సాగర్ నిర్వాసితులకు అండగా ఉంటాం
- విపక్షాలవి అర్థం లేని ఆరోపణలు: హరీశ్‌రావు
- భూసేకరణ చట్టం అమలు చేస్తే ఎకరాకు వచ్చేది రూ.1.8 లక్షలే..
- రాష్ట్రం రూ.5.8 లక్షలు ఇస్తోంది
- ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రత్యేకంగా రూ.5.4 లక్షలు ఇస్తోంది
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్వాసితులకు అండగా ఉంటామని.. రాష్ట్ర ప్రభుత్వం ముమ్మాటికీ రైతుల పక్షపాతి అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కానీ విపక్షాలు అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని, రైతుల పొట్ట కొట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ప్రభుత్వ పథకాల అమలుకో, ప్రాజెక్టుల నిర్మాణానికో భూసేకరణ జరిపితే... నిర్వాసితులకు అండగా ఉండాలన్నదే మా ప్రభుత్వ మూల సూత్రం. మల్లన్నసాగర్ విషయంలోనూ ఇదే పంథాను కొనసాగిస్తాం.. కానీ దీనిపై విపక్షాలు వితండవాదం చేస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఏనాడూ వారిని పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం మొసలి కన్నీరు కారుస్తోంది. పేద రైతుల పొట్ట కొట్టాలని ఎందుకు చూస్తున్నారో అర్థం కావడం లేదు..’’ అని ప్రకటనలో పేర్కొన్నారు.
మల్లన్నసాగర్ నిర్మాణంలో నష్టపోతున్న ఏటిగడ్డ కిష్టాపూర్ రైతులకు 2013 భూసేకరణ చట్ట పరిధికి మించి మరీ న ష్ట పరిహారం అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. అక్కడి భూముల రిజిస్ట్రేషన్ విలువ ఎకరానికి మెట్టభూములకు రూ.50వేలు, తరి భూములకు రూ.60వేలుగా ఉందని.. భూసేకరణ చట్టం ప్రకారం దానికి మూడు రెట్లు పరిహారం చెల్లిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. అంటే రైతులకు రూ.1.5 లక్షల నుంచి రూ.1.8 లక్షల వరకు మాత్రమే వస్తుందని... కానీ ప్రభుత్వం నిర్వాసితుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ఎకరాకు రూ.5.8 లక్షలు పరిహారంగా చెల్లిస్తోందని తెలిపారు. ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రత్యేకంగా రూ.5.4 లక్షలు అందజేస్తోందని వెల్లడించారు.
ప్రజల్ని రెచ్చగొడుతున్నారు..
నిర్వాసితుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నా కుహానా మేధావులు, కాంగ్రెస్, టీడీపీ నాయకులు మిడిమిడి జ్ఞానంతో ప్రజలను రెచ్చగొడుతున్నారని... ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. చట్టప్రకారం భూములు స్వాధీనం చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉన్నా ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.