పాపకి ఏమైంది? ఎక్కడి నుంచి వచ్చారు? | vijay kumar in VIP reporter | Sakshi
Sakshi News home page

పాపకి ఏమైంది? ఎక్కడి నుంచి వచ్చారు?

Published Sun, Nov 16 2014 2:51 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

vijay kumar in VIP reporter

విజయ్‌కుమార్: ఏమ్మా.. పాపకి ఏమైంది?  ఎక్కడి నుంచి వచ్చారు?
 శ్రీలత: మావారు రమేశ్ శ్రీరాంపూర్‌లో పనిచేస్తున్నారు. ఇక్కడ నాన్నగారు ఉంటున్నారు. మొదటి కాన్పుకావడంతో ఇక్కడికి వచ్చా. పాపకు కొద్దిగా జ్వరం ఉంది. ఇక్కడ చేర్పించాము. వైద్యం చేశారు. ఇప్పుడు పాప ఆరోగ్యం కుదుటపడింది.

 విజయ్‌కుమార్: మీ ఆయనకు ఏమైందమ్మా..? ఇప్పుడు ఎలా ఉంది? వైద్యం మంచిగా అందిస్తున్నారా?
 ఎల్లయ్య భార్య: నా భర్త మణుగూరులో కేబుల్‌మన్‌గా పనిచేస్తున్నడు. ఆయన నోటి నుంచి మాట రావట్లేదు. చేతులు పడిపోయి పక్షవాతం రావడంతో రెండు రోజుల క్రితం ఇక్కడకు వచ్చాం. ఇప్పుడు కాస్త కొలుకున్నడు. ఈరోజు పాలు తాగిండు. చేతిలో కొంచెం కదలిక వచ్చింది. వైద్యం బాగానే అందిస్తున్నారు.

 విజయ్‌కుమార్: ఎక్కడ పనిచేస్తున్నావు?  ఏ వ్యాధితో ఆస్పత్రిలో చేరావు?
 అప్పారావు: ఆర్‌సీహెచ్‌పీలో జనరల్ మజ్దూర్‌గా పనిచేస్తున్నా. మొస ఆడకపోవడంతో ఆస్పత్రిలో చేరిన. ఛాతిలో నుంచి నొప్పి వెన్నులోకి వస్తుంది. నొప్పి తగ్గకముందే డిశ్చార్జి రాశారు.

 విజయ్‌కుమార్: డాక్టర్ గారు అప్పారావును ఎందుకు డిశ్చార్జ్ చేశారు..?
 డాక్టర్ భానుమతి: అన్ని రకాల పరీక్షలు చేశాం. నొప్పికి క్యాప్సుల్స్ ఇచ్చాము. ఇంకా తగ్గలేదంటున్నారు కదా! మరో రెండు రోజులు ఆస్పత్రిలో ఉంచి వైద్యం అందిస్తాం.

 విజయ్‌కుమార్: ఏంటి.. ఎలా ఉన్నావు? వైద్యం మంచిగా అందుతుందా?
 మదనయ్య: జ్వరం వచ్చింది సారు. అందుకే ఆస్పత్రిలో చేరిన. పచ్చ కామెర్లు వచ్చాయి. వైద్యం బాగానే అందిస్తున్నరు.

 (విజయ్‌కుమార్: కామెర్లు తగ్గేంత వరకు మాంసాహారం తినకు. రెస్ట్ చాలా అవసరం. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.)
 విజయ్‌కుమార్: డెంగీ అని ఎలా నిర్ధారిస్తున్నారు?
 డాక్టర్ అనిత: రక్త పరీక్షలు నిర్వహించి జ్వరాన్ని నిర్ధారిస్తున్నాం. డెంగీలో ముఖ్యంగా ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గిపోవడం వల్ల నీరసించిపోతారు. అలాంటి కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వెంటనే జాయిన్ చేయించుకుంటున్నాం.

 విజయ్ కుమార్: రోజుకు ఎన్ని కేసులు వస్తున్నాయి? వారికి ఎలాంటి వైద్యం అందిస్తున్నారు?
 డాక్టర్ సంజీవరావు: ప్రతిరోజు సుమారు 20 నుంచి 30 కేసులు వస్తున్నాయి. వీటిలో ఎక్కువగా హైపర్ టెన్షన్‌తో వచ్చేవారు ఉంటున్నారు. వారికి ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని సూచిస్తున్నాం. రోగులను ప్రతినెలా పరీక్ష చేయాల్సి వస్తోంది. వారితోపాటు కొత్తగా వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. లైఫ్‌స్టైల్ మోటివేషన్ ద్వారా వారిలో హైపర్‌టెన్షన్‌ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం.

 విజయ్‌కుమార్: కార్మికులు ఎక్కువగా జాయింట్ పెయిన్స్‌తో బాధపడుతుంటారు కదా! వారికి అత్యాధునిక వైద్యం అందిస్తున్నారా?
 డాక్టర్ రామకృష్ణ: లేజర్ ట్రీట్‌మెంట్‌తో జాయింట్ పెయిన్స్ తగ్గిస్తున్నాం. ఆపరేషన్‌కు ముందు కొన్ని ఎక్సైర్‌సైజ్‌లు చేయిస్తున్నాం. జాయింట్స్‌లో పట్టు వచ్చిన తర్వాత ఆపరేషన్‌కు రిఫర్ చేస్తున్నాం.

 విజయ్‌కుమార్: మన దగ్గర బ్లడ్‌బ్యాంక్ నిర్వహణ ఎలా ఉంది? రక్తం స్టాక్ ఉంటుందా?
 డాక్టర్ మంతా శ్రీనివాస్: సింగరేణిలో బ్లడ్‌బ్యాంక్ నిర్వాహణ చాలా బాగుంది. ఇక్కడ అన్ని గ్రూపుల రక్త నమూనాలను భద్రపరుస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో వినియోగిస్తున్నాం. రక్తదానం చేసే వారి పేర్లు, ఫోన్ నంబర్లతో ఒక రిజిష్టర్ మెయింటెన్ చేస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో దాతలు వెంటనే వచ్చి రక్తదానం చేస్తున్నారు.

 విజయ్‌కుమార్: ల్యాబ్‌లో సిబ్బంది సరిపడా ఉన్నారా? రోజుకు ఎన్ని టెస్ట్‌లు చేస్తుంటారు?
 డాక్టర్ సునీల: ప్రతిరోజు 500 నుంచి 600 బ్లడ్ శాంపిల్స్‌ను పరీక్షిస్తున్నాం. సిబ్బంది సరిపడా లేకపోవడంతో రిపోర్ట్‌లు ఇవ్వడం ఆలస్యమవుతోంది. డెంగీ వంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయి. వాటి పరీక్షలు చేయడానికి సరిపడా ఎక్విప్‌మెంట్ (పరికరాలు) అందుబాటులో ఉండటంలేదు.

 విజయ్‌కుమార్: సిబ్బంది నియామకానికి త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తాం. ఈలోగా కాంట్రాక్టు పద్ధతిలో కొంతమందిని రిక్రూట్ చేద్దాం.. మెడికల్ కిట్‌లు అన్నీ ఉంటున్నాయా?
 అంతోటి నాగేశ్వరరావు: డయాలసిస్ ఎక్విప్‌మెంట్ అందుబాటులో లేదు. కార్మికులను పరీక్షల నిమిత్తం హైదరాబాద్ పంపిస్తున్నారు. దీనివల్ల కార్మికులు వారి మస్టర్లను నష్టపోతున్నారు.

 (విజయ్‌కుమార్: డయాలసిస్ కిట్స్ కోసం టెండర్ల కోసం వెయిట్ చేయకుండా లోకల్ పర్చేజ్ చేయండి..)
 సీఎంఓ డాక్టర్ ప్రసన్న సింహ: రోజుకు రెండు మూడు కిట్స్ అవసరమవుతున్నాయి. వర్కర్లు, డిపెండెంట్లకు ఆస్పత్రిలో ఉన్న కిట్స్ సరిపోతున్నాయి. బయటి నుంచి వచ్చే పేషెంట్ల కోసం కొనుగోలు చేసి తీసుకువస్తాం.
 సామ్యూల్: ఆస్పత్రిలో బార్బర్ సమస్య ఉంది. అలాగే వార్డ్ బాయ్స్‌కు రెస్ట్ రూమ్ సౌకర్యం కల్పించండి.

 (విజయ్‌కుమార్: బార్బర్‌ల సమస్య పరిష్కారానికి కృషి చేశాం. యూనిట్‌ను ట్రేడ్‌గా తీసుకుని నియామకాలు చేస్తాం. రెస్ట్ రూమ్ కోసం ఖాళీ గది ఉంటే చెప్పండి దానిని కేటాయిస్తాం.)
 విజయ్‌కుమార్: ఏమ్మా.. పేషెంట్లను మంచిగా చూసుకుంటున్నారా?
 ఎల్లమ్మ: చూసుకుంటున్నాం సార్. కానీ స్వీపర్లు తక్కువగా ఉన్నారు. మాకు రెస్ట్ కూడా ఇవ్వడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement