internet facility
-
ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం: సీఎం జగన్
సాక్షి, అమరావతి : వచ్చే మూడేళ్లలో ఇంటర్నెట్ సదుపాయాన్ని అన్ని గ్రామాలకూ కల్పించడమన్నది చాలా ముఖ్యమైన అంశమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఐటీ రంగం అభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుందన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్ పాలసీలో అంశాలపైనా సమగ్రంగా చర్చించిన సీఎం వైఎస్ జగన్ ఇంటర్నెట్ నెట్వర్క్ బలంగా లేకపోతే.. అనుకున్న లక్ష్యాలు సాధించలేమని తెలిపారు. ఐటీ-ఎలక్ట్రానిక్ పాలసీపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చర్చించారు. రాష్ట్రంలో ఇంటర్నెట్ నెట్వర్క్ విస్తృతి, ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్, గ్రామాల్లో ఇంటర్నెట్ లైబ్రరీ, కొత్తగా వస్తున్న ఐటీ, ఇతర టెక్నాలజీ అంశాల్లో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడంపైనా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. విశాఖలో ఎమర్జింగ్ టెక్నాలజీ యూనివర్శిటీపైనా సమావేశంలో చర్చించ్చిన సీఎం జగన్ పాలసీలో పెట్టాల్సిన అంశాలపై అధికారులకు సూచనలు అందించారు. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఇంటర్నెట్ లైబ్రరీని ఏర్పాటు చేయాలని, గ్రామంలో ఎవరైనా సరే ఈ సదుపాయాన్ని వినియోగించుకునేలా ఉండాలని అన్నారు. వర్క్ ఫ్రం హోం చేసుకునే సదుపాయం ఉంటుందని, ఇందుకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ- లైబ్రరీ కోసం భవనం కూడా కట్టాలని, దీనిపై కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. గ్రామంలోని సచివాలయాలు, ఆర్బీకేలు అన్నీ కూడా ఇంటర్నెట్తో అనుసంధానం కావాలన్నారు. దీంతోటు అవసరమైన గృహాలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్క్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్క్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమోదం తెలిపారు. విశాఖపట్నంలో ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్కు ఏర్పాటు చేసి ఇందులో హై ఎండ్ స్కిల్స్ యూనివర్శిటీ, ఇన్క్యుబేషన్ సెంటర్, ల్యాబ్స్, సీఓఈఎస్, ఐటీ, ఈసీ డిపార్ట్మెంట్ ఆఫీసు, స్టేట్ డేటా సెంటర్, ఐటీ టవర్స్ ఇవన్నీకూడా ఉండాలని సీఎం ఆదేశించారు. చదవండి: తొలి దెబ్బ అదిరింది ఎమర్జింగ్ టెక్నాలజీస్ యూనివర్శిటీ విశాఖలో ఏర్పాటు కాబోతున్న యూనివర్శిటీలో రోబోటిక్స్, ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్‌చైన్ టెక్నాలజీస్, డేటా అనలిటిక్స్ సైన్సెస్, అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటివనరులు తదితర రంగాల్లో ఐటీ అప్లికేషన్లపై బోధన, పరిశోధన లక్క్ష్యంగా ఉండాలన్నారు. దేశంలోని ప్రఖ్యాత ఐఐటీ సహా వివిధ సాంకేతిక సంస్థల్లోని నిపుణులు దీనిపై త్వరలోనే నివేదిక సమర్పిస్తారని అధికారులు వెల్లడించారు. ఇంజినీరింగ్ సహా.. ఇతరత్రా సాంకేతిక విద్యను అభ్యసించిన వారికి నైపుణ్యాలను మెరుగుపరిచేందుకూ ఈ యూనివర్శిటీ ఉపయోగపడాలని సీఎం అన్నారు. యూనివర్శిటీ సహా ఐటీ సంబంధిత విభాగాలన్నీ ఒకే చోట ఉండాలని తెలిపారు మూడు ఐటీ కాన్సెప్ట్ సిటీలు విశాఖపట్నం, తిరుపతి, బెంగుళూరు సమీపంలో.. మూడుచోట్ల కనీసం 2 వేల ఎకరాల విస్తరణలో ఐటీ కాన్సెప్ట్‌సిటీలను ఏర్పాటు చేసేదిశగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ కాన్సెప్ట్ సిటీల్లో మౌలిక సదుపాయాలు అత్యున్నత ప్రమాణాలతో ఉండాలన్నారు. నిర్మాణంలో ఆర్కిటెక్చర్ యునిక్‌గా ఉండాలని, ప్రతి కాన్సెప్ట్ సిటీకి సంబంధించిఒక ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్ ఉండాలని పేర్కొన్నారు. పాలసీలో ప్రతి అంశం పారదర్శకంగా ఉండాలన్నారు. ఐటీ ప్రగతికి దోహదపడాలని, రాష్ట్రాభివృద్ధికి సహాయపడాలని సూచించారు. అన్ని అంశాలపై ఆలోచనలు చేసి మంచి పాలసీని తీసుకురావాలన్నారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం పెరిగిందన్న సీఎం వర్క్ ఫ్రం హోంను ప్రమోట్ చేయాలని సూచించారు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఏ రకంగా ఐటీ రంగానికి ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందిస్తామో పరిశీలన చేసి, దాన్ని పాలసీలో పెట్టాలని తెలిపారు. కొప్పర్తి ఎలక్ట్రానిక్స్ పార్క్‌పై దృష్టిపెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. వీలైనన్ని పరిశ్రమలను తీసుకురావాలని, పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పనపై దృష్టిపెట్టాలని తెలిపారు. ఈ సమావేశానికి ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని,ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జీజయలక్ష్మి, ఐటీ శాఖ స్పెషల్ సెక్రటరీ బీ సుందర్, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఎమ్ఎమ్ నాయక్, ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండీ ఎమ్ మధుసూదన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: ‘ఎన్నిసార్లు మంత్రిగా ఉన్నామనేది ముఖ్యం కాదు’ -
గ్రామాలకు నిరంతరాయంగా ఇంటర్నెట్
అమ్మఒడి, వసతి దీవెన లబ్ధిదారుల్లో 9 నుంచి 12వ తరగతి, ఆపై చదువుతున్న విద్యార్థుల్లో ఆప్షన్‌గా కోరుకున్న వారికి ల్యాప్‌టాప్ అందించడంపై దృష్టి సారించాలి. ఇంజినీరింగ్, ఇతర సాంకేతిక విద్యలను అభ్యసిస్తున్న వారి అవసరాలు తీర్చేలా మరిన్ని స్పెసిఫికేషన్లతో కూడిన ల్యాప్‌టాప్‌లు ఇచ్చేలా ఆలోచించాలి. పంచాయతీ నుంచి గ్రామంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి సరైన వ్యవస్థ ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలి. గ్రామాల్లో నెట్వర్క్ పాయింట్ వద్ద ఇంటర్నెట్ లైబ్రరీ ఏర్పాటు చేసే దిశగా ఆలోచించాలి. తద్వారా సొంత గ్రామాల్లోనే ఉంటూ ఇంటి నుంచే పని చేసే (వర్క్ ఫ్రం హోం) అవకాశం ఉంటుంది. ల్యాప్‌టాప్ చెడిపోతే.. దాన్ని వార్డు, గ్రామ సచివాలయాల్లో ఇస్తే, వారం రోజుల్లో మరమ్మతు చేసి ఇవ్వాలి. లేదా రీప్లేస్ చేయాలి. ఇందుకోసం కంపెనీ నిర్వహణను ఏడాది కాకుండా మూడేళ్లు పెట్టాలి. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని గ్రామాలకు అంతరాయం లేని అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం లక్ష్యంగా నెట్వర్క్ వ్యవస్థ ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామంలో నెట్వర్క్ పాయింట్ నుంచి ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని, వినియోగదారులు ఏ సామర్థ్యం కనెక్షన్ కావాలన్నా ఇచ్చేలా ఉండాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్లు, అమ్మ ఒడి పథకంలో ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌ల పంపిణీపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ‘అమ్మ ఒడి’ చెల్లింపుల నాటికి కోరుకున్న వారికి ల్యాప్‌టాప్‌లు ఇచ్చేందుకు సిద్ధం కావాలన్నారు. ప్రతి గ్రామానికీ అన్ లిమిటెడ్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని చెప్పారు. క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటర్నెట్ కేబుల్స్ తెగిపోయి.. అవాంతరాలు వచ్చే పరిస్థితి ఉండకూడదని, అలాంటి సమస్యలను అధిగమించేలా ఆ వ్యవస్థను తీర్చిదిద్దాలని సూచించారు. ‘వైఎస్సార్ జగనన్న కాలనీల్లోకి కూడా ఇంటర్నెట్ నెట్వర్క్ తీసుకు రావాలి. ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేయాలి. హెచ్‌టి లైన్ నుంచి సబ్‌స్టేషన్ వరకు, సబ్‌స్టేషన్ నుంచి పంచాయతీల వరకు అండర్ గ్రౌండ్ కేబుల్ తీసుకెళ్లే ఆలోచనతో ముందుకు సాగాలి. గ్రామ పంచాయతీ వరకు అన్ లిమిటెడ్ నెట్‌వర్క్‌ను తీసుకెళ్లాలి’ అని చెప్పారు. ఈ సమీక్షలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ ఎన్.శ్రీకాంత్, ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ఛైర్మన్ పి.గౌతంరెడ్డి, ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ఎండీ ఎం.మధుసూదన్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘ఇంటి నుంచి వర్క్ చేసే వారికి ఇంటర్నెట్’
సాక్షి, అమరావతి : ఇంటి నుంచి పని చేసే వారికి అంతరాయం కలగకుండా ఇంటర్ నెట్ సదుపాయం కల్పిస్తున్నట్లు పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించారు. 'కరోనా' కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు పకడ్బంది చర్యల నేపథ్యంలో మంత్రి సూచనతో టెలికం, ఇంటర్ నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో కరోనా వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలలో భాగంగా ఇంటర్ నెట్ సదుపాయంపై మంత్రి గౌతమ్ రెడ్డి ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్‌తో చర్చించి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోవిడ్-19 వైరస్ నివారణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని తెలిపారు. (క్యాస్టింగ్ కౌచ్‌పై పెదవి విప్పిన అనుష్క) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశమంతా రేపు(ఆదివారం) 'జనతా కర్ఫ్యూ'కి సిద్ధమవుతోందన్నారు. ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తోన్న ఉద్యోగులు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకు ఏ ఇబ్బంది కలగకుండా 24 గంటల ఇంటర్ నెట్ సౌకర్యాన్ని అందించాలని సూచించారు. సామాజిక దూరం పాటిస్తూనే కీలకమైన విధులు నిర్వహించే ప్రతి ఒక్కరికీ టెలికమ్ సేవలు కూడా అంతరాయం కలగకుండా చూడాలని మంత్రి తెలిపారు. వారి ప్లాన్లకు అనుగుణంగా ఇంటర్ నెట్, టెలికమ్ సేవలను తప్పనిసరిగా అందించేలా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. అందుకోసం ఫీల్డ్ లెవల్లో పని చేసే సిబ్బందిని సిద్ధంగా ఉంచుకుని ఎలాంటి సాంకేతిక కారణాల వలన ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు. (కరోనా : గూగుల్ స్పెషల్ వెబ్సైట్ ) కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందకుండా చూడడంలో ప్రతి పౌరుడి బాధ్యత ఉందని అన్నారు. భారత జాతిని రక్షించేందుకు సరిహద్దుల్లో సమరం చేసే జవాన్లతో సమానంగా కరోనాపై యుద్ధం చేసే వారంతా తన దృష్టిలో వీరసైనికులని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యాధి వ్యాప్తిపై అవగాహన కలిగి, బాధ్యతగా, నియమ నిబంధనలకు అనుగుణంగా అందరూ తమ కర్తవ్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. (జనతా కర్ఫ్యూ: పెట్రోల్ బంక్‌లు బంద్ ) -
‘ప్రాథమిక’ సహకారం!
సాక్షి, అమరావతి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పరిపుష్టం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఎన్నికల హామీ మేరకు సహకార రంగాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకులతో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను లాభాల బాట పట్టించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 2,051 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను పూర్తి స్థాయిలో కంప్యూటరీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్నెట్ సౌకర్యంతో సహా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరీకరణకు రూ.101.39 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనాలను రూపొందించారు. తెలంగాణలో 906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను కంప్యూటరీకరించారు. గ్రేడింగ్‌కు కసరత్తు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరీకరణను అత్యంత ప్రాధాన్య అంశంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సిబ్బందికి శిక్షణ, జవాబుదారీతనం పెంచడంతో పాటు క్రమం తప్పకుండా ఆడిట్ చేయాలని నిర్ణయించారు. గ్రామ సచివాలయాల సహాయంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేయనున్నారు. తరచూ తనిఖీలు నిర్వహించడం ద్వారా సహకార సంఘాల్లో క్రమశిక్షణ, జవాబుదారీతనం పెంచనున్నారు. రుణ పరపతి, లాభ నష్టాలు, రికవరీ ఆధారంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, ప్రాథమిక సహకార సంఘాలను గ్రేడింగ్ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఆరు నెలల్లో సిఫారసులు.. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో సభ్యులైన రైతులకు పంట రుణాలను ఇవ్వడం, సమర్ధవంతంగా వసూలు చేయడమే కాకుండా ఇతర సేవలు అందించడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేలా వీటిని తీర్చిదిద్దేందుకు చర్యలను చేపట్టనున్నారు. దీనిపై అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేసేందుకు ప్రతిష్టాత్మక సంస్థను ఎంపిక చేసి బాధ్యతలను అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు నెలల్లోగాసిఫార్సులు తెప్పించుకుని అందుకు అనుగుణంగా చర్యలను చేపట్టనున్నారు. పంట రుణాలు ఇవ్వడంతో పాటు విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా చేపట్టి నూటికి నూరు శాతం రికవరీ చేస్తే స్వయం ప్రతిపత్తి సాధించవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఐదు జిల్లాల్లో నిరర్థక ఆస్తులు రూ.116.52 కోట్లు నిరర్ధక ఆస్తుల కారణంగా విజయనగరం, ప్రకాశం, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఆరి్థకంగా బలహీన పడ్డాయి. ఈ ఐదు జిల్లాల్లో కేంద్ర సహకార బ్యాంకుల నిరర్ధక ఆస్తులు రూ.116.52 కోట్లకు చేరుకున్నాయి. మొత్తం 2,051 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో 1,240 సంఘాలు లాభాల్లో ఉండగా 811 సంఘాలు నష్టాల్లో ఎదురీదుతున్నాయి. -
మారుమూల ఠాణాలకు టెక్నాలజీ
సాక్షి, హైదరాబాద్: పోలీసుశాఖ మరింత ఆధునిక సాంకేతికతను సంతరించుకునేందుకు కసరత్తు చేస్తోంది. మారుమూల ఠాణాలను సాంకేతికంగా బలోపేతం చేయనుంది. దీనికితోడు మరిన్ని కొత్త వాహనాలను సమకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పోలీస్ శాఖకు అత్యాధునిక వాహనాలను ప్రభుత్వం సమకూర్చింది. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా తెలంగాణ పోలీస్ బ్రాండ్ ప్రజల్లో గుర్తుండిపోయేలా వాహనాలపై తెలంగాణ పోలీస్ లోగోతోపాటు పెట్రోలింగ్, ట్రాఫిక్, ఇంటర్సెప్టార్ తదితర పదాలను తీర్చిదిద్దారు. నాలుగేళ్ల క్రితం రూపొందించిన ఈ బ్రాండింగ్‌లో స్వల్ప మార్పు చేయాలని లోగో పొజిషన్, స్టిక్కరింగ్ కలర్లో కొంత మార్పు తీసుకురావాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. బ్లూకోల్ట్స్ వాహనాలకు టెక్నాలజీపరంగా మార్పులు, చేర్పులు చేసి ఘటనాస్థలి నుంచే ఫొటోలు, వీడియోలు, వివరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పంపే విధంగా అనుసంధానించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంతో ఠాణాల నుంచి డీజీపీ కార్యాలయానికి అనుసంధానం ఏర్పడింది. ఎఫ్ఐఆర్, కేసు డైరీ, నిందితుల వివరాలు, ఫొటోలు.. ఇలా అన్ని క్షణాల్లో ఉన్నతాధికారుల చేతికి అందుతున్నాయి. కొనుగోలు చేసే పెట్రోలింగ్ వాహనాల్లో ట్యాబ్, జీపీఎస్ అనుసంధానం, జియో ట్యాగ్ చేసిన హాట్స్పాట్లు కనిపించేలా టఫ్ప్యాడ్లు అందుబాటులోకి రాను న్నాయి. ఏసీ సదుపాయం కలిగిన పెట్రోలింగ్ వాహనాలతో గల్లీ గస్తీని మరింత విస్తృతం చేసేందుకు అవకాశం కల్పించి ట్లు అయింది. ప్రతీ ఠాణాకు రెండు పెట్రోలింగ్వాహనాలు, 4 బ్లూకోల్ట్స్ కొత్త వాహనాలు అందించాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. వాహనాల కొనుగోలుకు 500 కోట్లు నూతన జిల్లాలు, పోలీస్ కమిషనరేట్ల నిమిత్తం పోలీస్‌శాఖకు మరిన్ని వాహనాలు అవసరమయ్యాయి. తాజాగా ఆరు వందలకుపైగా వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. గతేడాది హెచ్ఐసీసీలో జరిగిన పోలీస్ కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రూ.500 కోట్లతో మరిన్ని కార్లు, పెట్రోలింగ్ బైకులు కొనుగోలు చేస్తున్నట్టు పోలీస్ శాఖ వర్గాలు తెలిపాయి. -
ఇంటింటికీ ఫైబర్ కనెక్టివిటీ... వైఫై సౌకర్యం
-రెండంకెల వృద్ధి రేటు సాధించడంలో సహకరించాలి -బ్యాంకర్ల సమావేశంలో చంద్రబాబు వినతి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటింటికి ఫైబర్ కనెక్టవిటీ ఇస్తున్నామని, అన్ని కూడళ్లలో వైఫై సౌకర్యం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కొత్తగా ఆదాయ వనరుల సమీకరణ కార్యకలాపాలపై సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా బ్యాంకర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. అంగన్ వాడీ కార్యకర్తలు, 6గామ కార్యదర్శులకు ఇప్పటికే ట్యాబ్‌లు అందిస్తున్నామని, వీటి ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాల లబ్ది పేదలకు చేరువ చేయనున్నట్లు ఆయన తెలిపారు. శనివారం లేక్‌వ్యూ అతిధి గృహంలో ముఖ్యమంత్రి వాణిజ్య బ్యాంకుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగానికి, మహిళా సంఘాలకు, అలాగే రాష్ట్ర అభివృద్ధికి రుణాల మంజూరును పెంచాల్సిందిగా బ్యాంకర్లను ముఖ్యమంత్రి కోరారు. ప్రజల ఆహార అలవాట్లు మారిపోయాయని, పౌల్ట్రీ, మత్య్స ఉద్యాన అనుంబంధ రంగాలకు డిమాండ్ పెరిగిందన్నారు. ఈ రంగాల రైతులకు రుణాల మంజూరును ఎక్కువగా చేయాలని, తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సీఎం కోరారు. ఎర్ర చందనం విక్రయాల ద్వారా రెండు దశల్లో 3000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. బైరటీస్ ద్వారా 5000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందన్నారు. ఈ-పాస్ ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక నెలలోనే 45 కోట్ల రూపాయలను ఆదా చేసినట్లు ఆయన వివరించారు. ఇసుక విక్రయాలను మహిళా సంఘాలకు అప్పగించడం ద్వారా విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నామన్నారు. రెండంకెల వృద్ది సాధించేందుకు బ్యాంకులు అవసరమైన ఆర్థిక సాయం అందించాలని ఆయన కోరారు. నూతన రాజధాని అమరావతిలో బ్యాంకుల తమ బ్రాంచీలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేసేందుకు బ్యాంకులు సహకరించాల్సిందిగా చంద్రబాబు కోరారు. -
4జీ నగరంగా వరంగల్
తొలిసేవలు ఇక్కడి నుంచే... ఈ నెలాఖరుకల్లా ప్రారంభం సాక్షి, హన్మకొండ: నాలుగోతరం సెల్యులార్ సేవలు తెలంగాణలో వరంగల్ నగరంలో మొదటిసారిగా అందుబాటులోకి రానున్నాయి. హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం అందించేందుకు రిలయన్స్ సంస్థ ఈ మేరకు అన్నీ సిద్ధం చేసింది. ఫిబ్రవరి నెలాఖరు కల్లా 4జీ సేవలు అందుబాటులోకి తెస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ సేవలు మొదట హైదరాబాద్‌లో అందుబాటులోకి తేవాలని రిలయన్స్జియో సంస్థ నిర్ణయించింది. అయితే హైదరాబాద్ నగరం మొత్తాన్ని 4జీ సేవల పరిధిలోకి తీసుకురావాలంటే ఐదు వేలకు పైగా టవర్లు నిర్మించాల్సి ఉంది. నిర్దేశిత గడువులోగా ఈ టవర్ల నిర్మాణం పూర్తి అయ్యే పరిస్థితి లేకపోవడంతో రిలయన్స్ సంస్థ రెండో ప్రాధాన్యతా నగరంగా వరంగల్‌ను ఎంచుకుంది. 4జీ సేవలు అందించేందుకు నగరం పరిధిలో మొత్తం 126 టవర్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2015 ఫిబ్రవరి మొదటివారం నాటికి 110 టవర్లు బిగించారు. ఈ నెలాఖరు లేదా మార్చి మొదటివారంలో 4జీ సేవలు వరంగల్ నగరంలో ప్రారంభించేందుకు ఆ సంస్థ సమాయత్తమైంది. మొదటి ఆరు నెలలు ఉచితంగా వైఫై సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ-పంచాయతీకి ఇక్కట్లు
కరీంనగర్ సిటీ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ-పంచాయతీలకు బాలారిష్టాలు దాటడం లేదు. గ్రామపంచాయతీల్లో పారదర్శకత, వేగవంత మైన పాలనను అందించేందుకు టీఆర్ఎస్ సర్కార్ ఈ-పంచాయతీలకు శ్రీకారం చుట్టింది. తొలివిడతలో 319 ఈ-పంచాయతీలు లక్ష్యం నిర్ణయించగా 106 జీపీలకే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించింది. ఈ-పంచాయతీల కోసం జిల్లాలోని 319 గ్రామపంచాయతీలకు, 57 మండల పరిషత్ కార్యాలయాల్లో, మూడు డీఎల్పీ కార్యాలయాల్లో, రెండు డీపీవో కార్యాలయంలో, ఒకటి సీఈవో కార్యాలయంలో కంప్యూటర్లు అమర్చారు. ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ఆయా పంచాయతీలకు మోడెం పంపించారు. 383 కంప్యూటర్లకు గాను 381 మోడెమ్స్ జిల్లాకు చేరాయి. ఇప్పటి వరకు 55 గ్రామ పంచాయతీలు, 40 మండల పరిషత్‌లు, రెండు డీఎల్పీవో కార్యాలయాల్లో, ఒకటి డీపీవో కార్యాలయంలో, ఒకటి సీఈవో కార్యాలయంలో మోడమ్స్‌ను ఇన్స్టాల్ చేశారు. ఇంటర్నెట్ పెండింగ్ ఈ-పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం అడ్డంకిగా మారింది. ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటున్నారు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ టవర్స్, సిగ్నల్స్ లేకపోవడంతో ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడం సాధ్యపడడం లేదు. ఇంటర్నెట్ లేక ఈ ప్రయత్నం వృథా అవుతుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 160కు మాత్రమే కనెక్షన్.. జిల్లాకు తొలివిడతలో 319 గ్రామపంచాయతీలను ఈ-పంచాయతీలుగా గుర్తించినా.. అందులో 160 పంచాయతీలకు మాత్రమే ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చారు. మిగతా 221 గ్రామపంచాయతీలకు బీఎస్ఎన్ఎల్ టవర్స్ లేకపోవడంతో కంప్యూటర్లు అందజేసి చేతులు దులుపుకున్నారు. మొదటి విడతలోనే దాదాపు 60 శాతం గ్రామపంచాయతీలు ఇంటర్నెట్ సౌకర్యానికి నోచుకోకపోయూరుు. దీంతో 1207 గ్రామపంచాయతీల్లో ఎన్ని ఈ-పంచాయతీలకు దూరమవుతాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. ప్రత్యామ్నాయ మార్గాలపై నజర్ ఈ-పంచాయతీలుగా మార్చే క్రమంలో ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. చాలాచోట్ల బీఎస్ఎన్ఎల్ టవర్స్, సిగ్నల్స్ లేకపోవడంతో ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఇవ్వలేకపోతున్నారు. ఇలాంటి గ్రామపంచాయతీలను గుర్తించి ఇతర అవకాశాలను తెలియజేయాలని ఇప్పటికే అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. దీంతో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల సేవలు తీసుకోవడం, డాటా కార్డులు తదితర అవకాశాలపై కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.. - కుమారస్వామి, డీపీవో 221 గ్రామపంచాయతీలకు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అందుబాటులో లేకపోవడాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. బీఎస్ఎన్ఎల్ అధికారులతో సంప్రదించి కొత్త లైన్ వేసైనా పంచాయతీలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని సర్కార్ ఆదేశించింది. ఈ క్రమంలో కొత్త లైన్ వేసే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది.