అన్ని కాలేజీలకూ వైఫై
- రెండేళ్లలో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్షన్
- స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ప్రారంభ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాబోయే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో వైఫై నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. డిజిటల్ ఇండియాలో భాగంగా రెండేళ్లలో ప్రతి ఇంటికీ 15-20 ఎంబీపీఎస్, కాలేజీలకు ఒక గిగా బైట్ బ్యాండ్ విడ్త్‌తో ఫైబర్ కనెక్టివిటీ ఇస్తామని తెలిపారు. విజయవాడలోని పీబీ సిద్ధార్థ కళాశాలలో సోమవారం జరిగిన 13 జిల్లాల స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ప్రారంభం, యాప్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
భవిష్యత్తు అంతా నాలెడ్జ్‌దేనని, ఈ వయసులో కొంచెం కష్టపడితే బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఒక్కో ఆవిష్కరణ ప్రపంచాన్నే మార్చేస్తుందని, బిల్‌గేట్స్ తీసుకొచ్చిన ఇంటర్నెట్ ప్రపంచం మొత్తాన్ని ఒక గ్రామంగా మార్చేసిందని చెప్పారు. 600 మంది విద్యార్థులు రకరకాల యాప్‌లను అభివృద్ధి చేశారని, అందులో కొన్ని చాలా బాగున్నాయని తెలిపారు. లెర్న్, ఎర్న్, అప్లయ్, ప్రోపగేషన్ పేరుతో లీప్ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు.
యాప్‌లను అభివృద్ధి చేసిన విద్యార్థులు వాటిగురించి ఐదుగురికి శిక్షణ ఇస్తే స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తామని తెలిపారు. అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటుచేసుకోవాలని, యాప్‌ల అభివృద్ధిని ప్రోత్సహించాలని సూచించారు. రాబోయే రోజుల్లో సెక్రటేరియట్ మొత్తాన్ని ఇ-కార్యాలయంగా మారుస్తామన్నారు. భవిష్యత్తులో హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీల కోర్సులను ఆన్‌లైన్‌లో ఏపీలో ప్రవేశపెడతామని చెప్పారు.
కుటుంబ నియంత్రణ వద్దు
గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ కావాలని చెప్పానని, కానీ మారిన పరిస్థితులను బట్టి వద్దని చెబుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలో రోజూ 9 లక్షల మంది పుడుతుంటే, 9 లక్షల మంది చనిపోతున్నారని దీనివల్ల యువత లేకుండా పోయే ప్రమాదం ఉందని చెప్పారు. అందుకే జనాభాను బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ వంద ఎకరాలు ఇస్తే ఏపీకి మోడల్ ఐటీఐ మంజూరు చేస్తామని చెప్పారు.
యాప్‌లు పరిశీలించిన సీఎం
తొలుత సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో రాష్ట్రంలోని 17 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ప్రారంభించిన సీఎం వివిధ జిల్లాల ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు తయారుచేసిన యాప్స్‌ను పరిశీలించారు. వారిని అభినందించి పలు సూచనలు చేశారు.