ప్రజల ఆకాంక్షలే ప్రణాళికలు | we will work for peoples welfare | Sakshi
Sakshi News home page

ప్రజల ఆకాంక్షలే ప్రణాళికలు

Published Mon, Jul 14 2014 3:59 AM | Last Updated on Sat, Sep 2 2017 10:15 AM

ప్రజల ఆకాంక్షలే ప్రణాళికలు

ప్రజల ఆకాంక్షలే ప్రణాళికలు

సాక్షి ప్రతినిధి, వరంగల్ : గ్రామ ప్రజల ఆశలు, ఆకాంక్షలకనుగుణంగా గ్రామ, మండల, జిల్లా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని  జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ జి.కిషన్ పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా మెరుగైన ప్రణాళిక రూపకల్పనకు ప్రజాప్రతినిధులు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ‘మన ఊరు... మన ప్రణాళిక, మన మండలం... మన ప్రణాళిక, మన జిల్లా... మన ప్రణాళిక’ అంశంపై హన్మకొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం వర్క్‌షాప్ జరిగింది.
 
జిల్లాలోని ప్రజాప్రతినిధులను ప్రణాళిక రూపకల్పనలో భాగస్వాములను చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జి.కిషన్ మాట్లాడుతూ గ్రామ ప్రాధాన్యతలు  ప్రతిబింబించేలా ప్రణాళికలు ఉండాలన్నారు. ప్రతి గ్రామంలో విద్య, ఉపాధి, మౌలిక వసతులు, వనరుల లభ్యత వంటి అన్ని అంశాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. గ్రామ స్థాయిలో నిర్వహించే కార్యక్రమాలకు ఎక్కువ మంది ప్రజలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామసభల్లో కమిటీ నిర్ణయం ప్రకారం పనుల ప్రతిపాదనలు ఉండాలని, అధికారులు కేవలం సహాయకులుగా మాత్రమే ఉంటారని కలెక్టర్ పేర్కొన్నారు.
 
40 లక్షల మొక్కలు..
హరితహారం పేరుతో జిల్లాలో 40 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందుకు అటవీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. అడవుల్లో మామిడి, నేరేడు, వెలగ, రేగు మొక్కలు నాటేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని... రైతులు తమ పంట చేల పక్కన నాటుకునేందుకు మొక్కలు అందజేస్తామని తెలిపారు. నగరంలో పూల మొక్కలు నాటేందుకు ప్రాధాన్యమివ్వన్నుట్లు తెలిపారు. గ్రామాల్లో జాబ్ కార్డు ఉండి సుమారు మూడేళ్లుగా పనిచేస్తున్న వారికి మాత్రమే భూ పంపిణీలో ప్రాధాన్యమివ్వాలన్నారు. దీని కోసం ప్రభుత్వ భూముల గుర్తింపు చేపట్టినట్లు వెల్లడించారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యమివ్వనున్నట్లు వివరించారు. అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల  పద్మ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారుల సహాకారంతో అభివృద్ధి కార్యక్రమాలు విజవంతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.
 
ప్రభుత్వ భవనాలు నిర్మించండి : కొండా సురేఖ
గ్రామాల్లో ప్రణాళికలు తయారు చేసే క్రమంలో అంగన్‌వా డీ, పీహెచ్‌సీ, పీఏసీఎస్, గ్రామ పంచాయతీ, పాఠశాల, వంటగదులకు శాశ్వత భవనాలు నిర్మించడంపై దృష్టి పెట్టాలని  వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ సూ చించారు. ఈ భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలం కేటాయించాలని... వికలాంగులు, ఇతర సంక్షేమ పథకాల అబ్ధిదారుల గుర్తింపు విషయంలో పారదర్శకంగా వ్యవహరించి అర్హులకు న్యాయం చేయాలన్నారు. బోగస్ లబ్ధిదారుల ఏరివేతపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. చెక్‌డ్యాంలు, చెరువుల మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.
 
అభివృద్ధికి బాటలు వేయాలి : దొంతి మాధవరెడ్డి
అభివృద్ధికి సంబంధించి రాష్ట్రంలోనే మన జిల్లా  ముందంజలో ఉందని,మన ఊరు- మన ప్రణాళిక కార్యక్రమం స మగ్రంగా అమలైతే అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధిస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆకాం క్షించారు. లింకురోడ్లు, స్కూల్ భవనాల నిర్మించడంలో శ్రద్ధ చూపాలని కోరారు. ప్రజాప్రతినిధులు కొన్ని అంశాల్లో విభేదించినా, అధికారులు సమన్వయంతో పను లు చేయాలన్నారు. ఈ విషయంపై గ్రామస్థాయి నుంచి రాజకీయ పార్టీల కార్యకర్తలకు అవగాహన కల్పించాలని కోరారు.  
 
 అన్ని రంగాలకు ప్రాధాన్యమివ్వాలి : ఎన్.రాజలింగం
 అన్ని రంగాల్లో ప్రజల అవసరాలను ప్రణాళికల్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ నాగపురి రాజ లింగం కోరారు. చేర్యాల చెరువు శిఖం హద్దులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో డీఆర్సీలో ఈ విషయంపై వివరించినా.. అధికారులు పట్టించుకోలేదన్నారు.
 
 కోతులు రాకుండా చేయాలి : వెంకటేశ్వర్లు
 చాలా గ్రామాల్లో రైతులు, ప్రజలు కోతుల బెడదతో ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్సీ బి.వెంకటేశ్వర్లు తెలి పారు. కొన్ని గ్రామాల్లోని రైతులు, అభివృద్ధి కంటే  కోతులు లేకుండా చేస్తే చాలు అంటున్నారని పేర్కొన్నారు.గంగదేవిపల్లిని స్ఫూర్తిగా తీసుకుని అన్ని గ్రామాలకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
 
 ఎక్కువ మంది డుమ్మా...
 తెలంగాణలో టీఆర్‌ఎస్ నేతృత్వంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం మన ఊరు... మన ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అన్ని రంగాల అభివృద్ధితో బంగారు తెలంగాణ ఏర్పాటుకు ఈ ప్రణాళికలే ముఖ్యమని భావిస్తోంది. జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను ప్రణాళిక రూపకల్పనలో భాగస్వామ్యులను చేయడం ప్రధాన ఉద్దేశంగా కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు హాజరు కాలేదు. ముఖ్యంగా స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం టి.రాజయ్య సహా టీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు జిల్లాలో ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో కొండా సురేఖ ఒక్కరే ఈ సమావేశానికి హాజరయ్యారు. టీఆర్‌ఎస్‌కు చెందిన ఎంపీలే అయినా కడియం శ్రీహరి, ఎ.సీతారాంనాయక్, బి.నర్సయ్యగౌడ్‌లో ఎవరూ హాజరు కాలేదు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు డీఎస్.రెడ్యానాయక్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, చల్లా ధర్మారెడ్డి సదస్సుకు హాజరుకాలేదు. జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, డ్వామా పీడీ వి.వెంకటేశ్వర్లు, వివిధ శాఖల  అధికారులు పాల్గొన్నారు.
 
 మన ఊరు... మన ప్రణాళిక
 నేడు జిల్లావ్యాప్తంగా ప్రారంభం
 హన్మకొండ అర్బన్ : తెలంగాణ సమగ్ర అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన ప్రణాళిక’ కార్యక్రమం సోమవారం మొదలవుతోంది. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య సోమవారం జఫర్‌గఢ్ మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిం చనున్నారు. ఈ నెల 18 వరకు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో 19 నుంచి 23 వరకు, జిల్లా స్థాయిలో 24 నుంచి 28 వరకు ప్రణాళికలు రూపొందించనున్నారు. దీనికి సంబంధించి అధికారు లు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు పూర్తిచేశారు. గ్రామ అభివృద్ధి, అవసరాలు ప్రాతిపదికగా గ్రామస్తుల సూచనలు మేరకు సర్పంచ్, ఎంపీటీసీ, వార్డుమెం బర్లు, వీఆర్వో, గ్రామ కార్యదర్శి, ఇతర శాఖల సిబ్బం దితో కలిసి అభ్యుదయ అధికారి ప్రణాళికలు రూపొం దిస్తారు. ప్రతి ప్రభుత్వ శాఖ గ్రామస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.  
 
 ప్రణాళికలో 14 అంశాలు
 గ్రామ స్థాయి ప్రణాళిక రూపకల్పనలో అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రణాళిక రూపలక్పనకు సంబంధించి ప్రభుత్వం ప్రధానంగా 14 అంశాలను గుర్తించింది. ఈ అంశాలకు ప్రకారం ప్రజల నుంచి వివరాలు సేకరించి ప్రతి గ్రామానికి  ప్రత్యేకంగా నివేదిక తయారు చేస్తారు. పంచాయతీ పరిధిలోని ప్రధాన గ్రామంలోనే కాకుండా అనుబంధంగా ఉండే ఆవాసాల (పల్లె, గూడెం, తండాలు)కు సంబంధించి వివరాలు సేకరిస్తారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సాగునీటి సరఫరా, మహిళా సాధికారత, ఉపాధి, మౌలిక సదుపాయాలు, వనరుల సమీకృత వంటికి ప్రాధాన్యం ఇస్తారు. అన్ని అంశాల్లో సూక్ష్మ స్థాయిలో వివరాలు సేకరించడంతోపాటు అవసరాలను గుర్తిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement