మెట్లే తరగతి గదిగా బోధన..
పేరుకే ప్రభుత్వ కళాశాల.. ఇక్కడ అన్నీ సమస్యలే.. ముఖ్యంగా తరగతి గదుల కొరత వేధిస్తోంది. మెట్లపై.. వరండాలో.. ఆరుబయటే తరగతులు నిర్వహిస్తున్నారు. పైగా విద్యార్థులే గదులను చీపురు పట్టుకుని శుభ్రం చేసుకుంటున్నారు. కొన్ని నెలులుగా ఇలా సాగుతున్నా పాలకులు దృష్టిసారించకపోవడం గమనార్హం. ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో సుమారు 400 మంది విద్యార్థులు ఉండగా కేవలం ఆరు గదుల్లోనే తరగతులు నిర్వహిస్తుండటం వికారాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల దుస్థితిని తేటతెల్లంచేస్తోంది.
వికారాబాద్ అర్బన్: విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా వికారాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు పడుతున్న కష్టాలు మాత్రం పట్టించుకోవడం లేదు. విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ కళాశాలలో సుమారు 400 మంది ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు చదువుతున్నారు. వీరంతా గ్రామీణ, పేద కుటుంబాల నుంచి వస్తున్నవారే ఉన్నారు. ప్రస్తుతం కళాశాలలో ఏడు గ్రూపులు కొనసాగుతున్నాయి. తెలుగు మాధ్యమంలో ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ, ఉర్దూ మాధ్యమంలో బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ కోర్సుల్లో విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం 17 సెక్షన్లు ఉన్నాయి. ఈ లెక్కల 17 తరగతి గదులు కావాలి. కానీ ఇక్కడ కేవలం ఆరు గదులే ఉన్నాయి. దీంతో రెండు మూడు సబ్జెక్టులకు సంబంధించి ఒకే దగ్గర కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. తక్కువ మంది విద్యార్థులు ఉన్న బైపీసీ, హెచ్‌ఈసీ రెండో సంవత్సరం విద్యార్థులను భవనం మెట్లపై కూర్చోబెట్టి పాటాలు చెబుతున్నారు. తరగతి గదులు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు కళాశాలకు రాలేకపోతున్నారు. మెట్ల వద్దనే బ్లాక్ బోర్డు ఏర్పాటు చేసి రోజు రెండు, మూడు తరగతులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కలగజేసుకొని తరగతి గదుల కొరత తీర్చాలని విద్యార్థులు కోరుతున్నారు.
ఆరుబయటే కళాశాల తరగతులు
నిధులున్నా నిర్మాణం జరగడం లేదు
2017లో జూనియర్ కళాశాల భవన నిర్మాణం పూర్తి కావడంతో మూడేళ్లుగా తరగతి గదులు కొనసాగుతున్నాయి. ఈ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి రూ.2 కోట్ల 20 లక్షలు మంజూరు అయ్యాయి. కానీ ప్రభుత్వం కేవలం రూ.కోటిని మాత్రమే ఖర్చు చేసి కళాశాల భవనాన్ని నిర్మించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం 16 తరగతి గదులతో పాటు, ఒక ప్రిన్సిపాల్ గది, స్టాఫ్ రూమ్, నాలుగు సైన్స్ ల్యాబ్‌లు నిర్మించాలి. ఇవేవి నిర్మించకుండానే కేవలం ఆరు గదులు నిర్మించి వదిలేశారు. మిగత రూ.కోటి 20 లక్షలు సంబంధిత ఇంటర్మీడియట్ శాఖలో జమలో ఉన్నాయి. ఆ నిధులు ఖర్చు పెట్టి తరగతి గదుల కొరత తీర్చాలని ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శంకర్, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు చాలాసార్లు సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా పేద విద్యార్థులు చదువుకుంటున్న కళాశాల సమస్యలు తీర్చాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
తరగతి గదిలో చెత్తను ఊడుస్తున్న విద్యార్థిని
విద్యార్థులే స్వీపర్లు
ప్రభుత్వ జూనియర్ కళాశాలకు స్వీపర్ పోస్టు కూడా మంజూరు కాలేదు. దీంతో తరగతి గదులను విద్యార్థులే వంతుల వారీగా చీపురు పట్టి శుభ్రం చేసుకుంటున్నారు. మరుగుదొడ్లు కూడా తీవ్ర అపరిశుభ్రంగా మారినట్లు విద్యార్థులు చెబుతున్నారు. పేదల చదువులకు పెద్ద పీట వేస్తామని చెబుతున్న ప్రభుత్వం కనీసం ఒక స్వీపర్‌ను కేటాయించకపోవడంపై విద్యార్థులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువుకోవాలని ఉన్నా సమస్యలు వెంటాడుతున్నాయని అంటున్నారు. కనీసం రోజు కూలీ లెక్కన ఒక స్వీపర్‌ను ఏర్పాటు చేయాలని కళాశాల ప్రిన్సిపాల్ కలెక్టర్‌ను కోరినా లాభం లేకుండా పోయింది.
వసతులు కల్పించాలి
ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులతో పోటీ పడి చదవాలని ఉన్నా ఇక్కడ వసతులు లేకపోవడంతో సమస్యగా మారింది. కొన్ని క్లాసులు భవనం మెట్లపై కూర్చోని వినాల్సి వస్తుండడంతో చాలా మంది ఇబ్బందికి గురై రాలేకపోతున్నారు. విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం 400 మంది విద్యార్థులు చదివే కళాశాలకు వసతులు సమకూర్చలేకపోతున్నారు. ఇక్కడ చదువుకునే ప్రతి విద్యార్థి పేద కుటుంబానికి చెందిన వారే. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి.– శివకుమార్, ఎంపీసీ, ద్వితీయ సంవత్సరం
Comments
Please login to add a commentAdd a comment