సాక్షి, హైదరాబాద్: నిధుల్లేక, విధుల్లేక, ప్రభుత్వ పథకాల అమలులో చోటు దక్కక ఎంపీటీసీలు ఏడాదిన్నరగా ఎన్నో అవమానాలకు గురవుతున్నారని, అందుకే ఎంపీటీసీల ఆత్మగౌరవం కోసం స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగుతున్నామని ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోళ్ల కరుణాకర్ స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో 12 స్థానాలకు ఫోరం తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. అనంతరం అధ్యక్షుడు కరుణాకర్ విలేకరులతో మాట్లాడుతూ..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులుగా టీచర్లను, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లనే నిలుపుతున్న అధికార, విపక్ష పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలకు ఎందుకు అవకాశం కల్పించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. ఓటర్లలో 80 శాతం ఉన్న ఎంపీటీసీల తరపున ఎమ్మెల్సీ ఉంటేనే.. తమ సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించేందుకు వీలుకలుగుతుందని భావిస్తున్నామన్నారు.
ఎంపీటీసీలనే తమ అభ్యర్థులుగా రాజకీయ పార్టీలు ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్సీ బరిలో ఇతరులను అభ్యర్థులుగా ప్రకటిస్తే ఓడించాలని ఆయన ఎంపీటీసీలకు పిలుపునిచ్చారు.
మద్దతుగా నిలవండి
ఏడాదిన్నరగా ఎంపీటీసీలు అవమానాలకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని, కనీసం గ్రామజ్యోతిలోనూ ఎంపీటీసీలకు సముచిత స్థానం కల్పించలేదని ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధుల కోటాలో ఎంపీటీసీలే ఎమ్మెల్సీలు కావాలనే ఉద్దేశంతో ఫోరం తరఫున అన్ని స్థానాలకూ అభ్యర్థులను నిలుపుతున్నామన్నారు.
ఎంపీటీసీల ఫోరం తీసుకున్న చారిత్రక నిర్ణయానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6,441 మంది ఎంపీటీసీలు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర నాయకులు మనోహర్‌రెడ్డి, గోవర్ధన్‌రావు, పార్వతమ్మ, మహబూబ్‌రెడ్డి, వివిధ జిల్లాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
ఆత్మగౌరవం కోసమే ‘ఎమ్మెల్సీ’ బరిలోకి
Published Fri, Dec 4 2015 1:50 AM | Last Updated on Sun, Sep 3 2017 1:26 PM
Advertisement
Advertisement