Minister mahendarreddi
-
రేపట్నుంచి ‘గ్రేటర్’లో కేటీఆర్ రోడ్ షోలు
♦ ఈ నెల 28 వరకు వందకుపైగా డివిజన్లలో ప్రచారం ♦ ఒకటి లేదా రెండు భారీ సభలకు సీఎం ♦ విలేకరుల సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐటీశాఖ మంత్రి కె. తారక రామారావు ఈ నెల 23 (శనివారం) నుంచి 28 వరకు వందకుపైగా డివిజన్లలో రోడ్‌షోల ద్వారా ప్రచారం చేపడతారని రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిలతో కలసి గురువారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేటీఆర్ రోడ్‌షోలలో కనీసం 5 వేల నుంచి 10 వేల మంది వరకు పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. కేటీఆర్ సవాల్‌కు అనుగుణంగా వందకుపైగా డివిజన్లలో విజయం సాధించి గ్రేటర్ పీఠంపై టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే సభలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉందని..ఒకటి లేదా రెండు భారీ బహిరంగ సభలు ఉండే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం కేసీఆర్‌కే సాధ్యమవుతుందన్నారు. నీటి కొరత, విద్యుత్ కోతల వంటి సమస్యలకు చిరునామాగా ఉన్న హైదరాబాద్‌లో సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని మహేందర్‌రెడ్డి చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు అభ్యర్థులు కూడా దొరకడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ సిద్ధాంతాలను గాలికి వదిలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చిందని... బీజేపీ తన విధానాలను వీడి లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నా టీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేరని మహేందర్‌రెడ్డి జోస్యం చెప్పారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని హైదరాబాద్‌లో స్థానికులుగానే చూస్తామన్న సీఎం ప్రకటన వారిలో భరోసా నింపిందని.. ఆయా వర్గాల మద్దతు తమకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంపై కేటీఆర్ విసిరిన సవాలుకు విపక్షాలు జవాబు చెప్పడం లేదని ఎంపీ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారన్నారు. 23, 24 తేదీల్లో కేటీఆర్ రోడ్ షో షెడ్యూలు మంత్రి కేటీఆర్ శనివారం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని రాయదుర్గం (గచ్చిబౌలి)లోని వేంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద మధ్యాహ్నం 3 గంటలకు రోడ్‌షోకు శ్రీకారం చుడతారు. కొండాపూర్, మియాపూర్, హైదర్‌నగర్ అమరావతి దేవాలయం నుంచి ఆల్విన్ కాలనీ, వివేకానంద నగర్, జగద్గిరిగుట్ట బస్టాప్ చౌరస్తా, గాజుల రామారం, ఆర్ఆర్ నగర్లలో ప్రచారం నిర్వహిస్తారు. 24వ తేదీన అయ్యప్ప సొసైటీ వద్ద ప్రచారం ప్రారంభించి వివేకానంద నగర్ చౌరస్తా, అల్లాపూర్, మూసాపేట, ఫతేనగర్, కేపీహెచ్‌బీ కాలనీ, బాలాజీ నగర్, వేంకటేశ్వరస్వామి దేవాలయం పరిసరాలు, కూకట్పల్లి, హస్మత్‌పేట, అంబేడ్కర్ చౌరస్తా, బాలానగర్, బోయిన్పల్లి, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, చింతల్, ఐడీపీఎల్ కాలనీ చౌరస్తాలలో ప్రచారం నిర్వహిస్తారు. -
వార్!
సబిత- మహేందర్ మధ్య మాటల యుద్ధం - మంత్రి దూకుడు వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం - పరస్పర విమర్శలతో వేడెక్కిన రాజకీయం - తారస్థాయికి చేరిన అత్తా అల్లుళ్ల సవాల్! సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పదునైన విమర్శలు... వ్యక్తిగత ఆరోపణలతో జిల్లా రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. చేవెళ్ల-ప్రాణహిత డిజైన్ మార్పుపై మొదలైన పోరు చివరకు పరస్పర విమర్శలకు దారి తీసింది. స్వయానా అల్లుడు వరుసైన మహేందర్‌రెడ్డి నేరుగా అత్తమ్మను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించడం రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. రాజకీయాల్లో ఇద్దరిదీ చెరోదారి అయినా ఇప్పటివరకు సబితను ఉద్దేశించి పల్లెత్తు మాట కూడా అనని మహేందర్... ఊహించని స్థాయిలో విమర్శలకు దిగడం చర్చనీయాంశమైంది. ఇరు కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యం... బంధుత్వం కారణంగా హద్దులు మీరలేదు. మారిన రాజకీయ సమీకరణలు, తాజా పరిణామాల నేపథ్యంలో సబితను లక్ష్యంగా చేసుకొని మహేందర్‌రెడ్డి ఘాటుగా సవాళ్లు విసురుతుండడం హాట్ టాపిక్‌గా మారింది. గోదారి జలాలు రాకుండా ప్రాణహిత డిజైన్ మార్చడాన్ని వ్యతిరేకి స్తున్న కాంగ్రెస్ ఈ అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. ఈ ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న సబితా ఇంద్రారెడ్డిని ఆత్మరక్షణలో పడేసేందుకు మహేందర్‌ను అస్త్రంగా మలుచుకున్నట్లు కనిపిస్తోంది. తనకు రాజకీయ గురువుగా నిలిచిన స్వర్గీయ ఇంద్రారెడ్డి కుటుంబం పట్ల కృతజ్ఞతాపూర్వకంగా ఉండే మహేందర్ ఇప్పటివరకు ఆ కుటుంబానికి వెన్నంటి నిలిచారు. ఇరువురు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో కొనసాగినా ఎప్పుడు కూడా మిర్శలు, ప్రతివిమర్శల జోలికి వెళ్లలేదు. తాజా పరిణామాలు మాత్రం ఇరు కుటుంబాల మధ్య అగాధాన్ని పెంచేలా కనిపిస్తున్నాయి. సూటిగా సబితను లక్ష్యంగా చేసుకొని విమర్శలు సంధించడమేగాక.. కుమారుడు కార్తీక్‌రెడ్డి భూదందాలపై కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించడం సబిత వర్గీయులను కలచివేసింది. ప్రభుత్వ విధానాలపై తప్పుబడుతున్న తమపై వ్యక్తిగత దూషణలకు దిగడం, ప్రాజెక్టు నమూనా మార్పుపై పోరాడుతున్న తమను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని సన్నిహితుల తో వాపోయినట్లు తెలిసింది. మహేందర్ దూకుడు వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని.. ఇరు కుటుంబాల మధ్య అగ్గి రాజేసేందుకే ఈ స్కెచ్ గీసినట్లు కనిపిస్తోందని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఉక్కిరిబిక్కిరి.. చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్పును వ్యతిరేకిస్తూ విపక్షాలు సాగిస్తున్న ముప్పేట దాడితో మంత్రి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జెడ్పీ సర్వసభ్య సమావేశం జరగకుండా రభస సృష్టించడం.. ప్రతిరోజూ తనను కించపరిచేలా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుండడంతోనే మహేందర్ స్పీడును పెంచారనే ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి సబితను నిలువరించేలా స్టేట్మెంట్లు ఇవ్వకపోతే పార్టీలో విశ్వసనీయత కోల్పోతాననే బెంగతోనే ఘాటుగా స్పందించడానికి కారణం కావచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాజకీయంగా ఇరు కుటుంబాల మధ్య దూరం ఉందనే సంకేతాలు ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని అంటున్నాయి. ఇదిలావుండగా, బుధవారం మహేందర్‌రెడ్డి ఆరోపణలకు సబితారెడ్డి వర్గీయులు అదేస్థాయిలో స్పందించడం చూస్తే జిల్లా రాజకీయాల్లో తాజా పరిణామాలు మరింత ఆసక్తి రేకెత్తించనున్నాయని చెప్పవచ్చు. -
చర్చకు మంత్రి మహేందర్‌రెడ్డి సిద్ధమా..?
- మాజీ హోంమత్రిపై విమర్శలు చేసే స్థాయి ఆయనకు లేదు - బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకుల సవాల్ చేవెళ్ల: ఏ పార్టీ హయాంలో, ఎవరి నాయకత్వంలో జిల్లా అభివృద్ధి చెందిందో చర్చించడానికి బహిరంగ చర్చకు మంత్రి మహేందర్‌రెడ్డి సిద్ధమేనా..? అని కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు. మాజీ హోంమంత్రి పి.సబితారెడ్డి, ఆమె తనయుడు కార్తీక్‌రెడ్డిపై రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి చేసిన విమర్శలు, ఆరోపణలపై వారు తీవ్రంగా మండిపడ్డారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు పి.వెంకటస్వామి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.గోపాల్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు జి.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు గురువారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. దివంగత మాజీ హోంమంత్రి పి.ఇంద్రారెడ్డి, మాజీ హోంమంత్రి పి.సబితారెడ్డిల పేర్లు చెప్పుకొని పైకి వచ్చిన మహేందర్‌రెడ్డి వారిని విమర్శించే నైతిక హక్కు లేదని తెలిపారు. గతంలో మహేందర్‌రెడ్డి చేసిన భూదందాలు, ఇతర అక్రమాలు జిల్లా ప్రజలకు తెలుసు అని మండిపడ్డారు. ఆయన హీన చరిత్ర అందరికి తెలుసన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లు నీతి, నిజాయతీతో పనిచేసిన సబితారెడ్డి గురించి వ్యక్తిగతంగా విమర్శించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని స్పష్టం చేశారు. హోంమంత్రిగా ఉన్న సమయంలో సబితారెడ్డి తన కుమారుడి చేత దందాలు చేయించారని మహేందర్‌రెడ్డి ఆరోపించడం దెయ్యాలు వేదాలు వల్లించిన మాదిరిగా ఉందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన ఉండి ప్రాణహిత-చేవెళ్ల డిజైన్‌ను మార్చవద్దంటూ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తుంటే మంత్రి తన ఉనికిని కాపాడుకునేందుకు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. సబితారెడ్డిని విమర్శించే స్థాయి మహేందర్‌రెడ్డికి లేదని తెలిపారు. జిల్లాకు సాగునీరు, తాగునీరు విషయంలో న్యాయం చేయడానికి ముఖ్యమంత్రి వద్ద మాట్లాడే చేతగాని మంత్రి.. నీతిమాటలు చెప్పడం విడ్డూరమని మండిపడ్డారు. జిల్లాకు ఎవరి హయాంలో ఎన్ని నిధులు వచ్చాయో, ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో బహిరంగ చర్చకు సిద్ధం కావాలని నాయకులు మంత్రికి సవాల్ విసిరారు. కార్యక్రమంలో నాయకులు జి.చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ.అలీ, వనం మహేందర్‌రెడ్డి, ఎన్.మాధవరెడ్డి, పి.నాగేశ్వర్‌రెడ్డి ఉన్నారు. -
కేసీఆర్ బూట్లు తుడుస్తున్నారు..
- జిల్లాలో అధికారపార్టీ ఎమ్మెల్యేలు చవటలు, దద్దమ్మలు - ప్రజాసమస్యల్ని పరిష్కరించలేక మహిళల పై విమర్శలు - టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ ఫైర్ సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లా మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చవటలు, దద్దమ్మలని మాజీ మంత్రి జి.ప్రసాద్‌కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి మహేందర్‌రెడ్డికి ఎలాంటి అధికారమూ లేదని, కేవలం బొమ్మమంత్రి మాత్రమేనని విమర్శించారు. పదవి కోసం ఆయన ఎలాంటి పనులైనా చేస్తారని, పదవిని కోల్పోయిన మరుసటి రోజు టీఆర్ఎస్లో ఉండడని, సీఎం కుటుంబ సభ్యుల బూట్లు తుడుస్తూ కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. గురువారం గాంధీభవన్‌లో ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, పార్టీ నేత కార్తీక్‌రెడ్డిలతో కలిసి మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజా సమస్యలపై మాజీ హోం మంత్రి సబిత ప్రశ్నలకు మంత్రి మహేందర్‌రెడ్డి వద్ద సమాధానాలు లేవన్నారు. మంత్రిగా కనీస అవగాహన లేకపోవడంతో ఏంచేయాలో పాలుపోక ఆమెపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. ధైర్యం ఉంటే మంత్రి ఆరోపణలపై విచారణ చేయాలని, దోషిగా తేలితే శిక్షకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. అనవసర ఆరోపణలు చేస్తే మంత్రి ఇల్లు ముట్టడించి ఆందోళన చేపడతామన్నారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా జిల్లా రైతులకు నీళ్లు అందుతాయా, లేదా అనే ప్రశ్నకు కేసీఆర్‌తో సమాధానం చెప్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఖజానాను నింపడంలో కీలకమైన రంగారెడ్డి జిల్లాపై సీఎం కేసీఆర్ కక్ష సాధిస్తున్నారని, నీళ్లేలేని జిల్లాలో ప్రాజెక్టులు కట్టకుండా రైతాంగా న్ని నిండా ముంచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రైలు బండిలో ఇంజిన్ కీలకమైందని, రాష్ట్రంలో జిల్లా కూడా ఇంజిన్ పాత్ర పోషిస్తోందని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పదేళ్ల కాలంలో జిల్లాకు ప్రాణహిత- చేవెళ్ల, పాలమూరు ఎత్తిపోతల పథకాలను తీసుకొస్తే.. కేసీఆర్ వాటి రూపు మార్చి జిల్లాకు అన్యాయం చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా వ్యతిరే కి అని, అందువల్లే రాష్ట్ర కేబినెట్లో మహిళలకు చోటులేదన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలు అతిత్వరలోనే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. చేవెళ్ల పార్లమెంటు నాయకులు పి.కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాసమస్యలపై ఎదిరిం చే వారిపై దాడులు చేయడం టీఆర్ఎస్ నైజమన్నారు. అభివృద్ధిపై మహేందర్‌రెడ్డి సవాల్‌కు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, సమయం, స్థలం చెబితే తామంతా హాజరవుతామన్నారు.