ఇంటింటికీ ఫైబర్ కనెక్టివిటీ... వైఫై సౌకర్యం
-రెండంకెల వృద్ధి రేటు సాధించడంలో సహకరించాలి
-బ్యాంకర్ల సమావేశంలో చంద్రబాబు వినతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటింటికి ఫైబర్ కనెక్టవిటీ ఇస్తున్నామని, అన్ని కూడళ్లలో వైఫై సౌకర్యం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కొత్తగా ఆదాయ వనరుల సమీకరణ కార్యకలాపాలపై సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా బ్యాంకర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. అంగన్ వాడీ కార్యకర్తలు, 6గామ కార్యదర్శులకు ఇప్పటికే ట్యాబ్‌లు అందిస్తున్నామని, వీటి ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాల లబ్ది పేదలకు చేరువ చేయనున్నట్లు ఆయన తెలిపారు. శనివారం లేక్‌వ్యూ అతిధి గృహంలో ముఖ్యమంత్రి వాణిజ్య బ్యాంకుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగానికి, మహిళా సంఘాలకు, అలాగే రాష్ట్ర అభివృద్ధికి రుణాల మంజూరును పెంచాల్సిందిగా బ్యాంకర్లను ముఖ్యమంత్రి కోరారు.
ప్రజల ఆహార అలవాట్లు మారిపోయాయని, పౌల్ట్రీ, మత్య్స ఉద్యాన అనుంబంధ రంగాలకు డిమాండ్ పెరిగిందన్నారు. ఈ రంగాల రైతులకు రుణాల మంజూరును ఎక్కువగా చేయాలని, తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సీఎం కోరారు. ఎర్ర చందనం విక్రయాల ద్వారా రెండు దశల్లో 3000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. బైరటీస్ ద్వారా 5000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందన్నారు. ఈ-పాస్ ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక నెలలోనే 45 కోట్ల రూపాయలను ఆదా చేసినట్లు ఆయన వివరించారు. ఇసుక విక్రయాలను మహిళా సంఘాలకు అప్పగించడం ద్వారా విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నామన్నారు. రెండంకెల వృద్ది సాధించేందుకు బ్యాంకులు అవసరమైన ఆర్థిక సాయం అందించాలని ఆయన కోరారు. నూతన రాజధాని అమరావతిలో బ్యాంకుల తమ బ్రాంచీలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేసేందుకు బ్యాంకులు సహకరించాల్సిందిగా చంద్రబాబు కోరారు.