బాబూమియా ఇంట్లోని గిరక బావి, నీటిని తోడుతున్న బాబూమియా సతీమణి
ఆ బావి లోతు 30 అడుగులు... వయసు 40 ఏళ్లు. అయితే ఏంటి అంటారా? ఈ 40 ఏళ్లలో ఒక్కసారి కూడా ఇది ఎండిపోలేదు. అంతేకాదు... చుట్టూ 6 బోర్లున్నా,మండుటెండల్లోనూ ఇందులో ఆరడుగుల నీళ్లు ఉండడంవిశేషం. అంబర్‌పేట్ ప్రేమ్‌నగర్‌లోని షేక్ అబ్దుల్ నబీఅలియాస్ బాబూమియా ఇంట్లోని గిరక బావి ఘనత ఇది.
అంబర్‌పేట: ఈ మహానగరంలో చేతిబావులు కనిపించడం అరుదే. అలాంటిది ఈ ఇంటిల్లిపాది మాత్రం 40 ఏళ్లుగా చేతిబావి మీదే ఆధారపడి జీవిస్తోంది. వీరు అవసరాలను తీరుస్తూ... జలభాగ్యాన్ని ప్రసాదిస్తోందీ గిరక బావి. ఒకప్పుడు అడవిలా ఉన్న ప్రాంతంలో తవ్విన చేతబావుల్లో ఇదీ ఒకటి. కాలం మారి చుట్టూ కాంక్రీట్ జంగిల్ ఏర్పడింది. అందరూ బంగ్లాలు కట్టుకొని, బోర్లు వేసుకున్నారు. కానీ ఆ ఇల్లు, బావి మాత్రం మారలేదు. ఇల్లు కట్టే సమయంలో బాబూమియా దీనిని తవ్వించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఒక్కసారి కూడా ఎండిపోలేదని చెప్పారాయన. ఇప్పటికీ ఈ బావి నీటితోనే తమ అవసరాలు తీర్చుకుంటామని తెలిపారు.
గిరక ‘తోడు’గా...
అప్పటికి, ఇప్పటికి ఎన్నో మార్పులు వచ్చాయి. బావికి పంప్‌సెట్ అమర్చితే నిమిషాల్లో నీళ్లు పైకి వస్తాయి. కానీ... ఈ కుటుంబం నేటికీ బావిలో నుంచి నీటిని తోడుకొని వాడుకుంటోంది. పంప్‌సెట్ అమర్చితే బావి ఊటలో తేడా వస్తుందని, అందుకే ఏర్పాటు చేయలేదని చెప్పారు బాబూమియా. ప్రతి రెండేళ్లకు ఒకసారి పూడిక తీయిస్తానని పేర్కొన్నారు. అవసరం మేరకే నీటిని తోడుకుంటూ... బావిని కాపాడుకుంటూ... జలసంరక్షణకు పాటుపడుతోందీ కుటుంబం. వివాహ సమయంలో చేతిబావి నుంచి నీళ్లు తోడుకొని వెళ్లడం సంప్రదాయం. ఈ చుట్టుపక్కల ఎక్కడ శుభకార్యం జరిగినా, ఈ బావి దగ్గరికే వచ్చి నీళ్లు తీసుకెళ్తారు.
స్వచ్ఛం.. నిత్యం
40 ఏళ్ల క్రితం ఇళ్లు కట్టే సమయంలో దీనిని తవ్వించాను. ఈ బావి నీటితోనే ఇళ్లు కట్టాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతినిత్యం స్వచ్ఛమైన నీటిని అందిస్తోంది. ఎప్పుడూ బావి నీళ్లు కలుషితం కాలేదు. ఆ స్వచ్ఛతను మేమూ కాపాడుకుంటూ వస్తున్నాం. మా కుటుంబ అవసరాలన్నీ బావి నీటితోనే తీర్చుకుంటున్నాం. వర్షాకాలంలో చేతికి అందేలా నీరు పైకి వస్తుంది. ఎండాకాలంలోనూ ఇప్పటి వరకు ఎండిపోలేదు. – బాబూమియా
Comments
Please login to add a commentAdd a comment