వరంగల్ కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పాలకవర్గాన్ని సస్పెండ్ చేస్తూ సహకార శాఖ నిర్ణయం తీసుకుంది.
- ఆరు నెలలపాటు విధింపు
- ప్రత్యేక అధికారిగా వరంగల్ రూరల్ కలెక్టర్
సాక్షి, వరంగల్: వరంగల్ కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పాలకవర్గాన్ని సస్పెండ్ చేస్తూ సహకార శాఖ నిర్ణయం తీసుకుంది. పాలకవర్గం సస్పెన్షన్ నేపథ్యంలో 6 నెలలపాటు ప్రత్యేక అధికారిగా వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్‌ను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మంగళవారం మధ్యాహ్నం ఆయన బాధ్యతలను స్వీకరించారు. సహకారశాఖ నిర్ణయంతో 2 వారాలు గా నెలకొన్న సందిగ్దతకు తెరపడింది. పాలకవర్గాన్ని సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఈ గడువులోపు మరోసారి ఉన్నతస్థాయి విచారణ నిర్వహించే అవకాశం ఉంది.
ఈ విచారణ నివేదిక ఆధారంగా పాలకవర్గాన్ని రద్దు చేయడమో, పునరుద్ధరించడమో జరుగుతుంది. సస్పెన్షన్ గడువును మరో 6 నెలలూ పొడిగించే అవకాశ ముందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013 ఫిబ్రవరిలో సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరితో ప్రస్తుత సంఘాల పదవీకాలం ముగియనుంది. వరంగల్ డీసీసీబీలో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, టి.రాజయ్య, ఎమ్.యాదగిరిరెడ్డి, ధర్మారెడ్డి, ఎ.రమేశ్, బి.శంకర్‌నాయక్ సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీనిపై సహకార శాఖ ప్రాథమిక విచారణ చేసింది.
డీసీసీబీలో నిర్వహణ లోపాలపై చైర్మన్ జంగా రాఘవరెడ్డికి సహకార శాఖ జాయింట్ రిజిస్ట్రార్ జి.శ్రీనివాసరావు ఏప్రిల్ 15న నోటీసు జారీ చేశారు. నోటీసుకు జంగా రాఘవరెడ్డి సోమవారం వివరణ ఇచ్చా రు. మరుసటి రోజు పాలకవర్గాన్ని సస్పెండ్ చేస్తూ సహకార శాఖ నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్‌పై ఎమ్మెల్యే దయాకర్‌రావు స్పందిస్తూ.. అవినీతి, అక్రమాల కారణంగానే వరంగల్ డీసీసీబీ పాలకవర్గాన్ని సస్పెండ్ చేశారని, ఈ విషయంలో ఇతర కారణాలు లేవని అన్నారు.
కక్ష సాధింపు చర్యలు: జంగా రాఘవరెడ్డి
‘‘సహకార చట్టాలకు విరుద్ధంగా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కక్ష సాధింపులకు పాల్పడ్డారు. నాపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే. పాలకవర్గం, నేను... అవినీతి, అక్రమాలకు పాల్పడితే నష్టాల్లో ఉన్న డీసీసీబీ రూ.5 కోట్లకు పైగా లాభాల్లోకి ఎలా వస్తుంది’’ అని రాఘవరెడ్డి ప్రశ్నించారు..