ఎవరికి చెప్పాలే
ఏసీబీ చిరునామా తెలియని బాధితులు
అవగాహన కల్పించే విషయాన్ని మరిచిన ఏసీబీ
ఎక్కడా దర్శనమివ్వని పోస్టర్లు, బోర్డులు
అవినీతి రహిత పాలనకు తోడ్పాటు, వివిధ శాఖల్లో జరిగే అవినీతిపై సమాచార సేకరణ, అవినీతి నిర్మూలనపై నిరంతర పరిశీలన, దీని కోసం ప్రజల సహకారం తీసుకోవడం, అవినీతి వ్యతిరేక చట్టాలు పటిష్టంగా అమలు చేయ డం, వీటిపై ప్రజలకు అవగాహన కల్పించడం... ఇదీ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ప్రధాన లక్ష్యం(మిషన్). ఈ లక్ష్యం కోసం అవినీతి నిరోధక శాఖ తీసుకోవాల్సిన చర్యలు ఎన్నో ఉన్నాయి. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బం ది వల్ల ఇబ్బంది పడేవారు.. ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎలా ఫిర్యాదు చేయాలనే సమాచారాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విధిగా పెట్టాలి. ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నంబర్లను అందరికీ తెలియజేయాలి. ఏసీబీకి ఉన్న టోల్‌ప్రీ నంబర్ 155361ను వీలైనన్ని ప్రదేశాల్లో, ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కచ్చితంగా పెట్టాలి. అవివీతి నిరోధక శాఖ జిల్లా విభాగం మాత్రం ప్రజలకు అవగాహన కల్పించడంలో వెనుకడుగు వేస్తోంది. ఫిర్యాదు చేయాల్సిన నెంబర్లు ఎక్కువ మందికి తెలిస్తే ఎక్కువ ఫిర్యాదులు వచ్చి.. పని ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారో ఏమో.. ఏసీబీ జిల్లా అధికారులు అవగాహన కల్పించే విషయాన్ని పూర్తిగా పక్కనబెట్టారు. జిల్లా కేంద్రంతోపాటు, జిల్లా వ్యాప్తంగా ఏబీసీకి సంబంధించిన పోస్టర్లుగానీ, బోర్డులుగానీ ఎక్కడా కనిపించడం లేదు. ప్రభుత్వ యం త్రాంగం అవినీతి వల్ల ఇబ్బంది పడేవారు ఎవరికి ఫిర్యాదు చేయాలనే సమాచా రం జిల్లావ్యాప్తంగా ఎక్కడా లేకపోవడంతో బాధితులు ఇబ్బంది పడుతున్నారు.
రెండేళ్లుగా ఇలాగే...
అవినీతి నిరోధక శాఖకు సంబంధించి జిల్లాలో డీఎస్పీ అధికారి నేతృత్వం వహిస్తున్నారు. ఏసీబీ వరంగల్ విభాగం పరిధిలో మరో నలుగురు ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు ఉన్నారు. వీరితోపాటు కింది స్థాయి సిబ్బంది ఉన్నారు. వరంగల్ నగరం చుట్టుపక్కల భూముల ధరలు పెరగుతుండడంతో పాటు జిల్లా వ్యాప్తంగా భూములకు డిమాండ్ ఉండడంతో... రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల్లో అవినీతికి అంతులేకుండాపోరుుంది. మిగిలిన శాఖల్లోనూ అవినీతి ఉన్నా... ఈ రెండు శాఖల్లో మాత్రం ఉన్నతాధికారుల స్థాయిలోనే అవినీతి సాగుతోంది. భూ వివాదాల పరిష్కారం పేరిట పోలీసు శాఖ సైతం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలతో అవినీతి విషయంలో పోటీ పడుతోంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల, పోలీసు శాఖ పరిధిలోని అన్ని కార్యాలయాల్లో బయటి వ్యక్తుల పెత్తనం చెలాయిస్తున్నారు. ఇది అంతటా తీవ్రంగానే ఉంది.
సొంత భూమికి సంబంధించి అధికారి పత్రాలు కావాలన్నా రెవెన్యూ అధికారులు ఎంతో కొంత ముట్టజెప్పనిదే పనిచేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏసీబీకి ఫిర్యాదు చేయాలని ఎవరైనా అనుకున్నా... ఎక్కడా ఎలాంటి సమాచారం ఉండడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయాల్సిన సమాచారంపై ఏసీబీ బోర్డులు, పోస్టర్లు వేయకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అవినీతి ప్రభుత్వ సిబ్బందికి సహకరించే ఉద్దేశంతోనే ఏబీసీ ఇలా వ్యవహరిస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఏసీబీ కేసుల పురోగతి తీరును చూసినా ఇలాగే అనిపిస్తోంది. పొరుగు జిల్లాలతో పోల్చితే వరంగల్ విభాగం ఏసీబీ అధికారులు నమోదు చేస్తున్న కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉండడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
జిల్లాలో ఏసీబీ కేసుల వివరాలు...
2011 13
2012 16
2013 19
2014 11