సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లో ‘+92’ ఫోన్ కాల్స్ బెడద మళ్లీ మొదలైంది. నాలుగేళ్ల క్రితం వరకు రెచ్చిపోయిన ఈ సైబర్ నేరగాళ్లు ఆపై సద్దుమణిగారు. తాజాగా గోల్కొండ ప్రాంతానికి చెందిన మహిళకు రూ. 2.25 లక్షల టోకరా వేశారు. బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో మంగళవారం కేసు నమోదైంది. పాకిస్థాన్ కేంద్రంగా సాగుతున్నట్లు అనుమానిస్తున్న ఈ హైటెక్ వ్యవహారంలో అక్కడి వారు దుబాయ్‌తో పాటు భారత్‌లోనూ ముఠా సభ్యులను ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మొదటి అంచెలో భారత్ నుంచి వెళ్లి లేదా భారత్‌లో బంధువులు కలిగిన దుబాయ్‌లో ఉంటున్న వారు ఉంటున్నారు. వీరి ద్వారా ఇక్కడ ఉన్న వారి బంధువులను సంప్రదించి లోకల్ ముఠాలను ఏర్పాటు చేస్తున్నారు.
దుబాయ్‌లో ఉన్న వారు ప్రాథమికంగా భారత్‌కు చెందిన మధ్య తరగతి, దిగువ మధ్య తరగతుల వారి ఫోన్ నెంబర్లు సేకరించాల్సి ఉంటుంది. ఈ వివరాలను పాకిస్థాన్‌లో ఉన్న వారికి అందించడంతో పాటు భారత్‌లో ఉన్న మాడ్యుల్స్ ద్వారా బోగస్ వివరాలతో వీలైనన్ని బ్యాంకు ఖాతాలు తెరిపించి ఏటీఎం కార్డులు తీసుకునేలా చేస్తోంది. ఆ ఖాతాల నెంబర్లను పాకిస్థాన్‌కు పంపాల్సి ఉంటుంది. దుబాయ్‌లో ఉంటున్న వారి నుంచి సేకరించిన ఫోన్ నెంబర్ల ఆధారంగా పాకిస్థాన్‌లోని ముఠా అసలు వ్యవహారం ప్రారంభిస్తుంది. అక్కడి సిమ్‌కార్డులను వినిÄయోగించి భారత్‌లో ఉన్న వారిలో రోజుకు 100 నుంచి 150 మందిని సంప్రదిస్తుంది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ కోడ్ 0092 కావడంతో ఈ కాల్స్ అన్నీ ‘+92’ నెంబర్ డిస్‌ప్లే అవుతూ వస్తాయి. వీరు హిందీ, ఉర్దూలో మాట్లాడే వారిని టార్గెట్‌గా చేసుకుంటున్నారు.
కౌన్ బనేగా కరోడ్‌పతీ (కేబీసీ) నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెబుతూ మీ నెంబర్‌కు లాటరీ తగిలిందంటూ ఎర వేస్తారు. ఇదే తరహాలో గోల్కొండ ప్రాంతానికి చెందిన సిద్ధిఖ్ బేగంను సంప్రదించిన నేరగాళ్లు కేబీసీలో రూ. 35 లక్షల లాటరీ వచ్చిందని చెప్పారు. ఆ డబ్బు తీసుకోవడానికి సంప్రదించాల్సిందిగా కోరుతూ ఓ నెంబర్ ఇచ్చాడు. ఈ మహిళ సదరు నెంబర్‌కు ఫోన్ చేయగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిగా చెప్పుకున్న విజయ్‌కుమార్ అనే వ్యక్తి వివిధ రకాలైన పన్నులు, క్లియరెన్స్‌ల పేరుతో రూ.2.25 లక్షలు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు ‘+92’ నెంబర్లకు తిరిగి ఫోన్ చేయగా అవి పని చేయట్లేదని తెలుసుకున్నారు. దీంతో సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment