
టెహ్రాన్: ఎర్రసముద్రంలో వాణిజ్య రాకపోకలకు పెరుగుతున్న ముప్పుపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశ ఇంధనం, ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని ఆయన తెలిపారు. భారతదేశానికి సమీపంలో నౌకలపై దాడులు తీవ్ర ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఇలాంటి చర్యలు ఎవరికీ ప్రయోజనం కలిగించబోవని చెప్పారు. ఎర్రసముద్రంలో ఓడలపై జరుగుతున్న దాడుల సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమిరబ్దొల్లాహియాన్‌తో చర్చల తర్వాత మీడియాతో మాట్లాడారు.
"భారతదేశ సమీపంలోనూ కొన్ని దాడులు జరిగాయి. ఇది అంతర్జాతీయ సమాజానికి చాలా ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి చర్యలు భారతదేశ ఇంధనం, ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. ఈ చర్యలతో ఎవరికీ ప్రయోజనం ఉండదు.” అని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు.
గాజాలో యుద్ధం ఆందోళన కలిగించే అంశమని జైశంకర్ అన్నారు. పౌరుల ప్రాణనష్టం, ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలపై దాడులతో మానవతా సంక్షోభం నెలకొంది. దీనిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గాజాకు భారత్ స్వయంగా సామగ్రిని పంపి సహాయం చేసిందని స్పష్టం చేశారు. పాలస్తీనాలో నెలకొన్న పరిస్థితుల్ని పరిష్కరించేలా భారత్ మద్దతు ఉంటుందని తెలిపారు.
ఇదీ చదవండి: సిరియా, ఇరాక్‌పై ఇరాన్ క్షిపణి దాడులు