ఓరుగల్లు..గొల్లు గొల్లు
రుద్రమ కోటలో కరువు తాండవం
♦ వానల్లేక సాగు ఆగం
♦ రైతుకు చేరని కరువు సాయం..
♦ వేతనాలు లేని ‘ఉపాధి’
♦ మేతలేక మూగజీవాల అమ్మకం
మన్‌సాన్‌పల్లి... వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండలంలోని ఓ ఊరు. 260 కుటుంబాలు ఉంటాయి. కరువు కాటేయడంతో ఈ ఊరి నుంచి ఏకంగా 100 కుటుంబాలు హైదరాబాద్‌కు వలస వెళ్లాయి! ఊళ్లో పంటలు లేవు. ఉపాధి పనుల డబ్బులు రావడంలేదు. ఊరికి ఆదరువుగా ఉండే ఊట చెరువు ఎండిపోయింది. రబీ తుడుచుపెట్టుకుపోయింది. గుక్కెడు తాగునీటికి ఈ పల్లె అల్లాడుతోంది..
....ఇది ఒక్క మన్‌సాన్‌పల్లి పరిస్థితి కాదు! వరంగల్ జిల్లాలోని వందల ఊళ్లలో ఇప్పుడు ఇదే గోస. దుర్భర కరువుతో పంటలు పోయి, ఉపాధి లేక జనం అవస్థ పడుతున్నారు. పశుగ్రాసం లేక గొడ్డూగోదా సంతకు చేరుతున్నాయి. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడంతో బోర్లన్నీ ఎత్తిపోతున్నాయి. అటు గుక్కెడు నీటికోసం వన్యప్రాణులూ అల్లాడుతున్నాయి. జిల్లాలో కరువుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
- పిన్నింటి గోపాల్, సాక్షి ప్రతినిధి, వరంగల్
వేతనాలు లేని ఉపాధి...
దుర్భర కరువుతో వ్యవసాయం నాశనమైపోయింది. రైతులకు, వ్యవసాయంపై ఆధారపడిన కూలీలకు పనులు దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో కంటే ఎక్కువగా ఉపాధి పనులు చేయించాల్సిన అధికారులు ఆ స్థాయిలో ప్రణాళిక రూపొందించలేదు. ఆలస్యంగా స్పందించి ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని మండలాల్లో ఉపాధి పనులు జోరుగానే సాగుతున్నా.. కూలీలకు వేతనాలు ఇవ్వడం లేదు. రోజువారీ కూలి దొరకని వారికి పని కల్పించి మూడు రోజుల్లోపు చెల్లించే లక్ష్యంతో మొదలైన పథకం అభాసుపాలవుతోంది. 60 రోజులు దాటినా కూలీలకు చెల్లింపులు చేయడం లేదు. పనులు చేసిన వారు నెలలుగా కూలి డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి తరువాత నిధులు రాలేదు. అధికారులు కూలీలకు డబ్బులు చెల్లించలేదు. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 6.03 లక్షల మంది కూలీలకు జిల్లా అధికారులు రూ.32.82 కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉంది.
ఏడు వారాలుగా పైసలు ఇత్తలేరు
పనులు చేసి ఏడు వారాలు అయితాంది. ఇంతవరకు పైసలిత్తలేరు. ఇల్లు గడవడం శాన ఇ బ్బంది అయితాంది. సార్లను అడిగితే పై నుంచి ఇంక పైసలు రాలేదని చెబుతుండ్రు. పనిజేసిన పైసలియ్యకుంటే మేమెట్ల బతకాలే.
- బైరి సునీత, ఉపాధి కూలీ,గూడూరు, పాలకుర్తి మండలం
తాగునీళ్లకు గోసగోస
వరంగల్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ తాగునీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. జిల్లాలో మొత్తం 2403 ఆవాసాలు ఉన్నాయి. గ్రామీణ తాగునీటి సరఫరా(ఆర్‌డబ్ల్యూఎస్) విభాగం నివేదిక ప్రకారమే జిల్లా వ్యాప్తంగా 18 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ ఊళ్లలో నీరు దొరక్కపోవడంతో సమీప గ్రామాల నుంచి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అరుునా ఆ నీరు సరిపోక ఈ గ్రామాల్లోని ప్రజలు నీటి కోసం అల్లాడిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 970 ఆవాసాల్లో తాగునీటి సమస్య ఉంది. ఈ గ్రామాల్లో 1603 ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకుని తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
ముఖ్యంగా జనగామ నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. బచ్చన్నపేట మండలం కొన్నె శివారు బీసీ కాలనీలో మూడు బోర్లలో రెండు పూర్తిగా ఎండిపోయాయి. ఒక్క బోరుతో గంటకో బిందె నింపుకుంటూ మహిళలు అరిగోస పడుతున్నారు. కొన్నెకు ఆనుకుని లింగంపల్లి, కొడవటూరు అంకుషాపూర్ గ్రామాల్లోనూ ఇదే పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు జీవనదిగా పేరున్న గోదావరి ఎండిపోయింది. ముల్లకట్ట బ్రిడ్జి ప్రాంతాల్లో చుక్క నీరు లేకుండా గోదావరి ఎడారిని తలపిస్తోంది. గోదారిలో నీళ్లు లేకపోవడంతో సమీపంలోని అటవీ గ్రామాల ప్రజలు తాగునీటి కోసం కష్టాలు పడుతున్నారు.
చెలమలతో దాహం తీర్చుకుంటున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరంగా ఉన్న గ్రేటర్ వరంగల్‌లో రెండు రోజులకు ఓసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్‌లో కొత్తగా విలీనమైన విలీన గ్రామాల్లో ట్యాంకర్లతో మంచినీటిని సరఫరా చేస్తున్నారు. విలీన గ్రామాల్లో ఉన్న మూడు డీఫ్లోరైడ్ రిజర్వాయర్‌లు పూర్తిగా ఎండిపోయాయి. 15 విలీన గ్రామాల్లో బోర్లను అద్దెకు తీసుకొని తాగునీటి సరఫరా చేస్తున్నారు. మున్నేరు నది పూర్తిగా ఎండిపోతుండడంతో మహబూబాబాద్‌కు నీటి కష్టాలు ముంచుకొస్తున్నాయి.
గడ్డికీ గడ్డు కాలం...
వరుసగా రెండో ఏడాది కరువు మూగజీవాలకు శాపంగా మారింది. పంటల్లో వచ్చిన నష్టాలతో ఇప్పటికే రైతులు కుదేలయ్యారు. పశువులకు మేత కోసం డబ్బులు ఖర్చు చేసే పరిస్థితి లేదు. పశుసంపద పరంగా తెలంగాణలో వరంగల్ జిల్లా రెండో స్థానంలో ఉంది. జిల్లా వ్యాప్తంగా 16.27 లక్షల పశువులు ఉన్నాయి. పశువుల కోసం 14.80 లక్షల టన్నుల పశుగ్రాసం అవసరం ఉంటుంది. ఎక్కువ పంటలు నష్టపోవడంతో జిల్లా వ్యాప్తంగా 14.15 లక్షల టన్నుల పశుగ్రాసం మాత్రమే అందుబాటులో ఉందని పశుసంవర్థక శాఖ చెబుతోంది. 65 వేల టన్నుల పశుగ్రాసం కొరత ఉంది. జిల్లా వ్యాప్తంగా పశుగ్రాసం సమస్య ఉంది.
కరువు ప్రాంతాలుగా ప్రకటించిన 11 కరువు మండలాల్లోనూ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కరువు మండలాల్లో ఒక్కో మండలానికి 500 మంది రైతులను ఎంపిక చేసి పశుదాణను 50 శాతం సబ్సిడీపై అందించాల్సి ఉండగా ఇప్పటికీ ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదు. ఒక్కో రైతుకు 100 కిలోల పశుదాణాను సబ్సిడీపై అందించాల్సి ఉన్నా పశుసంవర్థక శాఖ పట్టించుకోవడం లేదు. దీంతో పశువులను సాకే పరిస్థితి లేక రైతులు అమ్ముకుంటున్నారు.
ఆసరా ఆలస్యం...
పేదలకు ఆసరాగా నిలిచేందుకు ప్రభుత్వం ఇచ్చే సామాజిక పింఛన్ల డబ్బులు ప్రతి నెలా అందడం లేదు. కొన్ని మండలాల్లో రెండు నెలలకోసారి ఇస్తున్నారు. ఎక్కువ మండలాల్లో నెలలో సగం రోజులు గడచిన తర్వాతే పంపిణీ చేస్తున్నారు. ఎలాంటి పనులూ లేకపోవడంతో సామాజిక పింఛన్ల డబ్బులు ఆసరాగా ఉంటాయని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. అధికారులు మాత్రం తమకు తోచినప్పుడు పింఛన్ల మొత్తం పం పిణీ చేస్తున్నారు. మహబూబాబాద్ మండలంలోని 20 గ్రామాల్లో ఆసరా పింఛన్లు ప్రతి నెలా ఆలస్యంగానే అందుతున్నాయి. ఒక్కోసారి మూడు నెలలకోసారి ఇస్తున్నారు.
ఏ నెల పింఛన్ ఆనెల ఇస్తలేరు
పింఛన్ల డబ్బులు పెంచినందుకు ఇబ్బంది లేకుండ ఉంటాంది. ఇప్పుడిప్పుడు కొంత ఇబ్బంది అయితాంది. ఏ నెల పింఛన్లు ఆ నెల ఇత్తలేరు. రెండుమూడు నెలలకోసారి ఇస్తాన్రు.
- బానోత్ సోటీ, రజాలీపేట, మహబూబాబాద్ మండలం
జలం పాతాళానికి..
జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. గతంలో ఎప్పుడూ లేనంత లోతుకు చేరాయి. భూగర్భ నీటి వనరుల శాఖ నివేదిక ప్రకారం మార్చి ఆఖరులోనే 11.97 మీటర్ల లోతులో నీళ్లు ఉన్నాయి. రఘునాథపల్లి మండలంలో దారుణంగా 43.84 మీటర్ల లోతులోకి భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మే నెలలో ఈ పరిస్థితి మరింత దుర్భరంగా మారనుంది. రామప్ప, లక్నవరం, పాకాల, మల్లూరు మధ్యతరహా ప్రాజెక్టులోనే కొంత వరకు నీళ్లు ఉన్నాయి.
వరంగల్ జిల్లాలో 5839 చిన్న నీటి వనరుల చెరువులున్నాయి. ఈ చెరువుల కింద 2,55,187 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం 763 చెరువుల్లోనే కొద్దిశాతం నీరు ఉన్నట్లు సాగునీటి శాఖ నివేదిక చెబుతోంది. చెరువులు ఎండిపోవడంతో చేపలు చనిపోతున్నాయి. దీంతో మత్స్యకారులు భారీగా నష్టపోతున్నారు. కేసముద్రం మండలం కోరుకొండపల్లి చెరువులో తక్కువగా నీళ్లు ఉన్నాయి. ఎండ తీవ్రతకు నీళ్లు వేడెక్కడంతో చెరువులోని దాదాపు రెండు టన్నుల చేపలు చనిపోయాయి. చేపలు చనిపోవడంతో చెరువు లీజుదారుడు, మత్స్యకార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇదే ఊరికి చెందిన మంగి ఉప్పలయ్య చెరువును లీజుకు తీసుకుని రూ.2 లక్షలు ఖర్చు చేసి నాలుగున్నర లక్షల చేపపిల్లను వానాకాలం ఆరంభంలో చెరువులో వేశాడు. ఎండ వేడికి చేపలు చనిపోవడంతో భారీగా నష్టపోయాడు.
రైతన్నకు సాయమేది?
వరంగల్ జిల్లాలో మొత్తం 51 మండలాలు ఉన్నాయి. 11 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. బచ్చన్నపేట, చేర్యాల, జనగామ, మద్దూరు, నర్మెట, స్టేషన్‌ఘన్‌పూర్, లింగాలఘణపురం, ధర్మసాగర్, రఘునాథపల్లి, జఫర్‌గఢ్, నర్సింహులపేట మండలాల్లో దుర్భరమైన కరువు నెలకొంది. 79,364 రైతులకు చెందిన 42,333 హెక్టార్లలో పంటలు నష్టపోయాయి. పంట నష్టపోయిన రైతులకు రూ.28.78 కోట్ల పెట్టుబడి రాయితీగా ఇవ్వాల్సి ఉంది. ఖరీఫ్‌లో నష్టపోయిన పంటల పరిహారం... రబీ ముగిసినా ఇంకా రాలేదు. పంటలు పోయి, పెట్టుబడి నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు.
ఎండిన పంటలు
కరువు కారణంగా వరంగల్ జిల్లాలో రబీ విస్తీర్ణం బాగా తగ్గింది. గత ఏడాదితో పోల్చితే అన్ని పంటలూ తక్కువ విస్తీర్ణంలోనే సాగయ్యాయి. రబీలో వరంగల్ జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 1,57,211 హెక్టార్లు. గత ఏడాది 1,27,371 హెక్టార్లలో పంటలు సాగు చేశారు. గత ఏడాది కంటే దుర్భర కరువు రావడంతో ఈ ఏడాది 1,10,706 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. ఈ పంటల్లోనూ 30 శాతానికిపైగా ఎండిపోయాయి.
పర్యాటకులు లేరు...
చారిత్రక కట్టడాలతో రాష్ట్రంలోనే ఉత్తమ పర్యాటక కేంద్రంగా ఉన్న వరంగల్ జిల్లాకు నిత్యం పర్యాటకులు వస్తుండేవారు. ఎండల తీవ్రతతో పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఎక్కువ మంది పర్యాటకులు వచ్చే రామప్ప ఆలయానికి వచ్చే వారే లేకుండాపోయారు. 20 రోజులుగా రామప్ప ఆలయానికి పర్యాటకుల తాకిడి పూర్తిగా తగ్గిపోయింది. గతంలో దూర ప్రాంతాల నుండి ప్రైవేటు వాహనాల్లో తరలివచ్చి రామప్ప ఆలయంతో పాటు సరస్సు అందాలను తిలకించి సరస్సులో బోటు షికారు చేస్తూ సందడి చేసేవారు. 36 అడుగుల నీటిమట్టం గల రామప్ప సరస్సులో ప్రస్తుతం 11 అడుగుల నీరు మాత్రమే ఉండడంతో సరస్సు వైపు కూడా కన్నెత్తి చూసే వారే కరువయ్యారు. రోజుకు వందలాది సంఖ్యలో రామప్పకు వచ్చి రామలింగేశ్వరున్ని దర్శించుకునే భక్తులు ప్రస్తుతం 10 గంటల లోపు మాత్రమే పదుల సంఖ్యలో వచ్చి వెళుతున్నారు.
అయ్యో అడవి ప్రాణులు...
వేసవిలో అధికారులు వన్యప్రాణుల సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో జంతువులు నీటి కోసం అల్లాడుతున్నాయి. తాడ్వాయి అటవీ సంరక్షణ రేంజ్ పరిధిలోని తాడ్వాయి, మేడారం సెక్షన్ పరిధిలోని దుప్పులు, మెకాలు, కానూజులు, కొండగొర్రెలు, కొండముంచులు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు. తదితర జంతువులు వందల సంఖ్యలో ఉన్నాయి. జంతువులు సంచరించే ప్రాంతాల్లో పదేళ్ల క్రితం ఎనిమిది నీటి తొట్లను నిర్మించారు. వేసవి కాలంలో ఈ తొట్లలో అధికారులు నీరు తీసుకువచ్చి పోయాల్సి ఉంది. అధికారులు ఈ పనులు చేయకపోవడంతో అడవి జంతువులు నీటి కోసం గోస పడుతున్నాయి. నెమళ్లు, ఇతర చిన్న జంతువులు చనిపోతున్నాయి.
తాగునీటి ఇబ్బందులు లేవు
కరువు నేపథ్యంలో తాగునీటి సమస్యను అధిమించేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి మండలానికి ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించాం. జిల్లాలో ఏక్కడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేశాం. 18 గ్రామాలకు దగ్గరి ప్రాంతాల నుంచి ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేస్తున్నారు. 970 ఆవాసాల్లో 1603 ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకుని తాగునీటిని సరఫరా చేస్తున్నారు. తాగునీటి సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కోసం ప్రత్యేకంగా రూ.17.27 కోట్లను కేటాయించింది. విపత్తు సహాయ నిధి(సీఆర్‌ఎఫ్) నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.2.59 కోట్లను విడుదల చేసింది. పేదలకు ఉపాధి కల్పించేందుకు రూ.300 కోట్లతో ప్రణాళిక రూపొందించాం. పెండింగ్‌లో ఉన్న నిధులు విడుదలయ్యాయి. కూలీలకు చేరుతున్నాయి. అన్ని గ్రామాల్లో ఉపాధి కల్పించేందుకు 29 రకాల పనులు చేయిస్తున్నాం. శాశ్వతంగా ఉపయోగపడే పనులు చేపట్టేందుకు 100 గ్రామాలను ఎంపిక చేశాం.
- వాకాటి కరుణ, వరంగల్ జిల్లా కలెక్టర్
నాలుగు రోజులకోసారి ట్యాంకర్
కాలనీలో మంచి నీరు దొరకడం లేదు. ఉన్న బోరు ఎత్తిపోయింది. డబ్బా నీరు నిండాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. నాలుగు రోజుల కోసారి ట్యాంకర్‌తో నీటి సరఫరా చేస్తున్నారు. సగం కాలనీకి సరిపోవడం లేదు. నీళ్లు దొరక్క గొడవలు జరుగుతున్నయి. రాత్రి పన్నెండు గంటల వరకు ట్యాంకు వద్దనే ఉంటున్నం. పొద్దుగాలనే లేచి క్యాన్లను క్యూలో పెడుతున్నాం. నీళ్ల కోసం గంటల తరబడి నిలబడితే ఎండదెబ్బ తగిలి అనారోగ్యానికి గురవుతున్నాం. ప్రభుత్వం రోజూ ట్యాంకర్ నీటిని సరఫరా చేయాలని కోరుతున్నం.
- పుప్పాల లక్ష్మి, కొన్నె, బచ్చన్నపేట మండలం
నెలరోజుల్లో ఆరు బోర్లు వేసిన
మూడెకరాల తరిపొలంలో మిరప, టమాటా పంటలను సాగు చేసిన. సబ్సిడీ డ్రిప్ కోసం దరఖాస్తు చేసుకుంటే మంజూరీ చేయలేదు. పంటలు ఎండిపోతుంటే తట్టుకోలేక పోయిన. రూ.30 వేలు పెట్టి డ్రిప్‌ను కొనుగోలు చేసిన. బోర్లు ఎండిపోయినయి. దొరికినకాడల్లా అప్పులు తెచ్చా. ఈ నెల రోజుల్లోనే లక్ష రూపాయలు ఖర్చు చేసి ఆరు బోర్లు వేసిన. అన్నీ పోయినయ్. ఆరు సీజన్లుగా ఎవుసంలో బస్తా వడ్లు ఇంటికి వచ్చిన దాఖలాలు లేవు. ఇల్లు గడిచేందుకు నా కుమారుడు పెళ్లిళ్లకు వంటలు చేసేందుకు పోతున్నడు. నేను ఉపాధి పనికి పోతున్న. ఆరు వారాలుగా ఉపాధి కూలీ పైసలు ఇస్తలేరు.
ఇట్లయితే పూట గడిచేది ఎట్లా? - ఎండీ కరీం, మన్‌సాన్‌పల్లి, బచ్చన్నపేట మండలం
కోళ్లు విలవిల...
ఎండల తీవ్రతకు కోళ్ల పరిశ్రమ కుదేలవుతోంది. ఎండకు తట్టుకోలేక భారీ సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. వరంగల్ జిల్లాలో 1600 కోళ్ల ఫారాలు ఉన్నాయి. 15 లక్షల లేయర్ కోళ్లు ఉన్నాయి. ప్రతి రోజు సగటున 40 వేల బ్రాయిలర్ కోళ్ల విక్రయాలు జరుగుతుంటాయి. ఎండలు తీవ్రమవడంతో కోళ్లు ఎక్కువగా చనిపోతున్నాయి. వేడికి కోళ్ల ఉత్పత్తులు తగ్గుతున్నాయి. వేడి నుంచి ఉపశమనం కోసం కోళ్ల ఫారాలపై పది నిమిషాలకోసారి నీళ్లు చల్లాల్సి ఉంటుంది. వడగాడ్పుల నుండి రక్షణ కల్పించేందుకు కోళ్ళ ఫారాల చుట్టుపక్కల జనుపనార సంచులను కడుతున్నారు. నిరంతరం ఈ సంచులపైకి నీటిని వదిలి కోళ్ళఫారం లోపలి ఉష్ణోగ్రతలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.
కరువుపై కలం వేదన
కన్ను పొడుచుకున్న కసికెడు నీళ్లురాకా కాశేగడ్డి మొలిచిన దిగుడుబావులు గుండె తడి ఆరి చేలనాలు కల్పి తడపలేక చెమ్మగిల్లిన చెరువులు కాలం కలసిరాక పొలం నొసటిమీద సెలవుపత్రం చె క్కుతున్న రైతు ఊరి మెడమీద కత్తిలా ఊగులాడుతున్న కరువు గరికపూల రేకులు గాలికి రాలిపడుతున్నంత తేలికగా ఖాళీ అవుతోంది ఊరు..
- (కొండి మల్లారెడ్డి)