
స్థలం కోసమే వేచి చూస్తున్నాం
రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీల మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చెరో 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్
భూములు ఇస్తే రాష్ట్రంలో 2,400 ఎంవీ థర్మల్ విద్యుత్ ప్లాంట్‌లు
రామగుండం, పూడిమడక నుంచి 85% విద్యుత్ సొంత రాష్ట్రాలకే
ఎన్టీపీసీ దక్షిణ ప్రాంత ఈడీ ఆర్.వెంకటేశ్వరన్ వెల్లడి
హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీల మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చెరో 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని ఎన్టీపీసీ ప్రాంతీయ కార్యనిర్వాహక సంచాలకుడు (దక్షిణ) ఆర్.వెంకటేశ్వరన్ స్పష్టం చేశారు. విశాఖ జిల్లా పూడిమడకలో 4,000 మెగావాట్ల సామర్థ్యంతో థర్మల్ ప్లాంట్ నిర్మించేందుకు పర్యావరణ అధ్యయనం ముగిసిన వెంటనే ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. తెలంగాణలో సైతం 4,000 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టుల ఏర్పాటులో భాగంగా తొలివిడతగా రామగుండం ప్లాంట్ విస్తరణ చేపట్టామని, అక్కడ 1600(2ఁ800) మెగావాట్ల సామర్థ్యతో ప్లాంట్లను నిర్మిస్తున్నామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం స్థల కేటాయింపులు జరిపితే హామీ మేరకు మిగిలిన 2,400 మెగావాట్ల ప్లాంట్లను సైతం నిర్మిస్తామన్నారు. విద్యుత్ ప్లాంట్లకు విడిభాగాలు, యంత్రాలు, ఇతర సామగ్రిని సరఫరా చేసే కాంట్రాక్టర్లను గుర్తించేందుకు ఎన్టీపీసీ చేపట్టిన ‘వెండర్ ఎన్‌లిస్ట్‌మెంట్’ కార్యక్రమాన్ని వివరించేందుకు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. రామగుండంలో నిర్మిస్తున్న కొత్త ప్లాంట్‌ల నుంచి ఉత్పత్తయ్యే బూడిదను నిక్షిప్తం చేసేందుకు స్థలాన్ని సేకరించాలన్నారు. రామగుండంలో నిర్మిస్తున్న 1600 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ కోసం సింగరేణి బొగ్గును వినియోగించుకుంటామని, పూడిమడకలో నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల ప్లాంట్ కోసం విదేశీ బొగ్గును దిగుమతి చేసుకుంటామన్నారు.
తీర ప్రాంతంలో పూడిమడక ప్లాంట్ వుండడంతో బొగ్గు రవాణా వ్యయం తక్కువగా ఉంటుందన్నారు. అనంతపురం జిల్లాలో 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా తొలి విడతలో 250 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. దీని టెండర్ల ప్రక్రియ ముగింపునకు వచ్చిందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని గట్టు మండలంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. పూడిమడక, రామగుండంలో నిర్మిస్తున్న థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచి 85 శాతం విద్యుత్‌ను సొంత రాష్ట్రాలకే కేటాయిస్తామన్నారు.