మేము సైతం!
మండలి బరిలోకి దిగిన ఎంపీటీల ఫోరం అభ్యర్థులు
కొత్త అశోక్‌గౌడ్, సునీత పేర్లు ఖరారు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: శాసనమండలి పోరులో సొంత అభ్యర్థులను బరిలో దించాలని మండల ప్రాదేశిక సభ్యుల(ఎంపీటీసీ) ఫోరం నిర్ణయించింది. పార్టీలకతీతంగా స్థానిక సంస్థల ప్రతినిధులను పోటీ
చేయించాలని నిర్ణయించిన ఫోరం..
రంగారెడ్డి జిల్లా నుంచి రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కొంగరకలాన్ ఎంపీటీసీ, ఇబ్రహీంపట్నం వైస్ ఎంపీపీ కొత్త అశోక్‌గౌడ్, గాగిల్లాపూర్ ఎంపీటీసీ సునీతా సంజీవరెడ్డిని అభ్యర్థులుగా రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం ప్రకటించింది. స్థానిక సంస్థల కోటాలో జరిగే కౌన్సిల్ స్థానాలకు ‘స్థానిక’ ప్రతినిధులకు కేటాయించ కుండా.. ఇతరులకు టికె ట్లివ్వడంపై తీవ్ర అభ్యంతరం చేసిన ఫోరం.. సొంత అభ్యర్థులను బరిలో దించాలని నిర్ణయించింది. ఆత్మప్రభోదానుసారం ఓటు హక్కు వినియోగించుకోవాలనే నినాదంతో సభ్యులవద్దకు వెళ్తున్నట్టు అశోక్‌గౌడ్ ‘సాక్షి’కి తెలిపారు. అధికారాలు, విధులపై మండలిలో వాణిపించేందుకు స్థానిక సంస్థల ప్రతినిధులుగా అవకాశం ఇవ్వాలని కోరనున్నట్లు చెప్పారు.
ఇదిలావుండగా, మండలి స్థానాలకు జరిగే ఓటింగ్ విధానంపై ఎంపీటీసీ సంఘం సభ్యులు రిటర్నింగ్ అధికారి కాట ఆమ్రపాలితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే పలు సందేహాలను నివృత్తిచేసుకున్న సభ్యులకు ఓటింగ్ విధానంపై స్పష్టత రాలేదు. రెండు స్థానాలకు ఒకే బ్యాలెట్ ఉంటుందా? ప్రాధాన్య క్రమంలో ఓటింగ్ నిర్వహిస్తారా అనే అంశంపై రిటర్నింగ్ అధికారి నుంచి తగిన సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో త్వరలోనే దీనిపై స్పష్టమైన వివరణ ఇస్తామని చెప్పినట్లు ఎంపీటీసీ ఫోరం నాయకులు తెలిపారు.