వీరభద్రుడికి సర్ప రక్షణ?
చండ్రుగొండ: చంద్రముఖి వంటి సిని మాల్లో నిధికి లేదా ఏదైనా పురాతన వస్తువులకు పాము కాపలాగా ఉండటం అది వెంటపడటం వంటివి చాలా చూశాం. కానీ అదే నిజ జీవితంలోనూ జరిగితే.. ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం దామరచర్లలో అలాంటి ఘటనే జరిగిందని స్థాని కులు చెబుతున్నారు. వీరభద్రుడి పురాతన విగ్రహాలను తరలించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పాము వెంటాడిందని అంటున్నారు. ఈ సంఘటన వివరాలు ఆల స్యంగా వెలుగులోకి వచ్చాయి. దామరచర్ల గ్రామానికి చెందిన భూస్వామి సోమరాజు లక్ష్మీ వెంకట నర్సింహారావు (రాజా) తన వ్యవసాయ క్షేత్రంలో ఖాళీగా ఉన్న కొంత భూమిని ఇటీవల లెవెలింగ్ ట్రాక్టర్‌తో చదును చేయిస్తున్నాడు.
ఈ క్రమంలో ఆయుధం కలిగిన వీరభద్రుడి విగ్రహంతోపాటు ఆనవాళ్లు కోల్పోయిన మరో విగ్రహం, చిన్న శివలింగం పానిపట్టం లభిం చాయి. దీంతో ఆయన విషయాన్ని అధికారులకు చేరవేశారు. పురాతన విగ్రహాల విషయం పత్రికల్లో కూడా ప్రచురితమైంది. ఈ క్రమంలో కొత్తగూడెం ఆర్డీవో ఎంవీ. రవీంద్రనాథ్ ఆదేశాల మేరకు తహసీల్దార్ కనకదుర్గ సిబ్బందితో కలసి బుధవారం దామరచర్ల శివారులోని సంఘటన స్థలానికి వెళ్లారు. పురాతన విగ్రహాలను తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ క్రమంలో సిబ్బంది విగ్రహాలను తీసుకుని బయల్దేరగా.. అకస్మాత్తుగా ఓ పాము ప్రత్యక్షమైనట్లు అక్కడున్న వారు చెబుతున్నారు.
అది తహసీల్దార్ కనకదుర్గ వెంటపడగా.. అక్కడున్న వారు పాము.. పాము అంటూ కేకలు వేయడంతో ఆమె ఒక్కసారిగా పరుగులు పెట్టారు. కొంతదూరం తరువాత పాము కనిపించకుండా పోయినట్లు రెవెన్యూ సిబ్బందితోపాటు భూస్వామి రాజా చెబుతున్నాడు. ఇదిలా ఉండగా.. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న అధికారులు ఆ విగ్రహాలను తహసీల్దార్ కార్యాలయానికి తెచ్చారు.
భయం భయంగా..
పురాతన విగ్రహాలను తహసీల్దార్ కార్యాలయానికి తరలించిన అధికారులు, సిబ్బంది కొన్ని గంటలపాటు భయం భయంగా గడిపారు. జరిగిన సంఘటనపై ఆందోళన చెందిన తహసీల్దార్ కనకదుర్గ ఈ విషయాన్ని ఆర్డీవోకు వివరించారు. అనంతరం ఆర్డీవో ఆదేశాల మేరకు పురాతన విగ్రహాలను మళ్లీ యథాస్థానానికి తరలించారు. దీనిపై తహసీల్దార్‌ను వివరణ కోరగా.. తాను పరుగులు పెట్టిన మాట వాస్తవమేనన్నారు. అయితే తాను పామును చూడలేదన్నారు.