లాలో ఉపాధి పథకం వివరాలు
ఉపాధి పథకం పనుల్లో పురుషుల కంటే మహిళలే అధికంగా పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 2,19,245 జాబ్‌ కార్డులు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సర లెక్కల ప్రకారం 79,313 కుటుంబాలకు చెందిన 1,33,947 మంది కూలీలు ఉపాధి పనులు చేశారు. అందులో 75,708 మంది మహిళా కూలీలు ఉండగా 58,239 మంది కూలీలు పురుషులు ఉన్నారు. అంటే ఉపాధి పథకంలో పురుషుల కంటే 17,469 మంది మహిళా కూలీలు అధికంగా పని చేస్తున్నారు. గతేడాది జిల్లాలో పూర్తయిన ఉపాధి పనుల్లో 56.53 శాతం ఉపాధి పనులను మహిళా కూలీలు చేస్తే 43.47 శాతం పనులను పురుష కూలీలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి.

2018–2019 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పనులకు సంబంధించి రూ.71.97 కోట్ల డబ్బును ఖర్చు చేశారు. అందులో 46.77 కోట్లను కూలీలకు వేతనంగా చెల్లించగా 16.3 కోట్లను మెటీరియల్‌ కోసం వెచ్చించారు.  కోరిన ప్రతి కూలీకి పనులు కల్పించేందుకు అధికారులు ప్రణాళికలు వేశారు. వేసవి కాలం దృష్ట్యా ప్రస్తుతం ప్రభుత్వం కూలీలకు 30 శాతం అలవెన్సుగా ప్రకటించింది. అంటే రోజులో చేసే పనిలో 30 శాతం తగ్గించి ఇచ్చే కొలతల ప్రకారం పని చేస్తే కూలీగా రూ.211 పొందవచ్చు. ఈ అవకాశం మహిళా కూలీలకు కొంతమేర ఊరట కలిగే అంశంగా చెప్పవచ్చు. ఉపాధి పథకంలోని వివిధ రకాల పనుల్లో మహిళా కూలీలు పోటీగా పని చేస్తుండటంతో అధికారులు వారి శ్రమశక్తిని అభినందిస్తున్నారు.

ఆర్థికంగా అండ..
నేను 2006వ సంవత్సరం నుంచి ఉపాధి పనులకు వెళుతున్నా. కూలీగా వచ్చిన డబ్బును నా కుమారుడి చదువు కోసం, ఇంటి ఆర్థిక అవసరాల కోసం వినియోగిస్తున్నా. ఉన్న ఊర్లోనే పని చేసి ఉపాధి పొందడానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ప్రతీ ఏడాది వంద రోజులు పని చేయాలని అధికారులు చెబుతున్నారు. వారి సూచనలు పాటించి ఉపాధి పథకంలో పాల్గొని ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఊరట పొందుతున్నాం. –జె.రామమ్మ, మహిళా ఉపాధి కూలీ, కర్చల్‌ గ్రామం, రాయికోడ్‌ మండలం

పనుల కల్పనపై ప్రత్యేక దృష్టి 
మండలంలో కొనసాగుతున్న ఉపాధి పనుల్లో పురుషులతో సమానంగా పని చేసేందుకు పెద్ద సంఖ్యలో మహిళా కూలీలు వస్తున్నారు. ఉపాధి పథకంపై మహిళా కూలీలకు పూర్తి అవగాహన వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. వారి ఆసక్తి మేరకు పనులు కల్పిస్తున్నాం. వేసవి అలవెన్సులు అమలు చేస్తున్నాం. ఉపాధి పనుల్లో మహిళా కూలీల పాత్ర కీలకంగా ఉంది. అన్ని రకాల ఉపాధి పనుల్లో మహిళలు వెనుకాడకుండా పాల్గొంటున్నారు. – గురుపాదం, ఏపీఓ రాయికోడ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement