
సాక్షి, హైదరాబాద్: తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తేమ గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో అనేకచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. ఉత్తర భారతం నుంచి చలి గాలులు ఇంకా మొదలు కాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో రామగుండంలో సాధారణం కంటే 5.7 డిగ్రీలు ఎక్కువగా 20.4 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌లో సాధారణం కంటే 5.3 డిగ్రీలు ఎక్కువగా 19.4 డిగ్రీలు, హైదరాబాద్‌లో 4 డిగ్రీలు అధికంగా 19.2 డిగ్రీలు, మెదక్‌లోనూ 4 డిగ్రీలు అధికంగా 17.8 డిగ్రీలు, భద్రాచలంలో 3.1 డిగ్రీలు ఎక్కువగా 20.5 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలావుంటే ఖమ్మంలో పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.1 డిగ్రీలు అధికంగా 31.6 డిగ్రీలు రికార్డయింది. ఆదిలాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రత 19.2 డిగ్రీలు కాగా, పగటి ఉష్ణోగ్రత 33.3 డిగ్రీలుగా నమోదైంది. కాగా, రానున్న మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment