
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కోవిడ్ -19 ( కరోనా వైరస్ ) వ్యాప్తి నివారణ కోసం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్‌లో కూరగాయల ధరలు కొండెక్కాయి. ఇదే అదనుగా సామాన్యులను కూరగాయల వ్యాపారులు నిలుపు దోపిడి చేస్తున్నారు. జనతా కర్ఫ్యూతో నిన్నంతా ఇళ్లలో ఉన్న జనాలు... సోమవారం నిత్యావసరాలు, కూరగాయలు కొనేందుకు పెద్ద ఎత్తున సూపర్ మార్కెట్లు, రైతు బజార్లుకు చేరుకున్నారు. దీంతో నగరంలోని పలు రైతు బజార్లు జనాలతో కిక్కిరిసిపోయాయి. సందట్లో సడేమియా అన్నట్లు వ్యాపారస్తులు ....కూరగాయల్ని అధిక ధరలకు అమ్ముతున్నారు. దీంతో వ్యాపారులపై కొనుగోలుదారులు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కొనుగోలుదారులు వాపోతున్నారు.
లాక్ డౌన్ సమయంలో ప్రజలకు నిత్యావసర సరుకులన్నీ, కూరగాయలు అందుబాటులోనే ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం భరోసా ఇచ్చినా.. అధిక ధరల వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని ప్రజలు మండిపడుతున్నారు. సాధారణ రోజుల కంటే రెండింతల ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు ప్రజలు వాపోతున్నారు. మార్కెట్ అధికారులు చేతులెత్తేయడంతో వ్యాపారులకు, ప్రజలకు మధ్య వాగ్వాదం నెలకొంది. దాదాపు అన్ని కూరగాయల రేట్లు ఇలానే ఉన్నాయి. నగరంలోని గుడిమల్కాపూర్ , మోహదీపట్నం వ్యవసాయ మార్కెట్‌లో కూడా కూరగాయల ధరలు ఆకాశనంటుతున్నాయి.
కూరగాయలు | పాత ధర | ప్రస్తుతం ధర |
టమాట(కిలో) | రూ. 8 | రూ. 100 |
వంకాయ( కిలో) | రూ. 15 | రూ. 80 |
మిర్చి | రూ. 25 | రూ. 90 |
క్యారెట్( కిలో) | రూ.25 | రూ. 80 |
క్యాప్సికం (కిలో) | రూ. 30 | రూ. 80 |
కాకరకాయ (కిలో) | రూ. 25 | రూ. 80 |
అదేవిధంగా నల్లగొండలోని కూరగాయల మార్కెట్ కూడా జనంతో కిక్కిరిసిపోయింది. లాక్‌డౌన్ రూల్స్‌ను పాటించకుండా ప్రజలు పెద్దఎత్తున మార్కెట్‌కి తరలివచ్చారు. ఇలా అయితే కోరోనా నివారణ ఎలా సాధ్యమవుతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కూరగాయల ధరలు కూడా అధికంగా ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు.
నిజామాబాద్: జనాలతో నిజామాబాద్ కూరగాయల మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. కూరగాయ ధరలు ఆకాశాన్నంటాయి. వినియోగదారుల అవసరాలను వ్యాపారలు సొమ్ము చేసుకుంటున్నారు. రెండింతలు, మూడింతలు అధిక ధరలతో కూరగాయలు అమ్ముతున్న వ్యాపారులుపై వినియోగదారుల మండిపడుతున్నారు. ప్రభుత్వం ధరలను అదుపు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment