సాక్షి, దురాజ్‌పల్లి (సూర్యాపేట) : కరపత్రాల ప్రచారానికి కాలం చెల్లింది. గతంలో ఎప్పుడూ లేని వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ ప్రజల్లోకి పార్టీ గుర్తు పోయేలా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఎన్నికల ప్రచార రథాలను తయారు చేయించుకుంటున్నారు.. నాయకులు. ఎన్నికలు సమీ పిస్తున్న తరుణంలో గ్రామాల్లో ఆయా పార్టీల అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారంలో ఆ పార్టీ నేతలు దూసుకుపోతున్నారు. అభ్యర్థులు ప్రకటించకున్నా కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం చేస్తుండగా, బీజేపీ అభ్యర్థులు, బీఎల్‌ఎఫ్ అభ్యర్థులు కూడా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. స్వతం త్య్ర అభ్యర్థులు కూడా ఎక్కడా తగ్గడం లేదు. అయితే అభ్యర్థులు ఎవరికి వారు ప్రచారం విభిన్న రీతుల్లో కొనసాగిస్తున్నారు. ప్రచార రథాలకు మైకులు, తమ గుర్తులు ఏర్పాటు చేసి ప్రసంగిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు.
మరోవైపు ఎల్‌ఈడీ స్క్రీన్‌ల ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థి తాను ప్రసంగించే ప్రచార రథాలను వినూత్నంగా, ఓటర్లను ఆకట్టుకునేవిధంగా తయారు చేసుకుంటున్నారు.గతంలో జీపులకు సాధారణ మైకులు పెట్టుకుని ఊరూరా తిరుగుతూ ప్రచారం చేసేవారు. ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది. ప్రచార రథంలో సకల సౌకర్యాలు ఉండేలా నాయకులు ఏర్పా?ట్లు చేసుకుంటున్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా తయారు చేసుకుంటున్నారు. 250 వాట్స్ మైక్, రథానికి నాయకులు, పార్టీ అధినేతల చిత్రపటాలను ఏర్పాటు చేస్తున్నారు. వైర్‌లెస్ మైక్, ఎల్‌ఈడీ లైట్లు, టైటిల్స్,చుట్టూ రెయిలింగ్స్,వాటర్‌ప్రూఫ్ కార్పెట్లు తదితర అత్యధునిక హంగులతో ప్రచార రథాలను రూపొందించుకుంటున్నారు.వాహనంపై ఎనిమిది మంది నిలిచిఉండే విధంగా తయారు చేస్తున్నారు.
నోటిఫికేషన్ విడుదల కాకముందు నుంచే..
జిల్లాలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాక ముందు నుంచి ఆయా పార్టీల నాయకులు జోరుగా ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు నియోజకవర్గాల్లోని ఆయా పార్టీల నాయకులు 87 వాహనాలకు అనుమతులు తీసుకుని ప్ర చారం నిర్వహిస్తున్నారు. హుజుర్‌నగర్ నియోజకవర్గంలో వివిధ పార్టీలకు ప్రచార వాహనాలకు 35 దరఖాస్తులు రాగా 25 వాహనాలకు, కోదాడ నియోజకవర్గం లో 6 వాహనాలకు దరఖాస్తులు రాగా 6 వాహనాలకు అనుమతి ఇచ్చారు. అదేవిధంగా సూర్యాపేట నియోజకవర్గంలో 47 దరఖాస్తులుకు గానూ 45 వాహనాలకు, తుంగతుర్తి నియోజకవర్గంలో 15 దరఖాస్తులకు గానూ 10 ప్రచార వాహనాలకు అనుమతించారు.
ప్రచారంలో కొత్త పుంతలు :
ప్రచారం కొంత పుంతలు తొక్కుతున్నదనడంలో సందేహం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు వాహనాలకు ఎల్‌ఈడీలను అమర్చి ప్రచారం చేస్తున్నారు. పట్టణాల్లో పలు చోట్ల ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేసి తమ కార్యక్రమాలను ప్రజల్లోకి వెల్లేలా ప్రచారం చేస్తున్నారు.అంతే కాకుండా వాహనాలపై ఎల్‌ఈడీలను ఏర్పాటు చేసి పట్టణం, గ్రామాల్లో తిప్పుతూ పార్టీ గుర్తు, ఎన్నికల హామీలు ప్రజల్లోకి వెళ్లేలా ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు.కొన్ని పార్టీలు సోలార్ సిస్టమ్‌తో పనిచేసే ఎల్‌ఈడీ జేబు బ్యాడ్జీలను ప్రచారానికి వినియోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment