వార్!
సబిత- మహేందర్ మధ్య మాటల యుద్ధం
- మంత్రి దూకుడు వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం
- పరస్పర విమర్శలతో వేడెక్కిన రాజకీయం
- తారస్థాయికి చేరిన అత్తా అల్లుళ్ల సవాల్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పదునైన విమర్శలు... వ్యక్తిగత ఆరోపణలతో జిల్లా రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. చేవెళ్ల-ప్రాణహిత డిజైన్ మార్పుపై మొదలైన పోరు చివరకు పరస్పర విమర్శలకు దారి తీసింది. స్వయానా అల్లుడు వరుసైన మహేందర్‌రెడ్డి నేరుగా అత్తమ్మను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించడం రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. రాజకీయాల్లో ఇద్దరిదీ చెరోదారి అయినా ఇప్పటివరకు సబితను ఉద్దేశించి పల్లెత్తు మాట కూడా అనని మహేందర్... ఊహించని స్థాయిలో విమర్శలకు దిగడం చర్చనీయాంశమైంది.
ఇరు కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యం... బంధుత్వం కారణంగా హద్దులు మీరలేదు. మారిన రాజకీయ సమీకరణలు, తాజా పరిణామాల నేపథ్యంలో సబితను లక్ష్యంగా చేసుకొని మహేందర్‌రెడ్డి ఘాటుగా సవాళ్లు విసురుతుండడం హాట్ టాపిక్‌గా మారింది. గోదారి జలాలు రాకుండా ప్రాణహిత డిజైన్ మార్చడాన్ని వ్యతిరేకి స్తున్న కాంగ్రెస్ ఈ అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. ఈ ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న సబితా ఇంద్రారెడ్డిని ఆత్మరక్షణలో పడేసేందుకు మహేందర్‌ను అస్త్రంగా మలుచుకున్నట్లు కనిపిస్తోంది. తనకు రాజకీయ గురువుగా నిలిచిన స్వర్గీయ ఇంద్రారెడ్డి కుటుంబం పట్ల కృతజ్ఞతాపూర్వకంగా ఉండే మహేందర్ ఇప్పటివరకు ఆ కుటుంబానికి వెన్నంటి నిలిచారు.
ఇరువురు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో కొనసాగినా ఎప్పుడు కూడా మిర్శలు, ప్రతివిమర్శల జోలికి వెళ్లలేదు. తాజా పరిణామాలు మాత్రం ఇరు కుటుంబాల మధ్య అగాధాన్ని పెంచేలా కనిపిస్తున్నాయి. సూటిగా సబితను లక్ష్యంగా చేసుకొని విమర్శలు సంధించడమేగాక.. కుమారుడు కార్తీక్‌రెడ్డి భూదందాలపై కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించడం సబిత వర్గీయులను కలచివేసింది. ప్రభుత్వ విధానాలపై తప్పుబడుతున్న తమపై వ్యక్తిగత దూషణలకు దిగడం, ప్రాజెక్టు నమూనా మార్పుపై పోరాడుతున్న తమను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని సన్నిహితుల తో వాపోయినట్లు తెలిసింది. మహేందర్ దూకుడు వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని.. ఇరు కుటుంబాల మధ్య అగ్గి రాజేసేందుకే ఈ స్కెచ్ గీసినట్లు కనిపిస్తోందని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఉక్కిరిబిక్కిరి..
చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్పును వ్యతిరేకిస్తూ విపక్షాలు సాగిస్తున్న ముప్పేట దాడితో మంత్రి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జెడ్పీ సర్వసభ్య సమావేశం జరగకుండా రభస సృష్టించడం.. ప్రతిరోజూ తనను కించపరిచేలా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుండడంతోనే మహేందర్ స్పీడును పెంచారనే ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి సబితను నిలువరించేలా స్టేట్‌మెంట్లు ఇవ్వకపోతే పార్టీలో విశ్వసనీయత కోల్పోతాననే బెంగతోనే ఘాటుగా స్పందించడానికి కారణం కావచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాజకీయంగా ఇరు కుటుంబాల మధ్య దూరం ఉందనే సంకేతాలు ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని అంటున్నాయి. ఇదిలావుండగా, బుధవారం మహేందర్‌రెడ్డి ఆరోపణలకు సబితారెడ్డి వర్గీయులు అదేస్థాయిలో స్పందించడం చూస్తే జిల్లా రాజకీయాల్లో తాజా పరిణామాలు మరింత ఆసక్తి రేకెత్తించనున్నాయని చెప్పవచ్చు.