
మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ జర్నలిస్టులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు. నెల రోజుల్లోనే తెలంగాణ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి గుర్తింపు ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ప్రెస్ మీట్‌లో మాట్లాడిన కేసీఆర్ ఈ ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్)ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలోనే టీబీజీకేఎస్ పుట్టిందని గుర్తు చేశారు. జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ చాన్నాళ్లు గుర్తింపు సంఘాలుగా ఉన్నాయని, వాటి వల్లే వారసత్వ ఉద్యోగాలు పోయాయని ఆరోపించారు. వారసత్వ ఉద్యోగాలు వదులుకుంటున్నట్లు సంతకాలు చేసింది ఆ సంఘాలేనన్నారు. గత ప్రభుత్వాలు సింగరేణి కార్మికుల సమస్యలను, సింగరేణిని అర్ధం చేసుకోలేకపోయాయని చెప్పారు. కార్మికుల అనారోగ్య సమస్యల గురించి అర్ధం చేసుకోలేదని, తాము మాత్రం ఇక నుంచి కార్మికుల తల్లిదండ్రులకు కూడా కార్పొరేట్ వైద్యం అందిస్తామన్నారు.