అన్నీ అబద్ధాలు.. అర్ధ సత్యాలు..
గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు విరుద్దంగా అన్నీ అబద్ధాలు, అర్ధ సత్యాలతో ఉందని రాష్ట్ర కాంగ్రెస్ మండిపడింది. రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో ఉందని, రుణమాఫీ ఒక మోసమని విమర్శించింది. శుక్రవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు బహిష్కరించారు. అనంతరం కాంగ్రెస్ శాసనసభాపక్షనేత కె.జానారెడ్డి, మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీ, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి మీడియాతో మాట్లాడారు.
కనువిప్పు కలగాలి: జానా
ఎన్నికల సందర్భంగా, అనంతరం శాసనసభలోనూ ఇచ్చిన హామీలను గవర్నర్ ప్రసంగం లో ప్రస్తావించలేదని జానారెడ్డి పేర్కొన్నారు. అబద్ధాలు చెబుతూ, హామీలను అమలు చేయని ప్రభుత్వానికి కనువిప్పు కలగాలనే కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసిందని చెప్పారు.
అన్నీ అబద్ధాలే: ఉత్తమ్
ప్రభుత్వం గవర్నర్‌తో పచ్చి అబద్ధాలను మాట్లాడించిందని ఉత్తమ్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేసిన విద్యుత్ ప్రాజెక్టులను ఈ ప్రసంగంలో ప్రస్తావించలేదన్నారు. 31 జిల్లాలు చేశామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ ద్వారా పెట్టుబడులు వస్తున్నాయని గొప్పలు చెప్పుకోవడం దురదృష్టకరమన్నారు. జీఎస్‌డీపీ తగ్గిందని గత సమావేశాల్లో సీఎం చెప్పారని.. ఇప్పుడు గవర్నర్ ప్రసంగంలో పెరిగినట్టుగా చూపించారన్నా రు. రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో ఉందని, రుణమాఫీ ఒక మోసమని, ముస్లిం ల రిజర్వేషన్లను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వానికి అవినీతిలో ఉన్న వేగం సంక్షేమం, అభివృద్ధి పథకాల్లో లేదని ఆరోపించారు. రాష్ట్రంలో రాజకీయ అవినీతి లేదని గవర్నర్ ప్రసంగంలో పేర్కొనడం హాస్యాస్పదమని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏమిటో తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు.
ప్రజలను మోసం చేశారు: షబ్బీర్
అన్ని రంగాల్లో అభివృద్ధి, సంక్షేమం, హామీల అమలుపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని షబ్బీర్‌అలీ విమర్శించారు. బీసీ సబ్‌ప్లాన్ గురించి ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదని.. ప్రభుత్వానికి గవర్నర్ డప్పు కొట్టినట్టుగా మాట్లాడారని ఆరోపించారు. గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రజలను మరోసారి మోసం చేశారని వ్యాఖ్యానించారు.