విజన్.. కేసీఆర్! | Vision of Cyber city of hyderabad | Sakshi
Sakshi News home page

విజన్.. కేసీఆర్!

Published Tue, Mar 31 2015 12:41 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

విజన్.. కేసీఆర్! - Sakshi

విజన్.. కేసీఆర్!

విజన్ అమలు దిశగా ‘గ్రేటర్’ కార్పొరేషన్ విశ్వనగరానికి ప్రణాళికలు సిద్ధం ప్రణాళికలు పట్టాలెక్కించేందుకు అధికారుల పరుగులు నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట సంక్షేమ కార్యక్రమాలపైనా ప్రత్యేక శ్రద్ధ...
 
హైదరాబాద్.. దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరున్న మహా నగరం. నాలుగు వందల ఏళ్ల ఘన చరిత్ర భాగ్యనగరం సొంతం. అలనాటి చార్మినార్ మొదలుకుని నేటి సైబర్ సిటీ వరకూ ఎన్నో వింతలు.. విశేషాలు. హుస్సేన్‌సాగర్‌తో పాటు వందల సంఖ్యలో చెరువులు, విశాలమైన రహదారులు.. ఆహ్లాదకరమైన ఉద్యాన వనాలు. ఇదీ ఒకప్పటి హైదరాబాద్. నాటి జనాభాకు తగ్గట్టుగా సకల సదుపాయాలు.. తాగునీటి వసతి, మార్కెట్ కాంప్లెక్స్‌లు, ప్రాథమిక విద్య నుంచి విశ్వవిద్యాలయం వరకూ ఎన్నో విద్యా కేంద్రాలు.. వైద్యానికి తగినన్ని ఆస్పత్రులు.. వరద నీరు సాఫీగా వెళ్లేందుకు కాలువలే కాక మురుగు నీటి సరఫరాకూ ప్రత్యేక లైన్లు.. సమస్తం సమకూరిన సుందర నగరం. సూటిగా చెప్పాలంటే సదుపాయవంతమైన జీవనానికి కావాల్సిన అన్ని వనరులూ ఉన్న అద్భుత  నగరం.. హైదరాబాద్..
 
సాక్షి, హైదరాబాద్: నిత్యం వలసల కారణంగా.. రోజురోజుకూ కిక్కిరిసిపోతున్న జనాభాతో హైదరాబాద్ నగరం మరింత విస్తరించింది. అయితే విస్తరణకు అనుగుణంగా సదుపాయాలు.. సౌకర్యాలు మాత్రం మెరుగుపడలేదు. పది మంది ఉండాల్సిన చోట వంద మంది నివసిస్తున్నారు. చెరువులు, ఉద్యాన వనాలు, రహదారులు ఇలా అన్నింటినీ కబ్జా చేశారు. సహజవనరుల గొంతు నులిమారు. తత్ఫలితంగా వానొస్తే నీరు వెళ్లేందుకు మార్గం లేదు. వాహనంలో బయలుదేరితే ఏ సమయానికి గమ్యానికి చేరతామో తెలియనంతటి ట్రాఫిక్. ప్రశాంతంగా కునుకు తీయడానికి కూడా లే నటువంటి రణగొణ ధ్వనులు. గట్టిగా ఊపిరి పీల్చుకుందామన్నా ముక్కుపుటాలదిరే కాలుష్యం. ఇలా.. చెప్పుకుంటూపోతే ఘనత వహించిన మహా నగరంలో ప్రణాళిక లేమితో ప్రజలు పడే అవస్థలెన్నో..
 
 నగరం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన తెలంగాణ సీఎం కేసీఆర్ కలత చెందారు. .. నగర దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అంతటితో ఆగలేదు. నగరంలో సమూల మార్పులకు సిద్ధమయ్యారు. ప్రపంచంలో పేరెన్నికగన్న ఏ నగరానికీ తీసిపోని విధంగా విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమయ్యారు. అందుకు తగ్గ లక్ష్యాలను నిర్దేశించారు. ఆయన ‘విజన్’ను అమలు చేసేందుకు వివిధ విభాగాల అధికారులు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. 80 లక్షల మంది ప్రజలకు సేవలందిస్తున్న జీహెచ్‌ఎంసీకి అన్ని విభాగాల కంటే అదనపు బాధ్యతలున్నాయి. అందరినీ కలుపుకుని పోవాల్సిన సమన్వయ బాధ్యతలున్నాయి. ఈ నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ విజన్‌కు అనుగుణంగా జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టిన ప్రణాళికలు.. చేపట్టిన పథకాలు.. అమలు గురించి ‘సాక్షి’ 7వ వార్షికోత్సవం సందర్భంగా సాక్షి పాఠకులకు ప్రత్యేకం ఈ కథనం.
 
రయ్యిన దూసుకెళ్లే రాచమార్గాలు..
 హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే తెలంగాణ ప్రభుత్వ కల సాకారం చేసేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ట్రాఫిక్ చిక్కులు లేకుండా.. ఎక్కడా సిగ్నల్ లైట్లు కూడా లేకుండా రయ్యిన దూసుకువెళ్లేలా రాచమార్గాల ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రజలకు ప్రయాణ సదుపాయాలను మెరుగుపరిచేందుకు 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,956 కోట్లు కేటాయించారు. ఇందులో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా రాచమార్గాల ఏర్పాటుకు రూ. 1,000 కోట్లు కేటాయించారు.
 
 వీటిల్లో ఎక్స్‌ప్రెస్ వేలు/ఫై ్లఓవర్లు/మల్టీ లెవెల్ గ్రేడ్ సెపరేటర్లు/ స్కైవేలు ఉన్నాయి. ఆరు ప్రాంతాల్లో ఫీజిబిలిటీ నివేదిక కోసం ఇప్పటికే టెండర్లు ఆహ్వానించారు. పనులు త్వరితంగా పూర్తిచేసేందుకు జీహెచ్‌ఎంసీలో ‘మెయిన్ రోడ్ సర్కిల్’ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విభాగం ప్రత్యేకంగా ప్రధాన రహదారుల పనులపై దృష్టిసారిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో 300 కి.మీ.ల మేర రోడ్ల అభివృద్ధితో పాటు 1,000 కి.మీ.లలో ఎక్స్‌ప్రెస్ హైవేలు, 50 జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిలతోపాటు ఇతరత్రా పనులు చేపట్టనున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కేబీఆర్ పార్కు చుట్టూ 5 జంక్షన్లలోగ్రేడ్ సెపరేటర్లు ఏర్పాటు చేయనున్నారు.
 
 పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ..

 పారిశుధ్యానికి ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా సమస్య తీరకపోవడంతో సరికొత్త కార్యక్రమాలకు అధికారులు సిద్ధమయ్యారు. అధిక మొత్తంలో చెత్తను డంపింగ్ యార్డుకు చేరవేసేందుకు అవసరమైనన్ని భారీ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. కాలనీ లు.. బస్తీలు.. రోడ్ల పక్క చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమం విజయవంతం కానుందని భావించి ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 3,260 డంపర్ బిన్లు, 5 వేల వరకు రిక్షాలు ఉన్నప్పటికీ అవి ఏమాత్రం సరిపోవడం లేవు. వీటిని భారీగా పెంచనున్నారు.
 
స్లమ్ ఫ్రీ సిటీ..: ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్‌కు ఇరుకు గల్లీలు.. మురికి వాడలు ఆటంకం గా మారాయి. ఇరుకు గదుల్లోనూ.. మూరికి వాడల్లోనే లక్షలాది మంది పేదలు బతుకులు వెళ్లదీస్తుండటం ప్రభుత్వం చిన్నతనంగా భావిస్తోం ది. వీరందరికీ సదుపాయవంతమైన ఇళ్లతోపాటు రహదారులు, తాగునీరు, విద్యుత్, ఆటస్థలాలు, పార్కులు వంటి సదుపాయాలన్నీ కల్పించేందుకు కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా ఐడీహెచ్ కాలనీలో ఇళ్ల నిర్మాణం త్వరలో పూర్తికానుంది. తక్కు వ వ్యవధిలో ఎక్కువ మందికి  సొంత ఇంటి భాగ్యం కల్పించాలనే తలంపుతో జీహెచ్‌ఎంసీ స్పెషల్ ఆీ    ఫసర్ సోమేశ్‌కుమార్ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో ఇళ్లు నిర్మించాలని భావిస్తున్నారు. తద్వారా ఏడాది కాలంలోనే వేల ఇళ్లు అందుబాటులోకి రానున్నాయి.
 
 నైట్ షెల్టర్లు.. గౌరవ సదన్‌లు..: హైదరాబాద్ మహానగరంలో తలదాచుకోవడానికి నిలువనీడ లేని అభాగ్యులెందరో. వారికి రాత్రుళ్లు తలదాచుకునేం దుకు తగినన్ని నైట్ షెల్టర్లే కాక.. యాచక వృత్తితో బతుకు వెళ్లదీస్తున్న వారికీ తగిన వసతిని అందించేందుకు గౌరవసదన్‌లు ఏర్పాటు చేయనున్నారు. తొలి దశలో ఏడు ఆస్పత్రుల వద్ద వీటిని ఏర్పాటు చేసేం దుకు సిద్ధమైన అధికారులు నాలుగు ప్రాంతాల్లో పనుల కోసం రూ. 11 కోట్లతో టెండర్లు పిలిచారు.
 
 ఆకలి బాధలు తీర్చేందుకు.. రూ. 5కే భోజనం..
 క్షుద్బాధ అనుభవించే వారికి మాత్రమే తెలుసు. రోజుకు కనీసం ఒక పూట తిండి కూడా కరువైన వారు భాగ్యనగరంలో ఎందరో ఉన్నారు. ఉన్నత చదువుల కోసం.. పోటీ పరీక్షల కోసం నగరానికి వచ్చిన పేద విద్యార్థులెందరో తగిన డబ్బుల్లేక కడుపు మాడ్చుకుంటున్నారు. ఈ పరిస్థితికి చలించిపోయిన కమిషనర్ నామమాత్రపు ధర రూ. 5కే భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆదరణ ఉండదేమో.. ఆరోపణలు వస్తాయేమో అనుకున్న ఈ కార్యక్రమానికి నగరంలో రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయంలో చదువుకునే ఉద్యోగార్థులు, వలస కూలీలు, కార్మికలతో పాటు ఎందరెందరికో అండగా ఉన్న ఈ కార్యక్రమాన్ని మరింతగా విస్తరించనున్నారు. ప్రస్తుతం 20 కేంద్రాల్లో అమలవుతున్న ఈ పథకాన్ని 50 కేంద్రాలకు విస్తరించడంతోపాటు ఎక్కువ మంది అన్నార్తులుండే ప్రాంతాల్లో మొబైల్ సేవలు అందించేందుకూ ఏర్పాట్లు చేస్తున్నారు.
 
 హరిత హైదరాబాద్ దిశగా..
 కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరం.. ఒట్టిపోయిన తటాకాలు.. ఎక్కడ నిలబడ్డా కాలుష్యమే.. ఊపిరి పీల్చుకుందామన్నా.. చల్లని గాలినిచ్చే చెట్లు లేవు..  జాతీయ ప్రమాణాల మేరకు నగరాల్లో 30 శాతం పచ్చదనం ఉండాలి. కానీ భాగ్యనగరంలో పరిస్థితి దుర్భరంగా ఉంది. దీనిని నివారించేందుకు ‘హరిత హైదరాబాద్’కు అధికారులు సిద్ధమయ్యారు. వీలైనన్ని ప్రాంతాల్లో లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రచించారు. 1,500కుపైగా శ్మశాన వాటికలతో పాటు చెరువు గట్లు, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లోనూ మొక్కలు నాటనున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో గ్రీన్ కర్టెన్ల పేరిట ఫుట్‌పాత్‌ల వెంబడి గోడలపై తీగల వంటి మొక్కలు పెంచే కార్యక్రమాన్ని అమలు చేశారు. రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా పచ్చదనం పెంపు పనులు చేపట్టనున్నారు.
 
 మార్కెట్ల ఆధునీకరణ: నగర జనాభాతో పోలిస్తే ప్రస్తుతమున్న మార్కెట్లు సరిపోవు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల అవసరాలకు అనుగుణంగా వీలైనన్ని ప్రాంతాల్లో.. ఆధునిక శైలిలో తగినన్ని మార్కెట్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సీఎం ఆకాంక్షకు అనుగుణంగా మోండా మార్కెట్‌ను ఆధునీకరించడంతోపాటు మె హదీపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో కొత్త మార్కె ట్లు రానున్నాయి. నగరంలోని అన్ని సమస్యలపై తగి న అవగాహన కలిగేందుకు కమిషనర్ 337 ప్రాంతాలకు నోడల్ అధికారులను నియమించారు. స్థానిక పారిశుధ్యం, రహదారుల మరమ్మతులు తదితర సమస్యలను సైతం ఎప్పటికప్పుడు పరిష్కరించనున్నారు.
 
 ప్రజలకే పట్టం
‘‘ఏ కార్యక్రమం విజయవంతం కావాలన్నా ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యం. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నా.. వీధులపై చెత్త వేయకుండా చూడాలన్నా వారే సూపర్‌వైజ్ చేయాలి. అప్పుడే పరిసరాలు బాగుపడతాయి. అందుకే స్థానికంగా రూ. 5 లక్షల లోపు విలువైన పనులన్నింటినీ స్థానికులకే ఇస్తాం. రహదారుల మరమ్మతులు, చెరువుల పరిరక్షణ, పార్కుల నిర్వహణ వంటి పనుల్ని వారికే  అప్పగిస్తాం. తద్వారా పనుల్లో నాణ్యత ఉండటమే కాక, త్వరితంగా జరగుతాయి. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతాం. ఎప్పటికప్పుడు వారికి తగిన అవగాహన కల్పిస్తూ.. వారికి కావాల్సిన పనుల్లో వారినే భాగస్వాములను చేస్తాం. తద్వారా ఎవరిపైనా నిందలు వేయలేరు. అవసరమైన నిధులు కేటాయిస్తాం’’
 - సోమేశ్‌కుమార్, కమిషనర్,
 స్పెషల్ ఆఫీసర్ (జీహెచ్‌ఎంసీ)

 
 ‘గ్రేటర్’లో ఇంకా మరెన్నో..
 *    స్థానికులకు ప్రాధాన్యత ఇస్తూ వారి అవసరాలు తీరేలా కొత్త సంవత్సర బడ్జెట్‌కు రూపకల్పన చేశారు.
*    పేదల గృహ నిర్మాణ ం, కమ్యూనిటీ హాళ్లు, పర్యావరణం, హెరిటేజ్, కల్చర్, టూరిజంలకు తగిన
 ప్రాధాన్యత ఇచ్చారు.
*    స్మార్ట్‌సిటీలో భాగంగా ఇళ్ల నంబర్లను ఈజీగా గుర్తించే స్మార్ట్ ఇంటి నంబర్ల విధానాన్ని అమలు చేయనున్నారు.
*   వివిధ సదుపాయాల కల్పనకు రూ.605 కోట్లు కేటాయించారు.
*    రూ. 50 కోట్లతో 1,500 ప్రాంతాల్లో శుద్ధ జల ప్లాంట్లు నిర్మాణం.
*    తాగునీరు, మురుగు నీటిపారుదలకు రూ.300 కోట్లు...
*    ఘనవ్యర్థాల నిర్వహణకు రూ. 100 కోట్లు.
*    మహిళల ఇబ్బందుల్ని గుర్తించి మహిళలకు ప్రత్యేక పబ్లిక్ టాయ్‌లెట్ల ఏర్పాటుకు రూ. 10 కోట్లు.
*   గ్రీన్ హైదరాబాద్’ పేరిట మొత్తం రూ. 150 కోట్లు కేటాయించారు.
*   స్మార్ట్‌సిటీ కార్యక్రమం అమలులో భాగంగా రూ. 25 కోట్లతో 200 ప్రాంతాల్లో ఈ-లైబ్రరీలు ఏర్పాటు చేయనున్నారు.
*   వరదనీటి కాలువల నిర్మాణానికి రూ. 200 కోట్లు కేటాయించారు.
*    డ్రైవర్ కమ్ ఓనర్ వంటి పథకాలతో నిరుద్యోగులకు ఉపాధి బాట చూపుతున్నారు.
*    శ్మశాన వాటికలకు వెళ్లేవారికి సాంత్వన కలిగించేలా మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రశాసన్‌నగర్‌లో మహాప్రస్థానం పేరిట ఇప్పటికే ఒకటి ఏర్పాటైంది.
*    ఈ-ఆఫీస్ అమలుతో పారదర్శకతకు పెద్దపీట వేశారు.
*   ఇంకా పలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.. కొన్ని త్వరలో ప్రారంభం కానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement