తెలంగాణలో పరిస్థితిని గమనిస్తున్నాం
హైదరాబాద్ : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నరేంద్ర మోడీ సర్కార్ ముందుకు వెళుతోందని కేంద్ర సమాచార, ప్రసార, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఆయన గురువారం బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశానికి మంచి రోజులు రానున్నాయని, వందరోజుల మోడీ పాలనపై ప్రజలకు నమ్మకం కలిగిందన్నారు. మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పధంలో నడుస్తోందన్నారు.పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్నారన్నారు. విదేశీ కంపెనీలు సైతం భారత్ వైపు చూస్తున్నాయని జవదేకర్ పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా అన్ని సేవలు సులభతరం చేస్తున్నామని తెలిపారు.
అవినీతి రహిత పాలన అందిస్తామన్న నమ్మకం ప్రజల్లో కలిగిందన్నారు. అభివృద్ధి కోసమే ప్రజలు మోడీకి ఓటు వేశారని జవదేకర్ అన్నారు. పర్యావరణ శాఖలో ఏళ్ల తరబడి ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పర్యావరణ అనుమతులు ఇవ్వటమే గత ప్రభుత్వం మానేసిందని తెలిపారు. త్వరలోనే పెండింగ్లో ఉన్న ఫైళ్లను క్లియర్ చేస్తామన్నారు. అభివృద్ధి, పర్యావరణం, రక్షణ తమకు ముఖ్యమన్నారు.
తెలంగాణలో పరిస్థితిని గమనించామని, ఛానెల్స్ ప్రసారాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామన్నారు. మీడియా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటిదన్నారు. మరోవైపు ఏబీఎన్, టీవీ9 సిబ్బంది ఈరోజు ఉదయం జవదేకర్ను కలిశారు. ఛానల్స్ ప్రసారాల పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.
రెండు ఛానల్స్ తెరిపించాలంటూ ఐజేయూ తరపున దేవులపల్లి అమర్ వినతిపత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన జవదేకర్ ఛానళ్ల ప్రసారాల నిలిపివేతపై..రెండురోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక కేబుల్ ఆపరేటర్లు కూడా జవదేకర్ను కలిశారు. ట్రాయ్లో తమకు విరుద్ధంగా ఉన్న నిబంధనలు సడలించే అంశాలను పరిశీలించాలని వారు విజ్ఞప్తి చేశారు.