చర్చకు మంత్రి మహేందర్‌రెడ్డి సిద్ధమా..?
- మాజీ హోంమత్రిపై విమర్శలు చేసే స్థాయి ఆయనకు లేదు
- బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకుల సవాల్
చేవెళ్ల: ఏ పార్టీ హయాంలో, ఎవరి నాయకత్వంలో జిల్లా అభివృద్ధి చెందిందో చర్చించడానికి బహిరంగ చర్చకు మంత్రి మహేందర్‌రెడ్డి సిద్ధమేనా..? అని కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు. మాజీ హోంమంత్రి పి.సబితారెడ్డి, ఆమె తనయుడు కార్తీక్‌రెడ్డిపై రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి చేసిన విమర్శలు, ఆరోపణలపై వారు తీవ్రంగా మండిపడ్డారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు పి.వెంకటస్వామి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.గోపాల్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు జి.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు గురువారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు.
దివంగత మాజీ హోంమంత్రి పి.ఇంద్రారెడ్డి, మాజీ హోంమంత్రి పి.సబితారెడ్డిల పేర్లు చెప్పుకొని పైకి వచ్చిన మహేందర్‌రెడ్డి వారిని విమర్శించే నైతిక హక్కు లేదని తెలిపారు. గతంలో మహేందర్‌రెడ్డి చేసిన భూదందాలు, ఇతర అక్రమాలు జిల్లా ప్రజలకు తెలుసు అని మండిపడ్డారు. ఆయన హీన చరిత్ర అందరికి తెలుసన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లు నీతి, నిజాయతీతో పనిచేసిన సబితారెడ్డి గురించి వ్యక్తిగతంగా విమర్శించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని స్పష్టం చేశారు. హోంమంత్రిగా ఉన్న సమయంలో సబితారెడ్డి తన కుమారుడి చేత దందాలు చేయించారని మహేందర్‌రెడ్డి ఆరోపించడం దెయ్యాలు వేదాలు వల్లించిన మాదిరిగా ఉందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రజల పక్షాన ఉండి ప్రాణహిత-చేవెళ్ల డిజైన్‌ను మార్చవద్దంటూ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తుంటే మంత్రి తన ఉనికిని కాపాడుకునేందుకు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. సబితారెడ్డిని విమర్శించే స్థాయి మహేందర్‌రెడ్డికి లేదని తెలిపారు. జిల్లాకు సాగునీరు, తాగునీరు విషయంలో న్యాయం చేయడానికి ముఖ్యమంత్రి వద్ద మాట్లాడే చేతగాని మంత్రి.. నీతిమాటలు చెప్పడం విడ్డూరమని మండిపడ్డారు. జిల్లాకు ఎవరి హయాంలో ఎన్ని నిధులు వచ్చాయో, ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో బహిరంగ చర్చకు సిద్ధం కావాలని నాయకులు మంత్రికి సవాల్ విసిరారు. కార్యక్రమంలో నాయకులు జి.చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ.అలీ, వనం మహేందర్‌రెడ్డి, ఎన్.మాధవరెడ్డి, పి.నాగేశ్వర్‌రెడ్డి ఉన్నారు.