రాష్ట్రంలో గాడితప్పిన పాలన | planless administration in state | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో గాడితప్పిన పాలన

Published Thu, Sep 29 2016 12:25 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

రాష్ట్రంలో గాడితప్పిన పాలన - Sakshi

రాష్ట్రంలో గాడితప్పిన పాలన

  • బ్యాంకు రుణాలను పట్టించుకోని ప్రభుత్వం
  • డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి
  • వరంగల్‌ : తెలంగాణ రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని.. సమస్యలపై అవగాహన లేని వారు  ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. హన్మకొండలోని విశాల్‌ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అన్ని వర్గాలను సీఎం కేసీఆర్‌ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ మాత్రం చిత్తశుద్ధి చూపించడంలేదని విమర్శించారు. మిడ్‌ మానేరు నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్‌ ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు బ్యాంకు రుణాలు మంజూరు చేయడంలో విఫలమవుతున్నారని తెలిపారు. ఒక్కొక్కరికి రూ.10 లక్షల వరకు రుణం ఇస్తున్నామని, అందులో 80 శాతం ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుందని హామీ ఇవ్వడంతో వేలాది మంది నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. అయితే ఏడాది గడిచినా రుణాలపై అతీగతీ లేదన్నారు. కాంగ్రెస్‌ హయాంలో అమలు చేసిన అభయహస్తం పింఛన్లను తొమ్మిది నెలలుగా ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో పాలనను అస్తవ్యస్తంగా మార్చిన ఘనత టీఆర్‌ఎస్‌ పార్టీకే దక్కుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాకతీయ ఉత్సవాలకు ని«ధులు ఇస్తే.. తెలంగాణ అని చిన్నచూపు చూస్తున్నారని ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌కు ఇప్పుడు ఆ ఉత్సవాలను పట్టించుకోని కేసీఆర్‌ను ప్రశ్నించే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. మహబూబాబాద్‌ నుంచి జనగామ వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చేస్తున్న ఘనకార్యాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎంసెట్‌ నిర్వహణ లోపాలతో ర్యాంకులు పొందిన వారు ఇప్పుడు రాస్తే ఎక్కువ ర్యాంకులు వచ్చి ఏడాది నష్టపోయారన్నారు. ప్రకటనలు చేయడమే తప్పా.. టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజలకు ఒరగపెట్టింది ఏమి లేదన్నారు. దరఖాస్తు చేసుకున్న వారందరికి రుణాలు ఇవ్వకుంటే ఎస్సీ కార్పొరేషన్‌తో పాటు ఇతర కులాల సంక్షేమ కార్యాలయాలను ముట్టడించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, గ్రేటర్‌ వరంగల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, కార్పొరేటర్‌ తొట్ల రాజు, కాంగ్రెస్‌ నేతలు ఈవీ శ్రీనివాసరావు, బత్తిని శ్రీనివాసరావు, రవీందర్, లక్ష్మారెడ్డి, మండల సమ్మయ్య, మనుపాటి శ్రీనివాస్, రజనీకాంత్‌  తదితరులు పాల్గొన్నారు. 
     
     
     
     
     
     
     
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement