గురువులేరి?
నిజామాబాద్‌అర్బన్ : జిల్లాలో 462 ఉన్నత పాఠశాలలు, 1573 ప్రాథమిక పాఠశాలలు, 876 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. 9,783 మంది టీచర్లు పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో 2060 మందికి స్థాన చలనం కలిగింది. బదిలీలు, రేషనైజేషన్‌తో పాఠశాలల్లో ఉపాధ్యాయుల కేటాయింపు అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వ మార్గదర్శకాలు సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి.
జుక్కల్ మండలంలో 55 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ఇటీవల జరిగిన బదిలీల్లో 100 మంది టీచర్లు బదిలీ కాగా, 22 మంది మాత్రమే కొత్తగా వచ్చారు. నిజాంసాగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 240 మంది విద్యార్థులు ఉన్నారు. గత ఏడాది 11 మంది టీచర్లు అందుబాటులో ఉండగా బదిలీలతో ఇప్పుడు ముగ్గురు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇలా జిల్లాలోని 236 పాఠశాలల్లో టీచర్ల కొరత ఉంది.
నగరంలోనూ అంతంతే..
నిజామాబాద్ జండాగల్లి పాఠశాలలో 150 మంది విద్యార్థులు ఉండగా ముగ్గురు మాత్రమే టీచర్లు ఉన్నారు. సతీష్‌నగర్‌లోని ఉర్దూ మీడియం పాఠశాలలో 89 మంది విద్యార్థులకు ఏడాదిరన్నర కాలంగా ఒక టీచర్ మాత్రమే బోధిస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో మరో ఇద్దరు వచ్చినా బోధనకు ఇబ్బందిగానే ఉంది. వెంగళరావ్‌నగర్ కాలనీ పాఠశాలలో 96 మంది విద్యార్థులకు ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్నారు.
మరికొన్ని పాఠశాలల్లో పరిస్థితి భిన్నం..
జిల్లాలోని మరికొన్ని పాఠశాలల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఆయూ స్కూళ్లలో విద్యార్థులు తక్కువగా ఉన్నా.. ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారు. నిజామాబాద్ అశోక్‌నగర్ పాఠశాలలో 15 మంది విద్యార్థులకు ఇద్దరు టీచర్లు పని చేస్తున్నారు. జక్రాన్‌పల్లి మండలంలో పుప్పల తండాలో 10 మంది లోపు విద్యార్థులుంటే టీచర్లు ఆరుగురు ఉన్నారు. ఇదే మండలంలోని గాంధీనగర్ పాఠశాలలో 10 మంది లోపు విద్యార్థులుంటే 12 మంది టీచర్లు ఉన్నారు. జక్రాన్‌పల్లి మండలంలోని మరో 9 పాఠశాలల్లో 10 మంది పిల్లలు ఉంటే 16 మంది చొప్పున టీచర్లను నియమించారు. నందిపేట మండలం బజార్‌కొత్తూరులో 14 మంది పిల్లలకు 16 మంది టీచర్లు ఉన్నారు.
అవకతవకలే కారణం..
విద్యాశాఖలోని అవకతవకల వల్లే ఈ పరిస్థితి నెలకొందని పలువురు అంటున్నారు. బదిలీలు సక్రమంగా చేపట్టకపోవడంతో అవసరమైన చోట తక్కువగా, అవసరం లేని చోట ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నారని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించాల ని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
పరిశీలిస్తాం...
తక్కువ మంది విద్యార్థులు ఉన్నచోట ఎక్కువ మంది టీచర్లు ఉంటే పరిశీలన చేస్తాం, దీనికి ఆయా పాఠశాలలను గుర్తించి అవసరమైన చోట టీచర్లను అందుబాటులో ఉండేలా చేస్తాం. పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు ఎలా వస్తే అలా కొనసాగిస్తాం, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం సక్రమమైన విద్యాబోధన అందేలా చర్యలు తీసుకుంటాం.
- లింగయ్య, డీఈఓ