ఆర్థిక కమిటీల చైర్మన్లు ఎవరు?
* పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికివ్వడం ఆనవాయితీ
* పీయూసీ, అంచనాల కమిటీల కోసం తెరపైకి సీనియర్ల పేర్లు
* నేడు నామినేషన్ల దాఖలు... రేపు ఉపసంహరణ గడువు
* ఏకగ్రీవం కాకపోతే 25న ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో ఆర్థిక సంఘాల (ఫైనాన్స్ కమిటీలు) ఎన్నికకు సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రజా పద్దులు(పీఏసీ), అంచనాల కమిటీ (ఎస్టిమేట్స్), ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ)లకు శాసన సభ నుంచి 9 మంది, మండలి నుంచి నలుగురు చొప్పున సభ్యులను ఎన్నుకోనున్నారు. ఇందులో నుంచే ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకుంటారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను కమిటీల చైర్మన్లు, సభ్యుల ఎన్నికకు సోమవారం (23వ తేదీ) మూడు గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మూడు నుంచి ఐదు గంటల వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 24వ తేదీన మూడు గంటల వరకు ఉపసంహరణల గడువుగా నిర్ణయించారు. అయితే, ఏకగ్రీవం కాని పక్షంలో 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ జరుగుతుంది. ఇదిలాఉండగా, ఈ కమిటీలలో పీఏసీ చైర్మన్‌గా ప్రతిపక్షం నుంచి ఒకరిని ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇక మిగిలిన అంచనాల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీలకు చైర్మన్లు ఎవరు అవుతారనే దానిపై అధికార టీఆర్‌ఎస్‌లో చర్చ మొదలైంది. సాధారణంగా సీనియర్ సభ్యులను చైర్మన్లుగా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. అయితే, అధినేత మదిలో ఏముందో తెలియక, ఎవరికి అవకాశం దక్కుతుందో చెప్పలేకపోతున్నారు.
కార్పొరేషన్ పదవులకు కత్తెరేనా!
టీఆర్‌ఎస్ నుంచి పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశించి భంగపడ్డారు. సంఖ్యా పరిమితి కారణంగా కొందరికి అవకాశం రాలేదు. దీంతో వీరి దృష్టంతా ముఖ్యమైన ఆర్టీసీ, టీఎస్‌ఐఐసీ వంటి కార్పొరేషన్ పదవులపై ఉంది. ఇదే జాబితాలో వాటర్ గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్‌తో పాటు, ఇతర కొన్ని కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. ఈ పదవులు ఎపుడు భర్తీ అవుతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇపుడు పీయూసీ, అంచనాల కమిటీల చైర్మన్ల పదవులు అంగీకరిస్తే, వీటిని చూపించి కార్పొరేషన్ చైర్మన్ల పదవులకు ఎక్కడ కత్తెర పెడతారో అన్న ఆందోళన వీరిలో వ్యక్తం అవుతోంది. ఈ పదవులను చూపించి తమ పేరును పరిగణనలోకి తీసుకోకుండా పోతారేమోనన్న అనుమానమూ వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ సభ్యులు ఏనుగు రవీందర్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, సోమారపు సత్యనారాయణ, దివాకర్‌రావు, రామలింగారెడ్డి వంటివారు పదవుల రేసులో ఉన్నవారే. బాజిరెడ్డి గోవర్ధ్దన్ సీనియర్ అయినా, ఆయన ఇప్పటికే వక్ఫ్‌బోర్డు సభా సంఘానికి చైర్మన్‌గా ఉన్నారు. మహిళల్లో కొండా సురేఖ మాత్రమే సీనియర్‌గా ఉన్నారు. దీంతో వీరిలో ఎవరినైనా ఎంచుకుంటారా..? లేదా జూనియర్ల నుంచే ఒకరిని ఎంపిక చేస్తారా? అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
పీఏసీ చైర్మన్‌గా కిష్టారెడ్డి..!
ప్రతిపక్షానికి దక్కనున్న శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే పి. కిష్టారెడ్డి నియామకం ఖరారైనట్లే. ఇందుకు సంబంధించి సోమవారం ఆ పార్టీ అధికారికంగా త న నిర్ణయాన్ని ప్రకటించనుంది. నాలుగుసార్లు గెలిచి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నా ఇంతవరకు మంత్రిపదవి లభించని ఆయనకే ఈ పదవిని కట్టబెట్టాలని గతంలో పార్టీ నాయకులు నిర్ణయించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న సీనియర్లు గీతారెడ్డి, టి.జీవన్‌రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డీకే అరుణ మంత్రి పదవులను నిర్వహించిన విషయం తెలిసిందే. అందువల్ల కిష్టారెడ్డివైపే పార్టీ నాయకత్వం కూడా మొగ్గుచూపింది. అయితే ఈ పదవి కోసం మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఒకరిద్దరు నాయకులు పోటీపడుతున్నట్లు సమాచారం. దీంతో తొలిరెండేళ్లు కిష్టారెడ్డికి అవకాశమిచ్చి, చివరి రెండేళ్లు రాంరెడ్డి వెంకటరెడ్డికి ఇవ్వాలని పార్టీనాయకులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు రెండురోజుల క్రితం అసెంబ్లీలో జానారెడ్డి చాంబర్‌లో ఒక నిర్ణయానికి వచ్చినట్లు, సోమవారం దీనినే ప్రకటించనున్నట్లు తెలిసింది.