శ్వేతపత్రం విడుదల చేయాలి
పెద్దనోట్ల రద్దుపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ డిమాండ్
- ‘క్యూ’ మృతులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి
- ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం వద్ద మానవహారంతో నిరసన
సాక్షి, హైదరాబాద్: పాత రూ.500, 1,000 నోట్లు రద్దు చేయడానికి కారణాలు, ప్రజలకు అందువల్ల కలిగే ప్రయోజనం, సామాన్యు లకు ఎదురవుతున్న ఇబ్బందులను నివారించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లోని రిజర్వుబ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం వద్ద సోమవారం మానవ హారాన్ని ఏర్పాటు చేశారు. కె.జానారెడ్డి, షబ్బీర్‌అలీ, మల్లు భట్టివిక్రమార్క, వి.హను మంతరావు, పొన్నాల లక్ష్మయ్య, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితర ముఖ్య నేతలంతా ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్‌బీఐ ప్రాంతీయ డెరైక్టర్ ఆర్‌ఎన్ దాస్‌కు కాంగ్రెస్ నేతలు వినతిపత్రాన్ని సమర్పించారు.
అనంతరం అసెంబ్లీలో ఉత్తమ్ విలే కరులతో మాట్లాడుతూ.. ముందస్తు చర్యలు, ఏర్పాట్లు లేకుండా పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా పేద ప్రజలు, చిన్న వ్యాపా రులు, కూలీలు, గ్రామీణ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పెద్ద నోట్లను రద్దు చేయడానికి ముందు చాలా కసరత్తు చేసినట్టుగా చెబుతున్న ప్రధాని మోదీ సమస్యలు రాకుండా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రిజర్వుబ్యాంక్ దీనికి ఎలా అంగీకరించిందని ప్రశ్నించారు. బ్యాంకులు.. ఏటీఎంల ముందు నిలబడి ఇప్పటిదాకా 70 మంది చనిపోయారని ఉత్తమ్ చెప్పారు. ఇవన్నీ కేంద్రం చేసిన హత్యలు కావా? అని ప్రశ్నించారు. భారత స్థూల జాతీయ ఉత్పత్తి, ఆర్థికవృద్ధి, ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతినే విధంగా ఈ నిర్ణయం ఉందన్నారు. నల్లధనం, ఉగ్రవాదా నికి చేరే ఆర్థికవనరు లను అడ్డుకోవడానికి తాము వ్యతిరేకం కాదని, అరుుతే వాటిని నియంత్రించడానికి పేదలు, సామాన్యులకు కష్టం కలిగించడమే బాధాకరమన్నారు.
ప్రజలపక్షం పోరాడరా?
రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. వారం రోజుల్లోనే మోదీతో కేసీఆర్ మూడుసార్లు సమావేశమయ్యారని, ప్రజల ఇబ్బందుల గురించి ఏం చర్చించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలోని ముఖ్యమం త్రులంతా ప్రజల పక్షాన పోరాడుతుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం ప్రజలను పట్టించుకోకుండా బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఎందుకు ఇస్తున్నారో చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.
ఆర్థిక వ్యవస్థకు అవమానం: షబ్బీర్‌అలీ
కేంద్రం నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థను అవమానించేలా ఉందని మండ లిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ అన్నారు. రూ.500 నోట్లను విడుదల చేశామని ఒకసారి, వాటిలో తప్పులు వచ్చాయని మరోసారి, తప్పులు వచ్చినా చెల్లుతా యని ఇంకోసారి చెప్పడం ద్వారా దొంగనోట్లకు, నకిలీ కరెన్సీకి కేంద్రమే అవకాశం ఇస్తోందని ఆరోపించారు. ప్రధాని మోదీకి, సీఎం కేసీఆర్‌కు మధ్య రహస్య ఒప్పందం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.