తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై వ్యూహాత్మక దాడి చేసినట్లు అనిపిస్తుంది. ఆయన ప్రభుత్వంలో జరిగిన కొన్ని అవకతవకల అభియోగాలపై రెండు విచారణ సంఘాలు పనిచేస్తున్నాయి. ఆ రెండిటికి రిటైర్డ్ న్యాయమూర్తులు అధ్యక్షత వహిస్తున్నారు. ఒకటి విద్యుత్ కొనుగోళ్లు, కొత్త పవర్ ప్లాంట్ల నిర్మాణంలో నిధుల దుర్వినియోగం,మరొకటి కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జరుగుతున్న విచారణలు. ఏ నేతకు అయినా తొమ్మిదినర్రేళ్ల తర్వాత ఇలాంటి విచారణలు ఎదుర్కోవలసి రావడం దురదృష్టకరం.
అధికారంలో ఉన్నప్పుడు ఏమీ కాదులే అన్న నిర్లక్ష ధోరణి కావచ్చు..కొత్తగా అధికారంలోకి వచ్చిన వారు ఎలాగైనా గత ప్రభుత్వ పెద్దలను ఇరుకున పెట్టాలన్న భావన కావచ్చు. ఆయా సందర్భాలలో ఇలా విచారణ కమిషన్ లను నియమిస్తుంటారు. దేశంలో పలు రాష్ట్రాలలో ఇలాంటి విచారణలు జరుగుతుంటాయి. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని సందర్భాలలో కమిషన్ లను నియమించి విచారణకు ఆదేశిస్తుంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రెండుపాయింట్లలో కేసీఆర్ బుక్ అవుతారని భావించి ఉండవచ్చు. బీఆర్ఎస్‌ను బలహీనపరచడానికి ఇది ఒక అవకాశంగా అనుకుని ఉండవచ్చు.ఏది ఏమైనా ఆయన అధికారంలో ఉన్నారు కనుక కేసీఆర్ కు ఈ పరిణామం సహజంగానే ఇబ్బంది కలిగిస్తుంది.
విశేషం ఏమిటంటే.. విద్యుత్ విషయంలోకాని, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కాని ఆ రోజుల్లో కేసీఆర్ కు విశేషమైన పేరు వచ్చింది. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ కొరత ఉండేది. కేసీఆర్ తగు రకాల చొరవ తీసుకుని విద్యుత్ సమస్యను తీర్చారు. దాదాపు కరెంట్ కోతలు లేకుండా చేయడం ద్వారా ప్రజల మన్ననలు పొందగలిగారు. కాకపోతే అప్పట్లోనే కేసీఆర్ అనవసరంగా అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉండేవి. కాని ప్రజలకు అందిన సదుపాయం రీత్యా దానిని ఎవరూ పట్టించుకోలేదు. అదే టైమ్ లో కొత్తగా భద్రాద్రి,యాద్రాద్రి పేర్లతో ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి పూనుకున్నారు. దీనిని కూడా పలువురు అబినందించారు.
అలాగే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడమే కాకుండా,వేగంగా పూర్తి చేయించిన తీరు అందరిని ఆబ్బురపరచింది. కొంతమంది సాంకేతిక నిపుణులు కాళేశ్వరం ప్రాంతం కొత్త ప్రాజెక్టుకు ఎంత అనువైనది అన్న అనుమానం వ్యక్తం చేయక పోలేదు. అయినప్పటికీ తెలంగాణలో తనదైన ముద్ర వేసుకుని, సాగు నీటి సమస్య తీర్చాలన్న కీర్తి కాంక్షతో ఆ స్కీమును ముందుకు తీసుకువెళ్లారు. ఆ ఎత్తిపోతల పధకం నిర్వహణకు బాగా వ్యయం అవుతుందని అంచనా వేసినా, రైతులకు అందే ప్రయోజనం కంటే అదేమీ ఎక్కువ కాదని వాదించేవారు. దురదృష్టవశాత్తు అక్కడ నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. అది కూడా సరిగ్గా శాసనసభ ఎన్నికలకు కొద్దినెలల ముందు జరగడంతో కేసీఆర్ కు చికాకు తెచ్చిపెట్టింది. దానిపై కాంగ్రెస్, బీజేపీల తీవ్రమైన విమర్శలు కురిపించేవి. ఎన్నికలలో ఓటమితో అవన్ని కేసీఆర్ కు పెద్ద తలనొప్పిగా మారాయి.
కేసీఆర్ తిరిగి గెలిచి ఉంటే.. ఏదో కిందా,మీద పడి దానిని హాండిల్ చేసి ఉండేవారు. కాంగ్రెస్ గెలవడంతో కేసీఆర్ ను ఇరుకున పెట్టడానికి ఒక ఆయుధం దొరికినట్లయింది. విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టులు వేల కోట్ల వ్యయంతో కూడినవి కావడంతో ప్రజలలో ఒకరకమైన అలజడికి ఆస్కారం ఏర్పడింది.దానిని రేవంత్ ప్రభుత్వం రాజకీయంగా వాడుకోవడానికి సహజంగానే యత్నిస్తుంది. అందులో భాగంగా రెండు కమిషన్ లను నియమించింది. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై ఏర్పడిన కమిషన్ కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఆయా అంశాలను పరిశీలించిన మీదట మీడియాతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలను చేశారు. వాటిని ఆసరా చేసుకుని కేసీఆర్ దాడి చేశారు. ఈ విషయంలో కేసీఆర్ వివరణను కమిషన్ కోరగా, జస్టిస్ తీరును తప్పుపడుతూ కేసీఆర్ ఏకంగా పన్నెండు పేజీల లేఖ రాశారు.
కమిషన్ ముందస్తుగానే ఒక అబిప్రాయానికి వచ్చి పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావం, కరెంటు కొరత తదితర అంశాలను ప్రస్తావిస్తూనే ఆయన తన అభ్యంతరాన్ని,నిరసనను తెలియచేశారు.తద్వారా కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీసే యత్నం చేశారని చెప్పవచ్చు. బహుశా ఈ పరిణామాన్ని కమిషన్ జస్టిస్ ఊహించి ఉండకపోవచ్చు.దీని తర్వాత కాళేశ్వరం కమిషన్ ఇచ్చే నోటీసుకు కేసీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇక్కడ కొన్ని సంగతులు ప్రస్తావించాలి. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై 1977 లో అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ప్రభుత్వం జె సి షా అనే . జడ్జి నాయకత్వంలో ఒక కమిషన్ ను వేసింది. ఎమర్జెన్సీ లో జరిగిన అకృత్యాలపై ఈ కమిషన్ విచారణ జరిపింది. కమిషన్ అంతిమంగా ఇందిరాగాంధీని తప్పు పట్టినా, దానివల్ల ఆమెకు పెద్దగా నష్టం జరగలేదు.పైగా రాజకీయంగా బాగా వాడుకోగలిగారు.
షా కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఇందిరా గాంధీ, సంజయ్ గాందీ, ప్రణబ్ ముఖర్జీలు విచారణ కమిషన్ ఎదుట హాజరయ్యారు కాని ప్రమాణం చేసి తమ వాదన వినిపించడానికి సిద్దపడలేదు. ఈ కమిషన్ విచారణ చేస్తున్నదా?లేక పరిశోధన చేస్తున్నదా అన్న సంశయాన్ని వ్యక్తం చేస్తూ వారు కమిషన్ కు తమ వివరణ ఇవ్వలేదు. ఇందిరాగాంధీ నాలుగుసార్లు కమిషన్ ఎదుట హాజరైనా అలాగే చేశారు. అప్పటికే జనత ప్రభుత్వంపై ప్రజలలో కొంత వ్యతిరేకత రావడం,ఆమెను అరెస్టు చేయడం,కోర్టు వదలిపెట్టడం వంటి పరిణామాలు, మధ్యలో ఒక రోజు ఆమె ఆగ్రా పర్యటనకు వెళ్లినప్పుడు అశేష ప్రజానీకం హాజరవడం వంటి పరిణామాలు మొత్తం రాజకీయాలను మార్చివేశాయి.
ఈలోగా మొరార్జీ ప్రభుత్వాన్ని చరణ్ సింగ్ పడగొట్టి ఇందిర సాయంతోనే ప్రధాని కావడం,ఆ తర్వాత ఆ ప్రభుత్వం పడిపోయి ఎన్నికలు వచ్చి తిరిగి ఆమె ప్రభుత్వపగ్గాలు అందుకున్నారు. దాంతో షా విచారణ కమిషన్ నివేదిక వల్ల ఆమెకు వ్యక్తిగతంగా కొంత చికాకు ఏర్పడింది తప్ప ,రాజకీయంగా నష్టం జరగలేదు. పైగా లాభం చేకూరింది. ప్రజలలో ఇందిరాగాంధీని వేధిస్తున్నారన్న భావన బలపడింది. ఎమర్జెన్సీని పెట్టకపోతే దేశం విదేశీ శక్తుల హస్తగతం అయ్యేదన్న వాదనను ఆమె ప్రచారం చేశారు.ఆ రకంగా షా కమిషన్ నివేదిక చరిత్ర పుటలకే పరిమితం అయ్యిందని చెప్పవచ్చు. ఉమ్మడి ఎపిలో కూడా కొన్ని విచారణ సంఘాలు మాజీ న్యాయమూర్తుల ఆద్వర్యంలో గతంలో కూడా పనిచేశాయి. ఉదాహరణకు జనతా ప్రభుత్వం 1978 లో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కు సంబంధించి ఒక కమిషన్ ను నియమించింది.
వెంగళరావు టైమ్ లో నక్సల్స్ పై జరిగిన ఎన్ కౌంటర్లకు సంబంధించి కేంద్రం జస్టిస్ విమద్ లాల్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ ను నియమించింది.కొంతకాలం విచారణ జరిగినా, ఆ తర్వాత కేంద్రంలో ప్రభుత్వమే మారిపోవడంతో ప్రాధాన్యత తగ్గిపోయింది. ఈ కమిషన్ వల్ల జలగం పెద్ద ఇబ్బంది పడలేదు.కొన్నిసార్లు ఆయా ప్రభుత్వాలు తమపై వచ్చే ఆరోపణల నిగ్గు తేల్చడానికి కమిషన్ లను ఏర్పాటు చేస్తుంటాయి. ఉదాహరణకు కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్తగా మంజూరు చేసిన డిస్టిలరీలు, బ్రూవరీల వ్యవహారంపై టిడిపి చేసిన ఆరోపణలకు సంబందించి విచారణ సంఘాన్ని నియమించారు.దాంతో అప్పట్లో మంత్రిగా ఉన్న కనుమూరు బాపిరాజుతన పదవికి రాజీనామా చేశారు. ఆ విచారణ సంఘం కూడా పెద్దగా కనిపెట్టింది లేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చలనచిత్రాభివృద్ది సంస్థలో జరిగిన అక్రమాలపై ఒక కమిషన్ ను నియమించారు.దాని విచారణకు మాజీ ముఖ్యమంత్రి కోట్ల కూడా హాజరుకావల్సి వచ్చింది.
పాతబస్తీలో జరిగిన అల్లర్లపై ఒక విచారణ సంఘం పనిచేసింది. ఇది కూడా ఎవరిపైనా నిర్దిష్ట అబియోగాన్ని రుజువు చేయలేదు. కాకపోతే కొన్ని సూచనలు చేసింది. ఈ కమిషన్ వల్ల ఎవరికి ఇబ్బంది రాలేదు. అలాగే చంద్రబాబు ఉమ్మడి ఎపి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని కమిషన్ లు వేశారు.ఏలేరు భూ పరిహార స్కామ్ పై ఆయన కమిషన్ ను నియమించారు. ఆ కమిషన్ నివేదిక ఇచ్చేలోగా ఆయన ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. విచిత్రంగా ఆ కమిషన్ కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీనే కోర్టులో ఒక పిటిషన్ వేసింది. విభజిత ఏపీలో గోదావరి పుష్కరాల తొక్కిసలాటకు సంబందించి ఒక రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించారు . దాని ద్వారా ఏ ఒక్కరిపై చర్య తీసుకునే పరిస్థితి రాకపోవడం ఆసక్తికరమైన అంశం.కొన్నిసార్లు ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా ఈ విచారణ సంఘాలను నియమిస్తుంటాయి. ఆ సందర్భాలలో తమకు ఇబ్బంది పెట్టనివారినే వెతికి నియమించుకుంటారన్న అభిప్రాయం ప్రజలలో ఉంది.
అదే టైమ్ లో వర్తమాన ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలపై విచారణలకు ఆదేశాలు ఇచ్చినప్పుడు అవి కాస్త సీరియస్ గానే ఉంటాయి. ఈ క్రమంలో జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ఎలాంటి సిఫారస్ లు చేస్తుంది.దానిని రేవంత్ ప్రభుత్వం ఏ విధంగా ఆమోదించి తదుపరి చర్య తీసుకుంటుంది అనేది ఆసక్తికర అంశం అవుతుంది. తాను చత్తీస్గడ్ ప్రభుత్వం నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తే అందులో అవినీతి ఏమిటన్నది కేసీఆర్ ప్రశ్న. అలాగే భద్రాద్రి,యాదాద్రి లకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బీహెచ్ఈఎల్ నిర్మాణ కాంట్రాక్టు అప్పగిస్తే దానిలో అక్రమాలు ఎలా ఉంటాయన్నది ఆయన ప్రశ్న.
ఈ ప్రాజెక్టులు ఆలస్యం అవడంపై కమిషన్ విచారణ చేసినా ఎంతవరకు ప్రయోజనం ఉంటుందన్నది చర్చనీయాంశం. మన దేశంలో 99 శాతం ప్రాజెక్టులు ఏవీ నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తి కావన్నది వాస్తవం. దాని వల్ల వ్యయం పెరిగే మాట నిజం. కేంద్ర ప్రభుత్వ అనుమతులలో జాప్యం, కరోనా సంక్షోభం వంటివాటివల్ల పవర్ ప్లాంట్ లు జాప్యం అయితే తామేమీ చేయగలమని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటివాటిపై కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందన్నది చూడాలి. గతంలో ఇందిరాగాంధీ మాదిరి కేసీఆర్ కూడా ఈ విచారణ కమిషన్ లను తనకు రాజకీయంగా ఎంత అడ్వాంటేజ్ గా మార్చుకుంటారో వేచి చూడాల్సిందే.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment