సాక్షి, హైదరాబాద్: సముద్ర తీర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులపై ‘భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవాకేంద్రం(ఇన్‌కాయిస్)’ అందించే సమాచారం తమకు ఎంతగానో దోహదపడుతోందని షిప్పింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ అరుణ్‌కుమార్ గుప్తా అన్నారు. మంగళవారం ఇన్ కాయిస్‌లో ఏర్పాటు చేసిన యూజర్ ఇంటరాక్షన్ వర్క్‌షాప్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తుపాను, సునామీ, ఫిషింగ్, కోస్ట్‌గార్డ్ త దితర అంశాలపై సంబంధిత వర్గాలకు ఇన్‌కాయిస్ అందిస్తున్న సమాచారం ఎలా ఉపయోగపడుతోంది, ఆయా వర్గాల వారు ఇంకా ఎలాంటి సమాచారం కోరుకుంటున్నారన్న దానిపై వర్క్‌షాప్‌లో చర్చించారు.
ఈ సందర్భంగా గుప్తా మాట్లాడుతూ.. సముద్ర మార్గాల్లో పరిస్థితుల సమాచారాన్ని ‘ఇన్‌కాయిస్’ తెలుసుకునేందుకు వీలుగా ఓడలపై ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఐకార్ డిప్యూటి డెరైక్టర్ జనరల్ మీనాకుమారి, ఇన్‌కాయిస్ డెరైక్టర్ షెనాయ్ తదితరులు పాల్గొన్నారు.