
వాటర్ ఇండియా కార్యాలయంలో అగ్నిప్రమాదం
బేగంపేట,న్యూస్‌లైన్: పూజ వాణిజ్య సముదాయంలో అగ్నిప్రమాదం జరిగి పక్షం రోజు కాకముందే బేగంపేటలో శుక్రవారం మరో ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... స్థానిక పైగా కాలనీలో రుక్మిణి టవర్స్ పేరుతో ఓ భవనం ఉంది. జీ ప్లస్ 4గా నిర్మించిన ఈ భవనం 1వ అంతస్తులో వాటర్ ఇండియా కార్యాలయం, 2వ అంతస్తులో ఇన్‌స్టెన్సి సాఫ్ట్‌వేర్ కార్యాలయం, 3వ అంతస్తులో ఆసియా ఇంజినీర్స్, 4వ అంతస్తులో భవన యజమాని కుటుంబం నివాసముంటోంది.
శుక్రవారం ఉదయం 5.30కి మెదటి అంతస్తులోని వాటర్‌ఇండియా కార్యాలయంలో మంటలు, పొగలు వచ్చాయి. ఇంటి యజమాని రాములు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మౌలాలి, ఫ్యారడైజ్, సనత్‌నగర్ అగ్నిమాపక కేంద్రాల నుంచి ఏడు ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలను ఆర్పివేశాయి. అయితే, అప్పటికే భవనం పూర్తిగా కాలిపోయింది. ప్రమాదానికి కారణం తెలియరాలేదు.
ఆస్తిన ష్టం లక్షల్లో ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఫైర్ ఆఫీసర్ ఎంఎ షరీఫ్ తెలిపారు. పై అంతస్తులో ఉన్న యజమాని రాములు కుటుంబ సభ్యులను నారికల్ సహాయంతో అగ్నిమాపక సిబ్బంది సురక్షింతంగా కిందకు తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని బేగంపేట, మహంకాళి ఏసీపీలు మనోహర్, మహేందర్‌తో పాటు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు జంపన ప్రతాప్, వెంకట్రావు సందర్శించారు.