నేరాల అదుపునకు 24 గంటలు పని చేస్తాం: నాయిని
గోదావరిఖని/పెద్దపల్లి: ప్రశాంతత ఉన్న చోటనే అభివృద్ధి జరుగుతుందని, అందుకే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ప్రశాంత జీవనం సాగించేలా పోలీసు వ్యవస్థను పటిష్టపరుస్తామని, నేరాల అదుపునకు 24 గంటలు పనిచేస్తామని రాష్ట్ర హోంశాఖ, కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా గోదావరిఖని, రామగుండం, ఎన్టీపీసీ, పెద్దపల్లిలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కాంగ్రెస్ నేతలు కె.జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య వారి పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, అవినీతిపై ఆత్మవిమర్శ చేసుకొని, పరనిందలు ఆపాలని మంత్రి నాయిని హితవు పలికారు.
త్వరలోనే మంత్రివర్గ విస్తరణ
మంచిర్యాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గాన్ని త్వరలో విస్తరించే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వృద్ధాశ్రమాన్ని ప్రారంభించేందుకు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మలిదశ ఉద్యమంతోపాటు 1969 నుంచి ఉద్యమంలో పాల్గొన్నవారిపై కేసులు ఎత్తివేస్తామని తెలిపారు. తెలంగాణను 24 జిల్లాలుగా పునర్విభజించడంపై విధాన ఉత్తర్వులు రావడం ఒక్కటే మిగిలి ఉందని ప్రకటిత జిల్లాల్లో మంచిర్యాల ఉంటుందని చెప్పారు.