మంత్రి కేటీఆర్ (ఫైల్‌ఫొటో)
సాక్షి, హైదారాబాద్ : తెలంగాణ ప్రభుత్వ హయాంలో ప్రతి కుటుంబం ఆత్మగౌరవంలో ఉండాలన్నది ముఖ్యమంత్రి కేటీఆర్ ఉద్దేశం అని ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కె తారకరామారావు తెలిపారు. కంటోన్మెంట్ మడ్ ఫోర్డ్ డబుల్ బెడ్‌రూమ్‌లకు శంకుస్థాపనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో రెండువేలకు పైగా మురికివాడలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వానికి అందిస్తే డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని తెలిపారు. మురికి వాడలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్నదే టీఆర్‌ఎస్ ప్రభుత్వం లక్ష్యం అన్నారు. గతంలో ప్రభుత్వాలు నిర్మించిన ఇళ్ళు అగ్గిపెట్టెల్లా ఉండేవని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో విశాలవంతమైన డబుల్ బెడ్‌రూం ఇళ్ళను నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు రూ.18వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, దేశ వ్యాప్తంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణాల కంటే ఇది అధికమని మంత్రి వెల్లడించారు. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు సామెతలో ఉన్న రెండింటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ సాయం చేస్తున్నారని అన్నారు. కంటోన్మెంట్ హాస్పిటల్‌ను ప్రభుత్వానికి అప్పగిస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. జేబీఎస్ నుంచి శామీర్‌పేట్, ప్యాట్నీ నుంచి బోయిన్‌పల్లి వరకూ ఉన్న స్థలాన్ని రాష్ట్రానికి అప్పగిస్తే స్కైవే నిర్మాణాలు చేపడతామని కేంద్ర రక్షణ మంత్రిని అడిగినట్లు మంత్రి వెల్లడించారు. పూణె తరహాలో ఇక్కడే ఆర్మ్‌డ్ ఫోర్స్ మెడికల్ కాలేజీ వచ్చేలా కృషి చేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రామన్న కుంట అభివృద్ధికి రూ.2.5 కోట్లు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
కంటోన్మెంట్ సమస్యలు తీర్చాం..: మంత్రి తలసాని
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో డబుల్‌బెడ్ రూం నిర్మాణాలను చేపట్టినట్లు మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జీహెచ్‌యంసీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అన్నీ నెరవేర్చుతున్నామని మంత్రి అన్నారు. కంటోన్మెంట్‌కు ఉన్న నీటి సమస్యను తీర్చేందుకు ఏరియర్స్‌కు పెండింగ్‌లో ఉన్న రూ.16కోట్లను ప్రభుత్వం చెల్లించిందన్నారు. అవినీతితో నిండిపోయిన కంటోన్మెంట్ బోర్డును ప్రక్షాళన చేశామని మంత్రి తెలిపారు. రోడ్డు సమస్యను మంత్రి కేటీఆర్, కేంద్ర రక్షణ మంత్రితో చర్చలు జరిపి పరిష్కరించారని తలసాని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment