
నా పదవులు వారికి ఇచ్చేయండి
పీసీసీ కార్యవర్గంలో పదవులు రానివారికి అవకాశం ఇచ్చేందుకు తన పదవులను వారికి ఇవ్వాలని మండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి పార్టీ నాయకత్వాన్ని కోరారు.
ఉత్తమ్, షబ్బీర్‌లతో పొంగులేటి సుధాకర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పీసీసీ కార్యవర్గంలో పదవులు రానివారికి అవకాశం ఇచ్చేందుకు తన పదవులను వారికి ఇవ్వాలని మండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి పార్టీ నాయకత్వాన్ని కోరారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీని బుధవారం కలసిన పొంగులేటి, పార్టీలో సీనియర్లను పట్టించుకోవడం లేదని, ఖమ్మం జిల్లాలో ఒకరిద్దరితో పార్టీని ఏకపక్షంగా నడిపించే ప్రయత్నం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
పీసీసీ పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటులో సీనియర్ల అభిప్రాయాలను తీసుకోకుండా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టివిక్రమార్క ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. జిల్లాలో సీనియర్లుగా ఉన్న వనమా వెంకటేశ్వర్‌రావుతో పాటు మరికొందరికి అవకాశాలు ఇవ్వాలని కోరారు. తనకు సమన్వయ కమిటీలోనూ, కార్యనిర్వాహకవర్గంలోనూ అవకాశం ఇచ్చారని, ఆ రెండు పదవుల్లో ఇద్దరు సీనియర్లకు అవకాశం ఇవ్వాలని సూచించారు. కాగా, పొంగులేటితో ఉత్తమ్, షబ్బీర్ ఖమ్మం జిల్లాలో పార్టీ పరిస్థితిపై చర్చలు జరిపారు. ఆయన చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.