భర్త ఇంటి ఎదుటే భార్య అంత్యక్రియలు
చౌటుప్పల్: భార్యను అతి కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు భర్త. అతడి ఇంటిముందే మృతదేహంతో ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నా అత్తింటి వారి కనికరం కరువైంది. మృతురాలి తల్లిదండ్రుల రోదనలు వర్ణనాతీతం.చివరకు ఇంటి ముందే గుంతను తవ్వి శవాన్ని పూడ్చారు. నిందితుడికి చెందిన రెండెకరాల పొలంలో భార్య మృతికి సార్మక చిహ్నంగా స్థూపాన్ని నిర్మించాలని, ఆ భూమిని పార్కుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. చౌటుప్పల్ మండలం పంతంగిలో మిర్యాల శ్రీశైలం(28) తన భార్య పార్వతమ్మ(24)ను గత ఆదివా రం రోకలిబండతో కొట్టి చంపిన విషయం తెలిసిందే.
మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పార్వతమ్మ మృతదేహాన్ని నిందితుడి ఇంటి ఎదు ట ఉంచి నాలుగు రోజులుగా బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేశారు. నిందితుడి వాటాకు 6ఎకరాల భూమి ఉంది. ఇరువర్గాల పెద్ద మనుషులు కూర్చొని 2.10ఎకరాల భూమి మృతురాలి కుటుంబానికి ఇచ్చే లా ఒప్పందం చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. నిందితుడి తండ్రి పోలీ సుల రక్షణలో ఉన్నారు. తల్లి యశోధ పరారీలో ఉంది. ఈ భూమి యశోధ పేరున ఉండడంతో, ఒప్పందం ముం దుకు సాగలేదు. దీంతో పార్వతమ్మ చనిపోయి 5రోజులు గడిచినా అంత్యక్రియలు చేయకుండా ఆందోళన సాగించారు.
అసలు పార్వతమ్మను చంపింది ఎందుకంటే..
పార్వతమ్మ, శ్రీశైలంలది ఒకే గ్రామం. నాలుగేళ్ల కిందట వివాహమైంది. శ్రీశైలం ఓ రకమైన సైకో మనస్తత్వం. నిత్యం పార్వతమ్మను వేధింపులకు గురి చేసేవాడు. ఇతని వేధింపులకు తాళలేక పార్వతమ్మ దసరా పండుగ నుంచి తల్లి గారి ఇంటి వద్దే ఉంటోంది. శ్రీశైలం అప్పుడప్పుడు పార్వతమ్మ వద్దకు వెళ్లి వస్తున్నాడు. 2నెలల క్రితం ఓ సారి వెళ్లి ఇంటికి రమ్మని, లేదంటే కత్తిపీటతో కోసుకుంటానని బెదిరించాడు. ఆమె భయపడి కత్తిపీటను లాక్కుంది. శ్రీశైలమే చాకు తో చేయి కోసుకుని, భార్యపై నింద మోపాడు. అప్పటి నుంచి భార్యభర్త మధ్య సమస్య మరింత జఠిలమైంది. గత ఆదివారం మళ్లీ పార్వతమ్మ వద్దకు వెళ్లాడు. ఇంటికి రమ్మని అడిగాడు. అందుకు ఆమె చాకుతో చేయి కోసిందెవరో, తేలాకే వస్తానని తెగేసి చెప్పింది. అందు కు శ్రీైశైలం పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పుకుంటానని చెప్పాడు. దీంతో పార్వతమ్మ అప్పుడే వస్తానని చెప్పింది. అప్పటి దాకా నేనెక్కడ ఉండాలని శ్రీశైలం ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీం తో శ్రీశైలం రోకలిబండతో నీళ్ల సంపు వద్ద బట్టలు ఉతుకుతున్న పార్వతమ్మ తలపై మోదాడు. తల పగిలి, మెదడు చిట్లి బయటికొచ్చింది. కుటుంబ సభ్యులు గుర్తించి హైదరాబాద్‌కు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు చెప్పారు.
తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతం..
కడగంచిబీరప్ప,యశోద దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమార్తె పార్వతమ్మ, రెండో కుమార్తె శ్వేత ఐదో తరగతి చదువుతోంది. కొడుకులు లేరు. పెద్దకుమార్తె తమ కళ్ల ముందే ఉంటుందనే ఉద్దేశంతో అదే గ్రామానికి చెందిన అబ్బాయితో పెళ్లి చేశారు. వివాహమై నాలుగేళ్లయినా సంతానం లేదు. కూతురు చనిపోయి, ఐదు రోజులుగా శవం కళ్లముందే ఉండడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. వారి రోదన అరణ్య రోదనగానే మారింది. తండ్రి బీరప్ప బుధవారం స్పృహ తప్పడంతో ఆస్పత్రిలో చేర్చారు. తల్లి యశోద ముందు నడిచి అంత్యక్రియలు నిర్వహించింది.
పార్వతమ్మ మృతికి చిహ్నంగా స్థూపం..
పార్వతమ్మ పెళ్లి సమయంలో ఇచ్చిన కట్న కానుకలు, నిందితుడికి చెందిన 2.10ఎకరాల భూమిని మృతురాలి కుటుంబానికి ఇచ్చేలా ఒప్పందం చేశారు. నిందితుడి తల్లి పరారీలో ఉండడం, భూమి ఆమె పేరున ఉండడం తో, ఒప్పందం ముందుకు సాగలేదు. చివరకు మృతురాలి బంధువులు గురువారం అంత్యక్రియలు చేశారు. శ్రీశైలం ఇంటి ఎదుటే గుంతను తవ్వి శవాన్ని పూడ్చిపెట్టారు. ఈ 2.10ఎకరాల భూమిలోనే ఈ ఇల్లు ఉంది. శవాన్ని పూడ్చిన చోటే పార్వతమ్మ మృతికి స్మారక చిహ్నంగా స్థూపాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ రెండెకరాల భూమిని పార్కుగా అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నారు.