ఓటర్ స్లిప్పులు అందజేస్తున్న చేస్తున్న ఆర్డీఓ రాములు(ఫైల్ )
సాక్షి, అయిజ: అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. అయితే అధికారుల ఒత్తిడి మేరకు పనులు త్వరగా పూర్తిచేసే క్రమంలో కిందిస్థాయి సిబ్బంది చేసే పనుల్లో ఓటరు స్లిప్పుల తయారీ తప్పుల తడకగా మారింది.
అయిజ మండలంలో మొత్తం 60,396 ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు, 30,150 మంది కాగా మహిళలు 30,223, ఇతరులు 23 మంది ఉన్నారు. మొత్తం 73 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసేందుకు అధికారులు ఓటర్‌స్లిప్పులు ప్రింట్ చేశారు.
బీఎల్‌ఓలు వాటిని ఇంటింటికి తిరిగి ఓటర్లకు అందజేశారు. నాలుగు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓటర్ స్లిప్పుల్లో సుమారు 2,500 ఓటర్లకు సంబంధించిన చిరునామాల్లో తప్పులు దొర్లాయి.
మారిన చిరునామాలు.
ఓటర్లు ఓటు వేసేందుకు ఓటర్ స్లిప్‌లు తయారు చేసారు. అధికారుల తప్పిదంవలన ఓటర్లు ఓటు వేసే పోలింగ్ కేంద్రాల అడ్రస్‌లు తప్పుల తడకగా ప్రింట్ అయింది. వారం రోజుల క్రితం అయిజ మున్సిపాలిటీలో, మండలంలోని అన్ని గ్రామాల్లో బీఎల్‌ఓలు ఇంటింటికి ఓటరు స్లిప్పులను అందజేశారు.
అయితే ఓటరు స్లిప్పుల్లో కొన్ని చోట్ల తప్పులు ఉన్నాయని ఓటర్లు వాపోతున్నారు. ముఖ్యంగా అయిజ మున్సిపాలిటీలోని 78, 79, 80, 81 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓటర్‌స్లిప్పుల్లో పోలింగ్ కేంద్రాల చిరునామా మొత్తం మారిపోయింది.
అయిజ పట్టణంలోని కమతంపేట, గుర్రంతోట కాలనీల ఓటర్లకు సంబంధించి అయిజ మున్సిపాలిటీలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటువేయాల్సి ఉండగా.. అయిజ మండలంలోని గుడుదొడ్డిలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల చిరునామాను ముద్రించారు. మరికొన్ని ఓటరు స్లిప్పుల్లో అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి మండలంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల చిరునామా ప్రింట్ అయింది.
ఆందోళన చెందుతున్న ఓటర్లు..
ఓటరు స్లిప్పుల్లో తప్పులు దొర్లడంతో ఓటర్లు ఆందోళనకు గురయ్యారు. వారం రోజులుగా బీఎల్‌ఓలకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అయిజ పట్టణంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయాల్సి ఉండగా.. వేరే గ్రామాల్లో, ఇతర మండలాల్లోని పోలింగ్ కేంద్రాల చిరునామాలు ఉంటే అక్కడికి వెళ్లి ఓటు ఎలా వేయగలుగుతామని ఓటర్లు మండిపడుతున్నారు.
దాంతో వీఆర్‌ఓలు తప్పులు సరిదిద్దే కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసి వారి ఓట రు స్లిప్పులను పరిశీలిస్తున్నారు. ఓటర్‌స్లిప్పులపై తప్పుగా ముద్రించబడిన పోలింగ్ కేంద్రం చిరునామాను సరిదిద్ది వాటిపై సంతకం చేస్తున్నారు.
సరిదిద్దుతున్నాం..
అయిజ మున్సిపాలిటీలో ఓటరు స్లిప్పులపై పోలింగ్ స్టేషన్ల అడ్రసులు తప్పుగా ప్రింట్ అయ్యాయని ఫిర్యాదులు వచ్చాయి. వెంటనే రెవెన్యూ అధికారులను పంపించి ఓటరు స్లిప్పులపై తప్పులను సరిచేసి సంతకాలు చేయాలని ఆదేశించాం. మూడు రోజులుగా ఇంటింటికి తిరిగి ఓటరు స్లిప్పులపై తప్పులు సరిచేసి సంతకాలు చేస్తున్నారు. ఇళ్లు తాళాలు వేసి వెళ్లిన వారివి తప్ప దాదాపు అందరి ఓటరు స్లిప్పుల తప్పులు సరిచేసి వీఆర్‌ఓలు సంతకాలు చేశారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే బీఎల్‌ఓలకు సమాచారం ఇవ్వాలి.
– కిషన్‌సింగ్, తహసీల్దార్, అయిజ
Comments
Please login to add a commentAdd a comment