హైదరాబాద్:దుబాయ్ లో ఉద్యోగాల పేరుతో మోసపోయిన తాము తిరిగి హైదరాబాద్ కు వస్తామనుకోలేదని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగాలు ఆశచూపి ఓ బ్రోకర్ దుబాయ్ షేక్ లకు అమ్మేశాడని ఆ మహిళలు తెలిపారు. నగరానికి చేరుకున్నఆ ఇద్దరు మహిళలు అక్కడ మానసికంగా చాలా చిత్రహింసలకు గురైనట్లు స్పష్టం చేశారు. కనీసం తమను నమాజ్ చేసుకోవడానికి కూడా అనుమతించేవారు కాదని తెలిపారు. ఆ షేక్ ల వలలో చిక్కుకున్న తాము మళ్లీ ఇక్కడకు వస్తామనుకోలేదన్నారు. తమను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేశారని వారు మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు.
పోలీసుల ఒత్తిడి కారణంగా గత్యంతరం లేని పరిస్థితుల్లో దుబాయ్ షేక్ లు ఆ బాధిత మహిళల్ని విడిచిపెట్టడంతో ఈ కేసు ఓ కొలిక్కి వచ్చింది. ప్రస్తుతం నిందితుడున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విషయంలో అవసరమైతే సీఐడీతో దర్యాప్తు చేపడతామని వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు.