mptc forum
-
28న ఎంపీటీసీల ఫోరం ‘చలో ఢిల్లీ’
ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కరుణాకర్ సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అభివృద్ధి నిధులను కేంద్రం రద్దు చేసినందుకు నిరసనగా ఈ నెల 28న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని తలపెట్టామని తెలంగాణ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బోళ్ల కరుణాకర్ పేర్కొన్నారు.రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం గురువారం హోటల్ సరోవర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. యూపీఏ హయాంలో 13వ ఆర్థిక సంఘం నుంచి ఎంపీటీసీలకు 25శాతం అభివృద్ధి నిధులు కేటాయించగా, ఈ విధానాన్ని రద్దు చేసిన ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం గత రెండేళ్లుగా 14వ ఆర్థిక సంఘం నుంచి స్థానిక సంస్థలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చిన బీఆర్జీఎఫ్ గ్రాంట్‌ను కూడా ఎన్డీఏ రాష్ట్రానికి నిలిపివేసిందన్నారు. గ్రామాభివృద్ధి పట్ల కేంద్రం నిర్లక్ష్యవైఖరి కారణంగా పల్లెల్లో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయన్నారు. సుమారు 2వేలమంది ఎంపీటీసీలతో జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించి నిరసనను కేంద్రానికి తెలియజేయడమే ‘చలో ఢిల్లీ’ ప్రధాన ఉద్దేశమన్నారు. సమస్యల పరిష్కారానికి తలపెట్టిన కార్యక్రమానికి అన్ని జిల్లాల ఎంపీటీసీలు తరలి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సూరారం యాదగరి, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
ఆత్మగౌరవం కోసమే ‘ఎమ్మెల్సీ’ బరిలోకి
సాక్షి, హైదరాబాద్: నిధుల్లేక, విధుల్లేక, ప్రభుత్వ పథకాల అమలులో చోటు దక్కక ఎంపీటీసీలు ఏడాదిన్నరగా ఎన్నో అవమానాలకు గురవుతున్నారని, అందుకే ఎంపీటీసీల ఆత్మగౌరవం కోసం స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగుతున్నామని ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోళ్ల కరుణాకర్ స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో 12 స్థానాలకు ఫోరం తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. అనంతరం అధ్యక్షుడు కరుణాకర్ విలేకరులతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులుగా టీచర్లను, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లనే నిలుపుతున్న అధికార, విపక్ష పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలకు ఎందుకు అవకాశం కల్పించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. ఓటర్లలో 80 శాతం ఉన్న ఎంపీటీసీల తరపున ఎమ్మెల్సీ ఉంటేనే.. తమ సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించేందుకు వీలుకలుగుతుందని భావిస్తున్నామన్నారు. ఎంపీటీసీలనే తమ అభ్యర్థులుగా రాజకీయ పార్టీలు ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్సీ బరిలో ఇతరులను అభ్యర్థులుగా ప్రకటిస్తే ఓడించాలని ఆయన ఎంపీటీసీలకు పిలుపునిచ్చారు. మద్దతుగా నిలవండి ఏడాదిన్నరగా ఎంపీటీసీలు అవమానాలకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని, కనీసం గ్రామజ్యోతిలోనూ ఎంపీటీసీలకు సముచిత స్థానం కల్పించలేదని ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధుల కోటాలో ఎంపీటీసీలే ఎమ్మెల్సీలు కావాలనే ఉద్దేశంతో ఫోరం తరఫున అన్ని స్థానాలకూ అభ్యర్థులను నిలుపుతున్నామన్నారు. ఎంపీటీసీల ఫోరం తీసుకున్న చారిత్రక నిర్ణయానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6,441 మంది ఎంపీటీసీలు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర నాయకులు మనోహర్‌రెడ్డి, గోవర్ధన్‌రావు, పార్వతమ్మ, మహబూబ్‌రెడ్డి, వివిధ జిల్లాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
మేము సైతం!
మండలి బరిలోకి దిగిన ఎంపీటీల ఫోరం అభ్యర్థులు కొత్త అశోక్‌గౌడ్, సునీత పేర్లు ఖరారు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: శాసనమండలి పోరులో సొంత అభ్యర్థులను బరిలో దించాలని మండల ప్రాదేశిక సభ్యుల(ఎంపీటీసీ) ఫోరం నిర్ణయించింది. పార్టీలకతీతంగా స్థానిక సంస్థల ప్రతినిధులను పోటీ చేయించాలని నిర్ణయించిన ఫోరం.. రంగారెడ్డి జిల్లా నుంచి రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కొంగరకలాన్ ఎంపీటీసీ, ఇబ్రహీంపట్నం వైస్ ఎంపీపీ కొత్త అశోక్‌గౌడ్, గాగిల్లాపూర్ ఎంపీటీసీ సునీతా సంజీవరెడ్డిని అభ్యర్థులుగా రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం ప్రకటించింది. స్థానిక సంస్థల కోటాలో జరిగే కౌన్సిల్ స్థానాలకు ‘స్థానిక’ ప్రతినిధులకు కేటాయించ కుండా.. ఇతరులకు టికె ట్లివ్వడంపై తీవ్ర అభ్యంతరం చేసిన ఫోరం.. సొంత అభ్యర్థులను బరిలో దించాలని నిర్ణయించింది. ఆత్మప్రభోదానుసారం ఓటు హక్కు వినియోగించుకోవాలనే నినాదంతో సభ్యులవద్దకు వెళ్తున్నట్టు అశోక్‌గౌడ్ ‘సాక్షి’కి తెలిపారు. అధికారాలు, విధులపై మండలిలో వాణిపించేందుకు స్థానిక సంస్థల ప్రతినిధులుగా అవకాశం ఇవ్వాలని కోరనున్నట్లు చెప్పారు. ఇదిలావుండగా, మండలి స్థానాలకు జరిగే ఓటింగ్ విధానంపై ఎంపీటీసీ సంఘం సభ్యులు రిటర్నింగ్ అధికారి కాట ఆమ్రపాలితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే పలు సందేహాలను నివృత్తిచేసుకున్న సభ్యులకు ఓటింగ్ విధానంపై స్పష్టత రాలేదు. రెండు స్థానాలకు ఒకే బ్యాలెట్ ఉంటుందా? ప్రాధాన్య క్రమంలో ఓటింగ్ నిర్వహిస్తారా అనే అంశంపై రిటర్నింగ్ అధికారి నుంచి తగిన సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో త్వరలోనే దీనిపై స్పష్టమైన వివరణ ఇస్తామని చెప్పినట్లు ఎంపీటీసీ ఫోరం నాయకులు తెలిపారు.