అసెంబ్లీ ఎన్నికల నినాదంతోనే.. లోక్‌సభ ఎన్నికల బరిలో టీఆర్‌ఎస్ పథకాల లబ్ధిదారుల ఓట్లను పొందేందుకు ప్రయత్నాలు దాదాపుగా 1.25కోట్ల ఓటర్లు లబ్ధిపొంది ఉంటారని అంచనా వీరందరినీ కలుస్తూ..ఓట్లు సంపాదించేలా ప్రయత్నాలు రైతుబీమా, రైతుబంధు పథకాలతో అన్నదాతలను చేరుకునే యత్నం
సాక్షి, హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల్లో సంక్షేమ నినాదంతోప్రజల్లోకెళ్లిన టీఆర్‌ఎస్.. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లను కొల్లగొట్టి వీలున్నన్ని ఎక్కువ సీట్లు సాధించే యత్నాలను ముమ్మరం చేసింది. అసెంబ్లీ ఫలితాలే లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రతిధ్వనించేలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లతో పాటు రైతుబీమాలను కలిపి టీఆర్‌ఎస్ హయాంలో లబ్ధిపొందిన వారందరి ఓట్లను సంపాదించుకునే పక్కా ప్రణాళికను అమలు చేస్తోంది. మొత్తం మీద అన్ని పథకాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు, ఆ కుటుంబాల సంఖ్యను బట్టి దాదాపు 1.25 కోట్ల ఓట్లను కొల్లగొట్టాలని భావిస్తోంది.
జీవన ప్రమాణాలపై ప్రభావం
తమ హయాంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రజల జీవన ప్రమాణాలపై ప్రభావం చూపుతున్నాయని టీఆర్‌ఎస్ నేతలు చెపుతున్నారు. ముఖ్యంగా ఆసరా పింఛన్ల రూపంలో వివిధ వర్గాలకు ఇచ్చే నగదు ప్రోత్సాహకం లబ్ధిదారులకు ఎంతో మేలు చేస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు. పింఛన్లను రూ.200 నుంచి రూ.1000కి పెంచి, ఆ తర్వాత రూ.2016, రూ.3,016ల వరకు ఇస్తున్నామంటున్నారు. రోజువారీ ఖర్చులకు ఇబ్బందులు లేకుండా వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు లబ్ధి పొందుతున్నారని వారు చెబుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఆసరా పింఛన్లు పొందుతున్న వారి సంఖ్య 39.42 లక్షలు కాగా, ఏప్రిల్ నుంచి పెంచిన మొత్తాన్ని అమలు చేసి, అర్హత వయసును 57 సంవత్సరాలకు తగ్గిస్తే.. ఆ సంఖ్య 48లక్షలకు చేరనుంది.
ఈ లబ్ధిదారులందరూ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పక్షానే నిలిచారని, ఇప్పుడు కూడా తమవైపే ఉంటారని అంచనా వేస్తోన్న టీఆర్‌ఎస్ నాయకత్వం ఈ ఓట్లను పోగొట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. పింఛన్ల లబ్ధిదారులకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని స్థానిక నేతలు వారికి భరోసా ఇస్తున్నారు. ఇక, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ల కింద ఇప్పటివరకు రాష్ట్రంలోని 5.5లక్షల కుటుంబాలు లబ్ధిపొందాయి. ఈ పథకం ప్రకటించిన తొలినాళ్లలో రూ.50వేల ఆర్థిక సాయం అందించగా, ఆ తర్వాత దాన్ని రూ.75వేలకు, అక్కడి నుంచి రూ.1,00,116లకు పెంచారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లతో పాటు ఈబీసీలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కుటుంబాలకు సంబంధించిన దాదాపు 15లక్షల ఓట్లలో మెజార్టీ ఓట్లు రాబట్టుకున్న గులాబీదళం ఇప్పుడు కూడా అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. ఇందుకోసం.. నేరుగా లబ్ధిదారులను, వారి కుటుంబాలను కలిసి మరోసారి కేసీఆర్‌ను ఆశీర్వదించాలని కోరుతోంది.
వారికి బీమా.. మాకు ధీమా!
అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపించిన రైతుబీమా, పెట్టుబడి సాయం పథకాలపై టీఆర్‌ఎస్ మరోసారి గంపెడాశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయానికి మూలకారణంగా భావిస్తున్న ఈ పథకం మళ్లీ ప్రభావం చూపుతూ.. ఎక్కువ ఎంపీ స్థానాలు గెలిచేందుకు ఉపకరిస్తుందని భావిస్తూ.. ఆ పథకం లబ్ధిదారులను కూడా టీఆర్‌ఎస్ శ్రేణులు కలుస్తున్నారు. ఏడాదికి రూ.8వేల సాయంతో పాటు రైతుబంధు అమలు చేసిన ప్రభుత్వం, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ సాయాన్ని రూ.10వేలకు పెంచింది. కేంద్రప్రభుత్వం కూడా రైతుబంధులాగే ‘కిసాన్ సమ్మాన్ యోజన’పథకాన్ని అమలుచేస్తోంది. ఇది మన పథకమేనంటూ టీఆర్‌ఎస్ ప్రచారం చేస్తోంది.
రైతు సంక్షేమం విషయంలో దేశానికే దిశానిర్దేశం చేసిన కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చడానికి, ఆయన ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌కు ఊతమివ్వడానికి రైతాంగమంతా అండగా ఉండాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో ఆసరా పింఛన్ దారులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులు, రైతుబీమా పొందిన కుటుంబాలు, పెట్టుబడి సాయం అందుతున్న రైతులంతా కలిసి రాష్ట్రంలో 1.25 కోట్ల వరకు ఓటర్ల రూపంలో ఉండొచ్చని టీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది. మరి, టీఆర్‌ఎస్ ఆశిస్తున్న విధంగా ఓటరన్న మరోసారి సంక్షేమానికి జై కొడతాడా? ఇతర అంశాలకు ప్రాధాన్యమిస్తాడా? అన్నది వేచి చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment