
యూరియా స్కామ్ నిందితునిపై కేసు
సాంబశివరావును అరెస్ట్ చేసిన సీసీఎస్ అధికారులు
1996లో నాంపల్లిలో భూమిని స్వాధీనం చేసుకున్న సీబీఐ
ఇదే భూమి అభివృద్ధి పేరుతో బెంగళూరు కంపెనీతో డీల్
రూ.1.89 కోట్లు తీసుకుని మోసం చేసినట్లు ఆరోపణలు
హైదరాబాద్: 1996 నాటి యూరియా స్కామ్ కేసులో నిందితుడు ఎం.సాంబశివరావు మరో భారీ మోసానికి పాల్ప డ్డాడు. అప్పట్లో సీబీఐ స్వాధీనం చేసుకున్న భూమిని అభి వృద్ధి చేయడానికి బెంగళూరు కంపెనీతో ఒప్పందం కుదు ర్చుకుని.. వారి నుంచి రూ.1.89 కోట్లు తీసుకుని మోసం చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) అధికారులు సాంబశివరావును అరెస్టు చేసిన ట్లు డీసీపీ అవినాష్ మహంతి గురువారం వెల్లడించారు.
1996 నాటి యూరియా స్కామ్‌లో అరెస్ట్..
గుంటూరు జిల్లా ఎమినేనివారిపాలెంకు చెందిన సాంబశివరావు బీఎస్సీ(అగ్రికల్చర్) పూర్తి చేశాడు. 1995లో కర్సాన్ లిమిటెడ్ అనే టర్కిష్ కంపెనీకి భారత ఏజెంట్‌గా నియమితులయ్యాడు. అదే ఏడాది సెప్టెంబర్‌లో కేంద్రం యూరియా సరఫరా కోసం గ్లోబల్ టెండర్లు ఆహ్వానించింది. వీటిలో పాల్గొన్న కర్సాన్ లిమిటెడ్ సంస్థ.. నేషనల్ ఫెర్టిలైజ ర్స్ లిమిటెడ్(ఎన్‌ఎఫ్‌సీ) ద్వారా సరఫరా బాధ్యతల్ని పొందిం ది. దీని నిమిత్తం 1996 మార్చిలో కేంద్రం ఎన్‌ఎఫ్‌సీ ద్వారా కర్సాన్ సంస్థకు రూ.133 కోట్లు చెల్లించింది. నగదు తీసుకు న్న ఆ సంస్థ యూరియా సరఫరా చేయకుండా చేతులెత్తేసిం ది. దీనిపై అదే ఏడాది మేలో సీబీఐ పలువురిని అరెస్టు చేసిం ది. ఈ కేసులో 1996 సెప్టెంబర్‌లో సీబీఐ అధికారులు యూరియా స్కామ్‌లో మూడో నిందితుడిగా ఉన్న సాంబశివ రావు సహా 9 మందిని అరెస్టు చేశారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు సైతం అరెస్టు అయ్యారు. భారీగా ముడుపులు చేతులు మారినట్లు నిర్ధారించిన సీబీఐ ఈ వ్యవహారంలో కొందరు దళారులతో పాటు కర్సాన్ సంస్థకు భారత ఏజెంట్‌గా ఉన్న సాంబశివరావు సైతం ఇందులో కీలకపాత్ర పోషించారని, ప్రతిఫలంగా భారీ మొత్తం అందుకున్నారని అభియోగాలు మోపింది. నగరంలోని నాంపల్లిలో సాంబశివరావుకు చెందిన రెండు ఎకరాల నాలుగు గుంటల భూమిని సీబీఐ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం యూరియా స్కామ్ కేసును ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారిస్తోంది.
రియల్ ఎస్టేట్ వ్యాపారిగా అవతారం..
ఈ కేసులో బెయిల్‌పై వచ్చిన సాంబశివరావు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారారు. బేగంపేటలో సాయిశ్రీ ప్రాజెక్ట్స్ సంస్థ ను నిర్వహిస్తున్నారు. 2013లో సాంబశివరావు బెంగళూరుకు చెందిన వి ఆప్టిమైజ్ ఇన్‌ఫ్రా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ ప్రశాంత్ శ్రీశైలంను సంప్రదించారు. మరికొందరితో కలసి సీబీఐ స్వాధీనం చేసుకున్న భూమిని అభివృద్ధి చేయడానికి ‘వి ఆప్టిమైజ్’తో ఒప్పందం చేసుకున్నారు. సదరు ఆస్తి సీబీఐ అధీనంలో ఉన్న విషయం దాచిపెట్టి భూమిని అభివృద్ధి చేసేందుకు అప్పగించినందుకు తమకు లాభాల్లో 30 శాతం వాటా ఇవ్వాలని ఒప్పందంలో పేర్కొన్నారు. ఈ మొత్తంలో అడ్వాన్స్‌గా రూ.1.89 కోట్లు ‘వి ఆప్టిమైజ్’ నుంచి సాంబశివరావు తీసుకున్నాడు. జరిగిన మోసం గుర్తించిన బెంగళూరు సంస్థ 2014లో సీసీఎస్‌ను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన వైట్ కాలర్ అఫెన్సెస్ టీమ్–1 అధికారులు సాంబశివరావును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.