
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సమయస్పూర్తిని టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలతో ముంచెత్తారు.
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సమయస్పూర్తిని టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలతో ముంచెత్తారు. హైదరాబాద్‌లో గుండెపోటుతో చావు అంచుల వరకు వెళ్లిన ఓ వ్యక్తిని ఇద్దరు కానిస్టేబుళ్లు మానవత్వంతో కాపాడారు. బహదూర్‌పుర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లు కే చందన్, ఇన్నయతుల్లాలు సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిసస్సీటేషన్) ప్రక్రియ ద్వారా కుప్పకూలిన మనిషికి తిరిగి ప్రాణం పోశారు. నిజంగా ఇతరులకు సేవ చేయాలనే కోరిక మానవునికున్న అన్నిలక్షణాల్లోకెల్లా గొప్పది అని వారికి సెల్యూట్ అంటూ వీడియోతో పాటూ లక్ష్మణ్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సమయస్పూర్తితో వ్యవహరించి ఓ వ్యక్తి ప్రాణాలు పోలీసులిద్దరూ కాపాడారంటూ నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.
అయితే వారు అనుసరించిన సీపీఆర్ ప్రక్రియ సరైన పద్దతిలో లేదని అయినా వారు చూపించిన చొరవ చాలా గొప్పదని ఓ నెటిజన్ పెట్టిన కామెంట్‌కు వీవీఎస్ లక్ష్మణ్ బదులిచ్చారు. అవును అయినా వారిద్దరు స్పూర్తినిచ్చే పని చేశారని కొనియాడారు.
సీపీఆర్ ఎలా చేయాలి :
మనదేశంలో సంభవిస్తున్న గుండెపోటు మరణాల్లో సగం కేవలం ప్రథమచికిత్స అందకే సంభవిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గుండెపోటును గుర్తించగానే తక్షణ ప్రథమచికిత్సగా సీపీఆర్ చేయాలి. సీపీఆర్ కేవలం వైద్యులు లేక పారామెడికల్ సిబ్బంది మాత్రమే కాకుండా కొద్దిపాటి శిక్షణ పొందిన ఎవరైనా చేయొచ్చు. సీపీఆర్ వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, అది మెదడుకు చేరి అవయవాలకు తగిన సంకేతాలనివ్వటంతో బాధితుడు వేగంగా ప్రమాదం నుంచి బయటపడతాడు. ముందుగా గుండెపోటుతో పడిపోయిన బాధితుడిని పడుకోబెట్టాలి. అతని పక్కనే ఎవరైనా మోకాళ్ల మీద కూర్చుని.. రెండుచేతులనూ కలిపి.. బలంగా బాధితుడి ఛాతీ ఎముక మీద లయబద్ధంగా నొక్కుతుండాలి. ఇలా నొక్కినప్పుడు గుండె పంపింగ్ జరిగి.. రక్తప్రసారం మెరుగవుతుంది. ఒకవైపు ఇలా చేస్తూనే మరో వైపు నోటి ద్వారా శ్వాస అందించాలి. ఒకరి కంటే ఇద్దరు సీపీఆర్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
జాగ్రత్తలు
► సీపీఆర్ కు ముందు బాధితుడు సృహలో ఉన్నాడా లేదా అని గమనించాలి. ఆ వ్యక్తి స్పందించకపోతే పెద్దగా అరవాలి.
► సీపీఆర్ చేసేటప్పుడు భుజాన్ని అటూ ఇటూ కదిలిస్తూ అతనికి ధైర్యం చెప్పాలి. ప్రమాదం లేదని హామీ ఇవ్వాలి.
► బాధితుడికి గాలి ఆడకుండా చుట్టూ జనాలు మూగితే వారిని పక్కకు వెళ్లేలా చూడాలి.
► ఒకవేళ అప్పటికే బాధితుడు సృహ కోల్పోయి స్పందించకపోతే వెంటనే అంబులెన్స్‌కి సమాచారం ఇవ్వాలి.
అవసరం మేరకు 'ఎఇడి'
సీపీఆర్ తో చెప్పుకోదగ్గ ఫలితం లేని కేసుల్లో ఎఇడి (ఆటోమేటిక్ ఎక్స్‌టర్నల్ డిఫిబ్రిల్లేటర్) తప్పనిసరి. ఎఇడి పరికరంలో రెండు ప్యాడ్‌లను బాధితుడి ఛాతి మీద పెట్టి విద్యుత్ షాక్ ఇస్తారు. ‘షాక్ ఇవ్వండి, ఆపండి’ అంటూ పరికరం చేసే సూచనలను పాటిస్తూ చేయాలి. పెద్ద పెద్ద కార్యాలయాలు, అపార్టుమెంట్లు, సమావేశ మందిరాల వద్ద తప్పనిసరిగా వీటిని అందుబాటులో ఉంచగలిగితే ఇప్పుడు సంభవించే మరణాల్లో 30 నుంచి 50శాతం వరకు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.