సాక్షి, ఖమ్మం : నాలుగున్నరేళ్ల పాలనలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్నింటిలోనూ అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్‌నేత, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి ఆరోపించారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలనే కూటమిగా ఏర్పడినట్లు ఆమె తెలిపారు. శనివారం ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పదికి పది స్థానాలను సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కారు పార్టీ బేకారు పార్టీ అని ఆమె ఎద్దేవా చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను ఘోరంగా మోసం చేసిందని ఆమె మండిపడ్డారు.
గ్రామాల్లో విద్యార్థులు డబుల్ పీజీలు చేసి నిరుద్యోగులుగా మిగిలిపోయారని ఆమె అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో నరే్ంద్ర మోదీలు వట్టి మాటాలు చెప్తూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. మహాకూటమి కేవలం రాష్ట్రంలోనే కాక.. కేంద్రలోనూ కూడా ప్రభుత్వాలు ఏర్పడే వరకే కొనసాగుతుందని వెల్లడించారు. మహాకూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖమ్మంలో పర్యటిస్తారని రేణుకా ప్రకటించారు. ఈ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారని ఆమె తెలిపారు.
తమ విజయాన్ని కాంక్షిస్తూ తమకు పూర్తిగా సహకరిస్తున్న రేణుకా చౌదరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఖమ్మం ప్రజాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు తెలిపారు. నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం చేసింది శూన్యమని .. రానున్న ఎన్నికల్లో ప్రజాకూటమిదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయం ఇక్కడిదో ఆగదని.. ఢిల్లీ గడ్డ మీద కూడా కూటమిదే విజయం అని పేర్కొన్నారు.
కాగా ఖమ్మంలో టీఆర్‌ఎస్, టీడీపీ మధ్య పోరు రసవత్తరంగా మారింది. టీఆర్‌ఎస్ నుంచి తాజీ మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పోటీలో ఉండగా.. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మహాకూటమి అభ్యర్థిగా బరిలో నిలిచారు. రాజకీయంగా ఇద్దరూ హేమాహేమీలు కావడంతో పోటీ ఉత్కంఠంగా మారింది. గతంలో శత్రువులుగా మెలిగిన నామా, రేణుక ఇప్పుడు కలిసి ప్రచారంలో చేయడంతో పోటీ ఆసక్తిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment