జయ.. జయహే తెలంగాణ | Telangana created new trend in development and welfare schemes | Sakshi
Sakshi News home page

జయ.. జయహే తెలంగాణ

Published Sun, Jun 2 2019 3:19 AM | Last Updated on Sun, Jun 2 2019 10:31 AM

Telangana created new trend in development and welfare schemes - Sakshi

ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటాల అనంతరం ఎన్నో ఆశలు, ఆకాంక్షల నడుమ దేశంలో 29వ రాష్ట్రంగా 2014 జూన్‌ 2న అవతరించిన తెలంగాణ రాష్ట్రం నేడు ఐదేళ్లు పూర్తి చేసుకొని ఆరో వసంతంలోకి అడుగిడుతోంది. ఆవిర్భావ సమయంలో ఉత్పన్నమైన భయాలు, ఆందోళనలు, అనుమానాలను విజయవంతంగా అధిగమించిన తెలంగాణ... నేడు పలు రంగాల్లో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా దూసుకుపోతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల సమ్మేళనంతో పాలనలో కొత్త ఒరవడి సృష్టించింది. 
– సాక్షి, హైదరాబాద్‌

సబ్బండ వర్గాల అభ్యున్నతికి కార్యాచరణ... 
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ఆవిర్భావం రోజునే బాధ్యతలు చేపట్టిన టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు రైతు సంక్షేమం, సబ్బండ వర్గాల అభ్యున్నతి కార్యాచరణతో కొత్త రాష్ట్రం నిర్మాణానికి పునాదులు వేశారు. కేసీఆర్‌ మానస పుత్రికలైన రైతుబంధు, రైతు బీమా, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ వంటి బృహత్తర పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయమయ్యాయి. గత డిసెంబర్‌లో జరిగిన రాష్ట్ర శాసనసభ ముందస్తు ఎన్నికల్లో విజయదుందుభి మోగించి రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టడానికి దోహదపడ్డాయి. రైతుబంధు, రైతు బీమా పథకాలు ఐక్యరాజ్యసమితి ప్రశంసలను సైతం అందుకున్నాయి. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా వంటి సంచలన నిర్ణయాలు యావత్‌ దేశం దృష్టిని రాష్ట్రంవైపు ఆకర్షింపజేశాయి. 

కోటి ఎకరాల సాగునీటి సరఫరా కల దిశగా... 
సీఎం కేసీఆర్‌ స్వీయ పర్యవేక్షణలో రూపుదిద్దుకుంటున్న కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాలు కోటి ఎకరాలకు సాగునీటి సరఫరా కలను సాకారం చేసే దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నాయి. పాలనా సంస్కరణల కోసం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు, కొత్త పురపాలికల ఏర్పాటు చేయడంతో రాష్ట్రం కొత్త రూపు సంతరించుకుంది. రాష్ట్ర శాసనసభ 2018 మార్చిలో ఆమోదించిన కొత్త పంచాయతీరాజ్‌ చట్టంతో రాష్ట్రంలోని 1,177 తండాలు, గూడేలను గ్రామ పంచాయతీ హోదా వరించింది. పెట్టుబడులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన టీఎస్‌–ఐపాస్‌ పారిశ్రామిక విధానం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు అందుకుంది. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు, ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు ఆతిథ్యమిచ్చి యావత్‌ ప్రపంచం దృష్టిని తెలంగాణ ఆకర్షించింది. విద్య, ఉద్యోగాల్లో స్థానికులకే అవకాశం కల్పించేందుకు కొత్త జోనల్‌ విధానం అమల్లోకి వచ్చింది. భూ రికార్డుల ప్రక్షాళన పంపిణీ వంటి వినూత్న కార్యక్రమాన్ని ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. 

ఆదాయ వృద్ధిలో అగ్రగామి... 
ఆదాయ వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా కొనసాగుతోంది. 2014–18 కాలంలో 17.17 శాతం ఆదాయ వృద్ధిని సాధించింది. అలాగే 2018–19 ఆర్థిక సంవత్సరంలో నవంబర్‌ ముగిసే నాటికి 29.93 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. 

సంక్షేమ రాజ్యం... 
సంక్షేమ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఏటా రూ.40 వేల కోట్లను సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేస్తోంది. పేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు, వృద్ధ కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్లు అండగా మారాయి. రాష్ట్ర ఆవిర్భావానికి తొలి ఏడాదే వృద్ధాప్య పింఛన్‌ను రూ. 200 నుంచి రూ. వెయ్యికి, వికలాంగులు, పేద వృద్ధ కళాకారుల పింఛన్‌ను రూ. 500 నుంచి రూ. 1,500కు ప్రభుత్వం పెంచింది. దీనివల్ల తొలి ఐదేళ్లు ఏటా రూ. 5,013.91 కోట్లు ఖర్చు అయింది. సామాజిక భద్రత కోసం అందిస్తున్న పింఛన్లకు వార్షిక ఆదాయ, వయో అర్హత నిబంధనలను సర్కారు సడలించింది.

2018–19లో 39,32,726 మందిగా ఉన్న పింఛనర్ల సంఖ్య ఈ నిర్ణయంతో 47,88,070కు పెరగనుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అన్ని రకాల పింఛన్లను జూన్‌ నెల రెట్టింపు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. వృద్ధుల పింఛన్లు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళల భృతి రూ. 1000 నుంచి రూ. 2016కు పెరగనుంది. అలాగే వికలాంగులు రూ. 3,016, బోదకాలు బాధితులు రూ. 2,016 పింఛను అందుకోనున్నారు. దీంతో ప్రభుత్వంపై రూ. 6,787 కోట్ల అదనపు భారం పడనుంది. పింఛన్ల పంపిణీకి ఏటా రూ. 11,843 కోట్ల వ్యయం కానున్నది. వృద్ధాప్య పింఛన్ల వయోపరిమితి 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించడంతో 2019 ఏప్రిల్‌ నుంచి వృద్ధాప్య పెన్షన్లర్ల సంఖ్య 21,60,275కి చేరింది.  

పేదల ఇంట కల్యాణలక్ష్మి... 
పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. కల్యాణలక్ష్మి ద్వారా 3,56,997 మంది ఎస్సీ, ఎస్టీ, బిసీ, ఈబీసీ లబ్ధిదారులు, షాదీ ముబారక్‌ ద్వారా 1,09,732 మంది మైనారిటీ వర్గాల పేద ఆడపిల్లలకు ప్రభుత్వం రూ. 51 వేల చొప్పున ఆర్థిక సాయం అందించింది. ఇందుకు రూ. 3,750 కోట్లు ఖర్చయింది. 2018 మార్చి నుం చి ప్రభుత్వం ఈ పథకాల కింద అందించే ఆర్థిక సాయాన్ని రూ. 1,00,116కు పెంచింది. 

పేద విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం... 
మధ్యాహ్న భోజనం పథకం కింద రాష్ట్రంలో 3,854 సంక్షేమ హాస్టళ్లలో ఉన్న 7.95 లక్షల మంది విద్యార్థులకు, 28,623 ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న 23,87,751 మంది విద్యార్థులకు ప్రతి నెలా 12 వేల మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యాన్ని 16 సంక్షేమ విభాగాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. 

ప్రైవేటుకు దీటుగా గురుకుల విద్య... 
విద్యాభివృద్ధిలో తెలంగాణ గురుకుల పాఠశాలలు అద్భుత పాత్ర పోషిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు కాకముందు 298 (261+37 జనరల్‌) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు ఉండగా, గత ఐదేళ్లలో 661 (608 స్కూళ్లు + 53 డిగ్రీ కాలేజీలు) కొత్త గురుకులాలను ఏర్పాటు చేయడంతో వాటి సంఖ్య 959 (906+53 డిగ్రీ కాలేజీలు)కు పెరిగింది. 2018–19 బడ్జెట్లో గురుకులాలకు రూ. 2,283 కోట్లు కేటాయించారు. వచ్చే విద్యా సంవత్సరంలో 8,434 మంది గురుకుల ఉపాధ్యాయులు కొత్తగా విధుల్లో చేరనున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా గురుకుల విద్యార్థులు ఫలితాలను సాధిస్తున్నారు. 

రైతన్న కోసం విప్లవాత్మక పథకాలు... 
రైతన్న సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక పథకాలను అమల్లోకి తెచ్చింది. వ్యవసాయ పెట్టుబడి కోసం రైతులు అప్పులపాలు కాకుండా 2018 మేలో ప్రారంభించిన రైతుబంధు పథకం యావత్‌ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఎకరానికి 4 వేల చొప్పున రెండు పంటల కోసం రెండు విడతల్లో ప్రతి రైతుకూ ఎకరాకు రూ. 8 వేలు ప్రభుత్వం అందిస్తోంది. 2019–20 నుంచి పంట పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ. 4 వేల నుంచి రూ. 5 వేలకు పెంచడంతో రైతు ఎకరాకు ఏటా రూ. 10 వేల సాయాన్ని అందుకోనున్నాడు. వానాకాలంలో సాధారణ సాగు 1.08 కోట్ల ఎకరాలైతే యాసంగిలో 31.92 లక్షల ఎకరాలు. 2018–19 ఖరీఫ్‌లో 51.50 లక్షల మంది రైతులకు రూ. 5,260.94 కోట్లు, రబీలో 49.03 లక్షల మంది రైతులకు రూ. 5,244.26 కోట్లు అందజేశారు. 

అన్నదాతకు మరిన్ని మేళ్లు... 
- రాష్ట్రంలోని 57 లక్షల మంది రైతుల్లో అర్హులైన 50 లక్షల మందికి రూ. 5 లక్షల వ్యక్తిగత జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద మరణించిన రైతు కుటుంబానికి 10 రోజుల్లోనే రూ. 5 లక్షల బీమా సొమ్ము అందిస్తున్నారు. ఇప్పటివరకు 10 వేలకుపైగా రైతు కుటుంబాలు ఈ పథకం వల్ల లబ్ధి పొందాయి. 

- రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నాలుగు విడతల్లో రూ. 16,124.37 కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేయడంతో 35,29,944 మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఎన్నికల హామీ మేరకు 2018 నాటికి ఉన్న వ్యవసాయ రుణాల మాఫీ కోసం 2019–20 బడ్జెట్లో ప్రభుత్వం రూ. 6,000 కోట్లు కేటాయించింది. దీనివల్ల సుమారు 48 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 30 వేల కోట్ల రుణాలు మాఫీ కానున్నాయి. 2014లో రుణమాఫీ పొందిన వారికంటే ఈసారి 12.69 లక్షల మంది అదనంగా రుణమాఫీ పొందనుండటం విశేషం. 

సాగునీరు... 
తెలంగాణలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభాన్ని, కరువు, వలసలను నివారించడానికి ప్రభుత్వం సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం లక్ష ఎకరాలకు సాగునీరు చొప్పున రాష్ట్రంలో కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఐదేళ్లలో 11.91 లక్షల కొత్త ఆయకట్టుకు నీరందించింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ. 50 వేల కోట్లకుపైనే ఖర్చు చేసింది. గోదావరి, కృష్ణా నదుల్లో రాష్ట్ర వాటా 1,250 టీఎంసీలు. మరో 150 టీఎంసీలను పూర్తిగా వినియోగించుకోవడానికి కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ వంటి భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ రైతులకు జీవధారగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులు సీఎం కేసీఆర్‌ స్వీయ పర్యవేక్షణలో యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. రూ. 80,190 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 235 టీఎంసీల నీళ్లను మళ్లించనున్నారు. గోదావరి నుంచి 90 రోజులపాటు రోజూ మూడు టీఎంసీల చొప్పున నీటిని మళ్లించి 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇప్పటికే తుది దశకు చేరుకున్న నిర్మాణ పనులు వచ్చే ఏడాది పూర్తి కానున్నాయి. ఇంటింటికీ రక్షిత మంచి నీటి సరఫరా కోసం చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం సైతం చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది చివరిలోగా పనులు పూర్తి కానున్నాయి.

పరిశ్రమలు, ఐటీ, విద్యుత్‌ రంగాలు 
తెలంగాణ ఆవిర్భావం తర్వాత నెలకొన్న విద్యుత్‌ సంక్షోభాన్ని రాష్ట్రం ఆరు నెలల్లోనే అధిగమించింది. గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో కోతలులేని నిరంతర విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. నూతన పారిశ్రామిక విధానం టీఎస్‌–ఐపాస్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 2019 మార్చి నాటికి రూ. 1,58,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చాయి. ఆన్‌లైన్‌ విధానం ద్వారా 9,395 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశారు. 2.74 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. 2013–14లో రూ. 52.25 వేల కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులు 2018–19 నాటికి రూ. 1,09,219 కోట్లకు చేరాయి. 2018–19 నాటికి 1,500 ఐటీ/ఐటీఈఎస్‌ కంపెనీల్లో 5,43,033 మందికిపైగా ప్రత్యక్షంగా, 7 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభించింది.  

ఉద్యోగాల భర్తీ... 
రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు 1,59,116 ఉద్యోగాల ఖాళీలను గుర్తించిన ప్రభుత్వం... ఇప్పటివరకు 91,790 మందికి ఉద్యోగాలిచ్చింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా 17,038, సింగరేణిలో 11,106, ఆర్టీసీలో 5,157, పోలీసుశాఖలో 10,980, వైద్య ఆరోగ్యశాఖలో 1,514, పంచాయతీ కార్యదర్శులు 9,355, వర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో 9,614 ఉద్యోగాల భర్తీని పూర్తి చేసింది. 

కేసీఆర్‌ పాలన న భూతో న భవిష్యత్‌... 
కేసీఆర్‌ ఐదేళ్ల పాలన ఓ అద్భుతం. అనన్య సామాన్యం. న భూతో న భవిష్యత్‌. రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణమైన పాలన సాగుతోంది. తెలంగాణ అవసరాలు, సమస్యలు తెలిసిన కేసీఆర్‌ ఉద్యమ స్ఫూర్తితో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సాగిస్తున్నారు. పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు, రైతు బీమా, రైతుబంధు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కేసీఆర్‌ కిట్లు, ఆసరా పెన్షన్ల వంటి అనేక పథకాలు దేశంలోనే ప్రశంసలు అందుకున్నాయి. మేనిఫెస్టోలో చెప్పిన, చెప్పని పథకాలనూ అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌ది. గత ఐదేళ్లలో శాంతిభద్రతలు మెరుగయ్యాయి. హైదరాబాద్‌ విశ్వనగరంగా మారింది. ప్రపంచం దృష్టి అంతా హైదరాబాద్‌ మీదే ఉంది. తండాలు గ్రామ పంచాయతీలయ్యాయి. గ్రామాల్లో మౌలికవసతులు పెరిగాయి. గత ఐదేళ్లలో తెలంగాణ ప్రగతికి బాటలు పడ్డాయి. బంగారు తెలంగాణలో ప్రజలంతా భాగస్వాములవుతున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తై రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. 
– అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖల మంత్రి 

5 ఏళ్లలోనే 70 ఏళ్ల పనులు... 
గత 70 ఏళ్లలో చేయని ఎన్నో గొప్ప పనులు గత ఐదేళ్లలో జరిగాయి. రైతుల సంక్షేమం, విద్యుత్‌ సరఫరా, సంక్షేమ వసతి గృహాలు, ఉద్యోగులకు తొలి పీఆర్‌సీ అమలు వంటి అద్భుత కార్యక్రమాలే దీనికి నిదర్శనం. వ్యవసాయానికి 3 గంటల విద్యుత్‌ కూడా రాకపోయేది. ఇప్పుడు 24 గంటల సరఫరా జరుగుతోంది. పేద విద్యార్థులకు దొడ్డు బియ్యం అన్నానికి బదులు సన్న బియ్యం భోజనం, కల్యాణలక్ష్మి కింద రూ. లక్ష ఆర్థిక సాయం వంటి కార్యక్రమాలు కేవలం రాష్ట్రంలోనే అమలవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే 50 లక్షల ఎకరాలకు నీరు అందనుంది. ఉమ్మడి ఏపీలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కోసం పదేళ్లు కొట్లాడితే సర్వే కోసం రూ. 7 కోట్లే కేటాయించారు. తెలంగాణ వచ్చాక రూ. 10 వేల కోట్లను కేటాయించారు. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో మరింత అభివృద్ధి జరగనుంది. 
– శ్రీనివాస్‌గౌడ్, ఆబ్కారీ, పర్యాటకశాఖల మంత్రి 

దేశానికి కేసీఆర్‌ పథకాలు ఆదర్శం... 
రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శం. 24 గంటల విద్యుత్, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ వంటి కార్యక్రమాలతో రాష్ట్రం సుభిక్షమైంది. రైతుబంధు పథకం అంతర్జాతీయ ఖ్యాతినార్జించింది. ఐక్యరాజ్య సమితి సైతం దీన్ని ప్రశంసించింది. రైతులెవరైనా దురదృష్టవశాత్తూ మరణిస్తే రైతు బీమా పథకం ద్వారా వారి కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా అందుతుంది. అన్ని వర్గాల ప్రజలకు కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ వంటి పథకాల ద్వారా ఆయా వర్గాల ప్రజలకు ఎంతో మేలు చేసినట్లయింది. గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశం దృష్టిని ఆకర్షించారు. దేశం తెలంగాణవైపు చూస్తోంది. తెలంగాణ ఉద్యమకారుడే సీఎం కావడం వల్ల ప్రజల కష్టాలన్నీ తీరుతున్నాయి. కేసీఆర్‌ వంటి ముఖ్యమంత్రి దొరకడం తెలంగాణ ప్రజల అదృష్టమనే చెప్పాలి. 
– తలసాని శ్రీనివాస్‌ యాదవ్, పశు సంవర్ధకశాఖ మంత్రి   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement