ఈ-పంచాయతీకి ఇక్కట్లు
కరీంనగర్ సిటీ :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ-పంచాయతీలకు బాలారిష్టాలు దాటడం లేదు. గ్రామపంచాయతీల్లో పారదర్శకత, వేగవంత మైన పాలనను అందించేందుకు టీఆర్‌ఎస్ సర్కార్ ఈ-పంచాయతీలకు శ్రీకారం చుట్టింది. తొలివిడతలో 319 ఈ-పంచాయతీలు లక్ష్యం నిర్ణయించగా 106 జీపీలకే ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించింది. ఈ-పంచాయతీల కోసం జిల్లాలోని 319 గ్రామపంచాయతీలకు, 57 మండల పరిషత్ కార్యాలయాల్లో, మూడు డీఎల్‌పీ కార్యాలయాల్లో, రెండు డీపీవో కార్యాలయంలో, ఒకటి సీఈవో కార్యాలయంలో కంప్యూటర్లు అమర్చారు.
ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ఆయా పంచాయతీలకు మోడెం పంపించారు. 383 కంప్యూటర్లకు గాను 381 మోడెమ్స్ జిల్లాకు చేరాయి. ఇప్పటి వరకు 55 గ్రామ పంచాయతీలు, 40 మండల పరిషత్‌లు, రెండు డీఎల్‌పీవో కార్యాలయాల్లో, ఒకటి డీపీవో కార్యాలయంలో, ఒకటి సీఈవో కార్యాలయంలో మోడమ్స్‌ను ఇన్‌స్టాల్ చేశారు.
ఇంటర్నెట్ పెండింగ్
ఈ-పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం అడ్డంకిగా మారింది. ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటున్నారు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్స్, సిగ్నల్స్ లేకపోవడంతో ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడం సాధ్యపడడం లేదు. ఇంటర్నెట్ లేక ఈ ప్రయత్నం వృథా అవుతుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
160కు మాత్రమే కనెక్షన్..
జిల్లాకు తొలివిడతలో 319 గ్రామపంచాయతీలను ఈ-పంచాయతీలుగా గుర్తించినా.. అందులో 160 పంచాయతీలకు మాత్రమే ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చారు. మిగతా 221 గ్రామపంచాయతీలకు బీఎస్‌ఎన్‌ఎల్ టవర్స్ లేకపోవడంతో కంప్యూటర్లు అందజేసి చేతులు దులుపుకున్నారు. మొదటి విడతలోనే దాదాపు 60 శాతం గ్రామపంచాయతీలు ఇంటర్నెట్ సౌకర్యానికి నోచుకోకపోయూరుు. దీంతో 1207 గ్రామపంచాయతీల్లో ఎన్ని ఈ-పంచాయతీలకు దూరమవుతాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నారుు.
ప్రత్యామ్నాయ మార్గాలపై నజర్
ఈ-పంచాయతీలుగా మార్చే క్రమంలో ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. చాలాచోట్ల బీఎస్‌ఎన్‌ఎల్ టవర్స్, సిగ్నల్స్ లేకపోవడంతో ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఇవ్వలేకపోతున్నారు. ఇలాంటి గ్రామపంచాయతీలను గుర్తించి ఇతర అవకాశాలను తెలియజేయాలని ఇప్పటికే అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. దీంతో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల సేవలు తీసుకోవడం, డాటా కార్డులు తదితర అవకాశాలపై కసరత్తు చేస్తున్నారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం..
- కుమారస్వామి, డీపీవో
221 గ్రామపంచాయతీలకు బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ అందుబాటులో లేకపోవడాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులతో సంప్రదించి కొత్త లైన్ వేసైనా పంచాయతీలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని సర్కార్ ఆదేశించింది. ఈ క్రమంలో కొత్త లైన్ వేసే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది.