
'సింగపూర్ తరహాలోనే అభివృద్ధి'
సింగపూర్:తక్కువ కాలంలోనే సింగపూర్ అభివృద్ధి చెందిందని, అదే తరహాలో తెలంగాణను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళతామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఐఐఎం సదస్సులో పాల్గొన్న కేసీఆర్.. సింగపూర్ లా అభివృద్ధి చెందే సత్తా తెలంగాణకు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నూతన పారిశ్రామిక విధానం ద్వారా దేశీయ, విదేశీయ కంపెనీల పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతామని కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.
అవినీతి, ఇబ్బందుల్లేని పారిశ్రామిక విధానం అందిస్తామని, హైదరాబాద్ చుట్టుపక్కల పారిశ్రామికరంగ అభివృద్ధికి..అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. పరిశ్రమలకు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రోత్సాహకాలు తెలంగాణ ప్రభుత్వం అందించనుందన్నారు.మెడికల్, ఫార్మా, టూరిజం, ఆటోమొబైల్, ఐటీ రంగాల్లో పెట్టుబడులకు ప్రత్యేక జోన్ల అభివృద్ధి దిశగా హైదరాబాద్ ను ముందుకు తీసుకువెళతామన్నారు. హైదరాబాద్ నగరాన్ని డిజిటల్ సిటీగా మార్చాలన్నదే తన కల అని కేసీఆర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఐఎం పూర్వవిద్యార్థులు తెలంగాణ వైపు చూడాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. బ్రాండ్ తెలంగాణ, బ్రాండ్ హైదరాబాద్‌లను విశ్వవ్యాప్తం చేసేందుకే తన ప్రయత్నమన్నారు.